సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఫీడర్ల పరిధిలో వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ జరిగినట్టు విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ నాగలక్ష్మి చెప్పారు. ఇంత త్వరగా విద్యుత్ సరఫరా చేయడం రికార్డు అని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రెండు రోజులుగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల 13న 134 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే... 15న 150.9 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే రెండు రోజుల్లోనే 16 ఎంయూలు పెరిగింది. రానురాను ఇంకా డిమాండ్ పెరగొచ్చని డిస్కమ్‌ల సీఎండీలు హరినాథ్‌రావు, నాగలక్ష్మి, పద్మా జనార్దన్‌రెడ్డి నివేదిక పంపారు.
జెన్‌కో అలెర్ట్
డిస్కమ్‌లు ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదికపై లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) రాబోయే పరిస్థితిని అంచనా వేసింది. ఈ నెలాఖరుకు రోజుకు 160 ఎంయూల విద్యుత్ డిమాండ్ ఉండే వీలుందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 800 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్ పనిచేస్తోంది. మరో యూనిట్‌ను ఉత్పత్తిలోకి తేవడానికి అవసరమైన బొగ్గు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)తో అధికారులు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment