గుంటూరులో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు
పలుచోట్ల ధర్నాలు, ర్యాలీలతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నిరసనలు
పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్
లేకుంటే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరిక
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలన్న విద్యార్థి సంఘాలు
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్‌నాయక్, నాగేంద్ర ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్‌థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్‌టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్‌లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment