- సత్వర శిక్షలకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి దోషులకు సత్వరం శిక్షలు పడడానికి త్వరలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. రాష్ర్టంలో శాంతి భద్రతల పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయం కృష్ణాలో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నేరాలను సమర్థంగా అరికట్టడానికి నగర పోలీసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లకు అధునాతన వాహనాలను సమకూర్చనున్నట్లు తెలిపారు.
ఆ వాహనాలకు బహుళ కాంతివంతమైన లైట్లను కూడా అమర్చనున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి కొత్త సహాయక కేంద్రాలను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎన్‌జీఓల సహకారంతో వీటిని నిర్వహిస్తామన్నారు. శాంతి భద్రతలపై ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి అన్ని రకాల చర్యలను చేపడతామని వెల్లడించారు. సీనియర్ పోలీసు అధికారులు శాంతి భద్రతలపై ఎక్కువ నిఘా వహించేలా చర్యలు చేపడతామని చెప్పారు.
పోలీసు స్టేషన్లకు అందే అన్ని ఫిర్యాదులకు విధిగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిన పరిస్థితుల్లో ఆయా అదనపు డీజీపీలను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నగరంలో పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి సంబంధించి తాము ఎవరినీ రక్షించడం లేదని స్పష్టం చేశారు.
కాగా సమావేశం అనంతరం నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ విడిగా మాట్లాడుతూ వరుస అత్యాచార సంఘటనలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. పీజీ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి కేసు నమోదు చేయడంలో సీఐ తప్పుందని అంగీకరించారు. కాగా నగరంలోని విబ్‌గ్యార్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశంలో పాల్గొన్నారు.