ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఎంట్రన్స్
ఎంపికైన వారికి ఉచిత శిక్షణ
కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖ నగరాల్లో కేంద్రాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఎంపిక చేసిన కళాశాలల్లో ఐఐటీ శిక్షణను ఆదే కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లు ఇచ్చేవారు. ఈసారి నారాయణ కళాశాలలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో శిక్షణ ఇప్పించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది.
తొలుత కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు లేదా పది కి.మీ. పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్‌లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు అంతర్భాగంగా ఐఐటీ, నీట్ శిక్షణను కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందే ఇవ్వనున్నారు.
విద్యార్థుల కాలేజీలు వేరైనప్పటికీ ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో వారి హాజరు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీనివల్ల వారి అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా శిక్షణను ఇంటర్ బోర్డు చేపట్టింది. ఈ ప్రత్యేక శిక్షణపై ఆసక్తి గల ప్రభుత్వ లెక్చరర్లతో వారు పనిచేస్తున్న కాలేజీల్లోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అయితే, అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ, ఐఐటీ, నీట్ నమూనా పరీక్షల నిర్వహణ వంటి అన్ని అంశాలను నారాయణ విద్యాసంస్థలే చూసుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment