సాక్షి, అమరావతి: సర్దుబాటు చార్జీలు శాశ్వత ప్రాతిపదికగా విద్యుత్ బిల్లులలో విధించరని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రూ అప్ చార్జీలనేవి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్ధేశించిన కాలానికి మాత్రమే బిల్లులలో ప్రత్యేకంగా వేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత నిర్దేశిత సర్దుబాటు చార్జీలు ఏపీఈఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం 2022 మార్చి నెల వరకు మాత్రమే వసూలు చేస్తారని, ఈ ఎనిమిది నెలల తర్వాత ఉండవని శ్రీకాంత్ వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..
► ఇంధన – విద్యుత్ సేకరణ వ్యయ సర్దుబాటు చార్జీ (త్రైమాసిక సర్దుబాటు చార్జీ) ప్రతి త్రైమాసికానికి వేర్వేరుగా మదింపు చేస్తారు. క్రిందటి త్రైమాసికంలో వేసిన చార్జీ మరుసటి త్రైమాసికానికి కలపరు.
► త్రైమాసికం–1లో అదనపు ఖర్చు రూ.100 కోట్లు అయ్యి, విద్యుత్ వినియోగం 12,000 మిలియన్ యూనిట్లు ఉంటే, సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 8 పైసలు అవుతుంది. తర్వాతి త్రైమాసికంలో అదనపు వ్యయం రూ.200 కోట్లు ఉంటే అదే వినియోగానికి సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 16 పైసలు అవుతుంది. ఈ లెక్కన మొదటి త్రైమాసికం చార్జీ 8 పైసలు కలుపుకుని 24 పైసలు అవ్వదు.
► విద్యుత్ సంస్థలకు మూడు నెలలకొకసారి సర్దుబాటు చేసే వెసులుబాటు 2012 వరకు (త్రైమాసిక ఇంధన సర్ చార్జీ నియమావళి) అమలులో ఉండేది. ఆ తర్వాత వార్షిక విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు నియమావళి అందుబాటులోకి వచ్చింది.
► విద్యుత్ పంపిణీ సంస్థలు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ సరఫరా కోసం చేసిన వాస్తవ అదనపు ఖర్చులకు రూ.2,500 కోట్లు సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా గతేడాది డిసెంబర్‌లోనే ప్రతిపాదనలను సమర్పించారు. ఆ సంవత్సరాలకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదన పంపలేదు.
► 2019–20లో సర్దుబాటు ప్రతిపాదనలకు 2019 ఫిబ్రవరిలో, విద్యుత్ కేంద్రాల వారీగా అంచనా వేసిన ఇంధన (బొగ్గు, గ్యాస్) చార్జీలు పెరిగిపోవటమే ప్రాథమిక కారణం. ఈ వ్యయం పెరుగుదల 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఏపీ జెన్‌కో థర్మల్ కేంద్రాలకు దాదాపు రూ.0.77/యూనిట్, కృష్ణపట్నంకు రూ 0.46/యూనిట్, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకు రూ.0.84/యూనిట్, స్వతంత్ర విద్యుత్ కేంద్రాలకు రూ .0.69/యూనిట్, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు రూ. 0.56/యూనిట్ గా ఉంది.
సర్దుబాటు చార్జీలు శాశ్వతం కాదు
Published Wed, Sep 15 2021 3:11 AM | Last Updated on Wed, Sep 15 2021 10:35 AM
Comments
Please login to add a commentAdd a comment