నగరంలోని హైడెర్ష్కోఠ్ పీరం చెరువులోని గిరిధారి గేటెడ్ కమ్యూనిటీ నుంచి డిస్కంకు గతంలో నెలకు రూ.12 నుంచి 13 లక్షల వరకు విద్యుత్ బిల్లు వసూలయ్యేది. ఇటీవల ఆ గెటేడ్ కమ్యూనిటీ భవనంపై సోలార్ రూఫ్‌టాఫ్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెలవారి విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి గతంలో ఏడాదికి రూ.కోటికి పైగా విద్యుత్ బిల్లు రాగా.. సోలార్ పలకల ఏర్పాటుతో ప్రస్తుతం రూ.40 లక్షలు తగ్గింది. నిథిమ్ క్యాంపస్ నుంచి నెలకు రూ.2.50 లక్షలు తగ్గింది. వాణిజ్య సంస్థలు, వ్యక్తిగత గృహ వినియోగదారులు తమ నెలవారి విద్యులు బిల్లులను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ నెట్ మీటరింగ్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటుండటంతో విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల పవర్ సేల్స్ భారీగా పడిపోతున్నాయి. ఆయా వినియోగదారుల నుంచి డిస్కంకు రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి... భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రానుండటంతో ఇప్పటి నుంచే రెడ్‌కో దూకుడుకు కళ్లెం వేయాలని డిస్కంలు భావించాయి. ఆ మేరకు మీ ‘పవర్’కాస్తా ఆపండి అంటూ అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పత్తితో డిస్కంల సేల్స్ తగ్గిపోయాయా..? సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్లకు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు బ్రేకులు వేస్తున్నాయా...? అంటే అవువనే అంటున్నారు విద్యుత్ అధికారులు. సంప్రదాయ విద్యుత్‌తో పోలిస్తే హైడల్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి భారీ ఖర్చుతో కూడుకుని ఉండటం, ఆ ఉత్పత్తికి అవసరమైన వనరులు కూడా పరిమితంగా ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి సారించింది. సంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. మూడు కిలోవాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లపై 40 శాతం, పది కిలో వాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లకు 20 శాతం రాయితీ ఇస్తుండటంతో నెలకు సగటున 300పైగా యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్‌పై దృష్టి సారించారు.
పవర్ సేల్స్ పడిపోతుండటంతో...
విద్యుత్ సంస్థలు ఏటా కరెంట్ చార్జీలు పెంచుతుండటం, నిర్ధేశిత సమయానికి ఆలస్యంగా రీడింగ్ నమోదు చేస్తుండటం వల్ల స్లాబ్‌రేట్ మారిపోతోంది. అధిక మొత్తంలో బిల్లులు వస్తుండటంతో దీని నుంచి బయటపడేందుకు చాలా మంది రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ ద్వారా 90 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3,186 మంది తమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని 60.9 మెగావాట్లకుపైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడమే కాదు.. విద్యుత్‌ను పంపిణీ సంస్థకు విక్రయిస్తున్నాయి. ఇలాగే నెట్ మీటరింగ్ కనెక్షన్లు ఇచ్చుకుంటూ పోతే డిస్కం పవర్ సేల్స్ భారీగా పడిపోయి వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని ఇంజనీర్లు భావిస్తున్నారు. దీంతో రెడ్‌కో దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించింది. సోలార్ రూఫ్ టాప్‌నెట్ మీటరింగ్‌పై అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తోంది.
డిస్కంలకే విక్రయం...
వంద ఎస్‌ఎఫ్‌టీ స్థలంలో ఒక కేవీఏ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కేవీఏ ప్యానల్ రోజుకు సగటున ఐదు యూనిట్ల చొప్పున ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే 25 ఏళ్ల వరకు పని చేస్తుంది. ఒక కేవీఏ ప్యానల్‌కు రూ.52 వేలు అవుతుండగా, ఈ మొత్తంలో కేంద్రం 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. అపార్ట్‌మెంట్‌లకు రూఫ్ టాప్ ప్యానల్‌కు 20 శాతం సబ్సిడీ వస్తుంది. సోలార్ ప్యానళ్ల ధరలు కూడా ఇప్పుడు తగ్గాయి. సీపీడీసీఎల్ పరిధిలో రోజుకు సగటున 90 మెగావాట్ల (అంటే 45,000 యూనిట్ల) సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుంది. డిస్కం ఆయా జనరేషన్ సంస్థల నుంచి అవసరాన్ని బట్టి యూనిట్‌కు రూ.6 నుంచి రూ.11 వరకు వెచ్చించి కొనుగోలు చేసి గృహ వినియోగదారులకు సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ఆదాయం తగ్గి డిస్కం సేల్స్ పడిపోయి, సంస్థ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుండటంతో అనధికారిక ఆంక్షలు కొనసాగించాల్సి వస్తున్నట్లు డిస్కంలు ప్రకటిస్తున్నాయి.
ఆంక్షలు పెట్టడం అన్యాయం
ఇంటిపై ఒకసారి సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారులకు లబ్ధిచేకూర్చే ఈ పథకాన్ని మరింత ప్రోత్సహించాల్సిన డిస్కంలు తమ రెవెన్యూ పడిపోతుందనే ఆలోచనతో సోలార్ నెట్ మీటరింగ్‌పై అనధికారిక ఆంక్షలు కొనసాగి స్తుండటం అన్యాయం.
– బి.అశోక్‌కుమార్‌గౌడ్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ అసోసియేషన్
మీ ‘పవర్’తగ్గించండి...
‘సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్ల జారీతో డిస్కం పవర్ సేల్స్ పడిపోతున్నాయి. సంస్థకు అంతో ఇంతో రెవెన్యూఇచ్చే వినియోగదారులే నెట్ మీటరింగ్‌కు వెళ్లిపోయి.. నెలవారి బిల్లులను తగ్గించుకుంటున్నారు. ఇది డిస్కంల నష్టాలకు ఓ కారణమవుతోంది. సోలార్ ఎనర్జీ దూకుడు తగ్గించాలని కోరుతూ ఇప్పటికే టీఎస్ రెడ్‌కోకు విజ్ఞప్తి చేశాం.’ (శనివారం రాత్రి ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్‌లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో రఘుమారెడ్డి చేసిన వాఖ్యలుఇవి)
– రఘుమారెడ్డి, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment