
విజయవాడలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీలో పాల్గొన్న అధికారులు
సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రంలో ఆదా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, విద్యుత్ శాఖ సమన్వయంతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్టార్ రేటెడ్ ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఇళ్లలో ఉపయోగించడంవల్ల సగటున 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, విద్యుత్ బిల్లులూ తగ్గుతాయి కాబట్టి వాటిని ఉపయోగించాలని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ రాష్ట్ర ప్రజలకు సూచించారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్‌తో కలిసి విజయవాడలో మంగళవారం ఆయన జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రారంభించారు. ఏపీఎస్‌ఈసీఎం, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) ఆధ్వర్యంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. మల్లారెడ్డి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె పద్మజనార్ధనరెడ్డి, విజయవాడ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.