
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కార్యక్రమం విజయవంతమైంది. గత సోమవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సాగుకు నిరంతర కరెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సరఫరాను మరికొన్ని రోజులపాటు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. విద్యుత్ సంస్థల సీఎండీలు ఒకట్రెండు రోజుల్లో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కనీసం మరోవారం రోజుల పాటు సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరాను పొడిగించే అవకాశముంది.
24 గంటల విద్యుత్ సరఫరా నేపథ్యంలో గత గురువారం 7,750 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత జూలై నుంచే ఉమ్మడి మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో నిరంతర విద్యుత్ అందిస్తున్నారు. గత సెప్టెంబర్ 13న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 9,500 మెగావాట్లుగా నమోదైంది. ప్రస్తుతం అన్ని జిల్లాలకు 24 గంటల కరెంట్ అందిస్తున్నా డిమాండ్ పెద్దగా పెరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ పంటలు కోతకొచ్చిన దశలో ఉండటంతో విద్యుత్‌కు డిమాండ్ లేదు. అందువల్లే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రబీ నేపథ్యంలో దీనికి డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. వేసవి విద్యుత్ అవసరాలు కలుపుకుంటే ఈ డిమాండ్ 11,000 మెగావాట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం నిర్మాణంలోఉన్న 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఆలోగా పూర్తి చేసి విద్యుదుత్పత్తిని ప్రారంభించడం ద్వారా ఈ డిమాండ్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.
ఉదయం పూట అధిక డిమాండ్
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ప్రారంభించిన తర్వాత రోజువారీ గరిష్ట డిమాండ్ ప్రతి రోజూ ఉదయం 8–9 గంటల మధ్య నమోదవుతోంది. రాష్ట్రంలో ఉన్న 23 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లలో అత్యధిక పంపు సెట్లు ఈ సమయంలోనే విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. 7,750 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఇదే వ్యవధిలో నమోదైంది. రాత్రి వేళల్లో మాత్రం డిమాండ్ అమాంతం పడిపోతోంది. రాత్రి 2–3 గంటల వ్యవధిలో 5,000–6,000 మెగావాట్ల మధ్య నమోదవుతోంది.
డిస్కంలపై వెయ్యి కోట్ల అదనపు భారం
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తే అదనంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. ఇందుకు ఏటా డిస్కంలపై రూ.1,000 కోట్ల వరకు అదనపు భారం పడనుందని ప్రాథమిక లెక్కలు వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment