ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ బీజేపీ ఆందోళన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పేదలకు ఉద్దేశించిన వివిధ గృహ నిర్మాణ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ మంగళవారం నగరంలో చేపట్టిన విధాన సౌధ చలో కార్యక్రమాన్ని పోలీసు భగ్నం చేశారు. ఫ్రీడం పార్కులో ర్యాలీ ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన బీజేపీ నాయకులు పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం మంత్రి కేజే. జార్జ్‌లు రాజీనామా చేసేంత వరకు పోరాటాన్ని సాగిస్తామని ప్రకటించారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదల పాలిట కంటకంగా తయారైందని ఆరోపించారు.
పేదల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వారినే విస్మరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని విమర్శించారు. ఆయనను అధికారం నుంచి దించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని ప్రకటించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి అసమర్థుడుగా తయారయ్యారని, శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప మాట్లాడుతూ మహిళలపై నిరంతరం అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శించారు.
దళితులు, మైనారిటీల సమస్యలపై స్పందించడం లేదని ఆరోపించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప, బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ మంత్రులు గోవింద కారజోళ, ఆర్. అశోక్ ప్రభృతులు ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా వచ్చిన నాయకులు, కార్యకర్తలను జేడీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అందరినీ బీఎంటీసీ బస్సుల్లో తరలించారు.