మహిళల భద్ర తా చర్యలు అమలుచేయాలి
అధికారులకు మహిళల రక్షణ కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు తీసుకునే చర్యలు అమలయ్యేలా చూడాలని రాష్ట్ర మహిళా భద్రత, రక్షణ కమిటీ చైర్మన్ పూనం మాలకొండయ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన తొలి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు కొండా సురేఖ, గొంగిడి సునీత, శోభ, కమిటీ కన్వీనర్ సునీల్ శర్మ, సభ్యులు శైలజా రామయ్యర్, చారుసిన్హా, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, ఆమ్రపాలి పాల్గొన్నారు.
మహిళల భద్రత విషయంలో కచ్చితమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని మహిళా ఎమ్మెల్యేలు కోరారు. మహిళల కేసుల కోసం జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మొబైల్ కోర్టులు ఏర్పాటు చేయాలని,ప్రతి జిల్లాలో మహిళా పోలీ స్ స్టేషన్ల సంఖ్య పెంచాలని, పాఠశాలల విద్యార్థినులకు డ్రెస్‌కోడ్ పెట్టాలని సూచనలు చేశారు. డ్వాక్రా, స్వయంసహాయక బృందాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఇద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసేలా అవకాశం కల్పించాలని అన్నారు.
భ్రూణహత్యలు నివారించాలి
భ్రూణహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని మహిళా ఎమ్మెల్యేలు సూచించారు. పుట్టబోయే శిశువు ఎవరనేది నిర్థారిస్తున్న స్కానింగ్‌సెంటర్ల అనుమతిని రద్దు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరారు. టీనేజ్ అమ్మాయిలకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, స్వయంరక్షణ (సెల్ ్ఫడిఫెన్స్)లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. గృహహింసపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినపుడు అక్కడ వారిని సహృదయంగా ఆదరించాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసుల్ని ఉంచాలని, ఈవ్‌టీజింగ్, గృహహింస విషయంలో 2, 3 రోజుల్లోనే చర్య తీసుకునేలా చూడాలని ఆమె సూచించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం: మంత్రి మహేందర్‌రెడ్డి
తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నదని, ప్రధానంగాా ఆర్టీసి బస్సులలో మహిళల భద్రతకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తె లిపారు. ఆర్టీసి బస్సుల్లో మహిళల రక్షణకు సంబంధించి జరిగిన చర్చలో మంత్రి పి. మహేందర్‌రెడ్డితో పాటు ఆర్టీసి ఎండీ పూర్ణచందర్రావు, జేఎండీ రమణారావు, ఓఎస్డి సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంటనగరాల్లోని 2,600 బస్సు సర్వీసులకు 20 రోజుల్లో ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటుచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ విధంగా చేయడం వల్ల సంస్థపై రూ.3.92 కోట్ల భారం పడుతుందని, ఇటు, అటు రెండు సీట్ల మేర స్థలం పోతుందని ఎండీ పూర్ణచందర్రావు పేర్కొనగా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. బస్సులు, బస్టాండులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నట్లు చెప్పారు.