
సాక్షి, అమరావతి: పారిశ్రామిక విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో పురోగతి కనిపిస్తున్నా.. ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడే భారీ పరిశ్రమలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు ఇటీవల ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లిని కలిశారు. ఆ రంగానికి విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం పురోగతిని ఇంధన శాఖ సమీక్షించింది. ఆ వివరాలివీ..
అది గడ్డుకాలమే!
రాష్ట్రంలో 2019 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 3,975.66 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది అదే త్రైమాసికంలో 2,754.14 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దాదాపు 31 శాతం డిమాండ్ తగ్గింది. ఈ కాలంలో పారిశ్రామిక విద్యుత్ రెవెన్యూ వసూళ్లు 32 శాతం తగ్గి విద్యుత్ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్ వినియోగం తిరిగి వేగం పుంజుకుని 1,444.75 మిలియన్ యూనిట్లకు చేరింది.
పరిశ్రమలకు ప్రభుత్వ అండ
కోవిడ్ సమయంలోనూ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు రాయితీలు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.
– శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment