Thermal power generation project
-
థర్మల్ ఉత్పత్తిలో ‘కోత’ లేదు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుదుత్పత్తిని సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ (ఐఈజీసీ) నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు థర్మల్ పవర్ స్టేషన్లు సగటున 73 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 240 నుంచి 255 మిలియన్ యూనిట్లు ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) రోజుకు సమారు 100 నుంచి 105 మిలియన్ యూనిట్లను గ్రిడ్‌కు సరఫరా చేస్తోంది. అంటే రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 నుంచి 45 శాతం వరకు ఏపీ జెన్కో నుంచే సమకూరుతోంది. అలాగని సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించడానికి లేదు. దీంతో పర్యావరణ హితం కోరి పవన, సౌరవిద్యుత్ వినియోగానికి ‘మస్ట్ రన్ స్టేటస్’ కింద అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇష్టానుసారం ఆపలేం సాధారణంగా లోడ్ డిస్పాచ్ సెంటర్ ఫ్రీక్వెన్సీని బట్టి గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా, స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. గ్రిడ్‌కు మనం ఎంత విద్యుత్ సరఫరా చేస్తామో అంత తీసుకోవచ్చు. ఎక్కువ (ఓవర్ డ్రా) తీసుకుంటే ఆ మేరకు చెల్లించాలి. అపరాధరుసుం భరించాలి. తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటే దక్షణాది రాష్ట్రాల రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ హెచ్చరికలు జారీచేస్తుంది. తరచూ ఇలా చేస్తే గ్రిడ్ కనెక్షన్ తప్పిస్తుంది. మన అవసరాలకు మించి గ్రిడ్‌కు సరఫరా చేస్తే డిమాండు లేనప్పుడు అదనపు విద్యుత్‌కు పైసా రాదు. దీంతో విద్యుత్ డిమాండు ఎప్పుడు ఎలా ఉంటుందో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా అధికారులు నిత్యం పరిశీలిస్తుంటారు. డిమాండుకు తగ్గట్టు సరఫరా పెంచాలో, తగ్గించాలో వారు సూచిస్తారు. అయితే డిమాండు లేని సమయాల్లో థర్మల్ ప్లాంట్లను షట్‌డౌన్ చేసి డిమాండు పెరగ్గానే లైటప్ చేయడం వీలుకాదు. అందువల్ల ప్లాంట్లను ఆన్‌లోనే ఉంచాలి. అందుకే 55 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్లాంట్లను సిద్ధంగా ఉంచడానికి ఏయే చర్యలు తీసుకోవాలో సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం ఇచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ జెన్కో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించింది. దుష్ప్రచారాలను నమ్మవద్దు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 45 శాతానికి, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 55 శాతానికి విద్యుదుత్పత్తిని తగ్గించి, రాష్ట్ర అవసరాలకు బయట కొనుగోలు చేసే ఎత్తుగడలో ప్రభుత్వం ఉందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మనవసరం లేదు. సౌర, పవన విద్యుత్ అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది పర్యావరణపరంగా మంచిదైనందున పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర విద్యుత్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. – కె.విజయానంద్, చైర్మన్, ఏపీ జెన్కో -
భళా బూడిద..!
సాక్షి, అమరావతి: బూడిద అనగానే ఎందుకూ పనికిరాదని తేలిగ్గా తీసేస్తాం. కానీ, అలా తీసిపడేసిన బూడిదతోనే కంకర తయారు చేసి పటిష్టంగా రహదారులు, భవనాలను నిర్మించవచ్చు. అది కూడా సిమెంటు అవసరం లేకుండానే. ఈ మేరకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్ చేసిన ప్రయోగం ఫలించింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిదతో ఇబ్బందులు తొలగి జీవరాశులకు, పర్యావరణానికి మేలు కలుగనుంది. రోడ్లు, భవనాల నిర్మాణంలో ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. బూడిద విక్రయాల వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఆదాయమూ పెరగనుంది. ఫలించిన పరిశోధనలు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థాల్లో బూడిద (ఫ్లై యాష్) ప్రధానమైంది. దేశంలో బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఏటా సుమారు 258 మిలియన్ మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇందులో 78 శాతం బూడిదను సిమెంట్, సిరామిక్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. బూడిద స్వభావాన్ని బట్టి వేరుచేసి టన్ను రూ.80 చొప్పున విక్రయిస్తారు. మిగిలినది యాష్ పాండ్లలో మిగిలిపోతుంది. అది గాలి, నీరులో కలిసి వాటిని కలుషితం చేస్తోంది. ఫలితంగా వాతావరణం దెబ్బతిని, దాని ప్రభావం జీవరాశులపై పడుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని ఓ వైపు ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం వస్తున్న బూడిద వినియోగంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లిమిటెడ్... బూడిదను ఉపయోగించి జియో పాలిమర్ ముతక కంకరను అభివృద్ధి చేసింది. ఈ కంకర జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్‌సీసీబీఎం) ధ్రువీకరించింది. ఇది సహజ కంకరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఏటా దేశంలో 2వేల మిలియన్ మెట్రిక్ టన్నుల కంకరకు డిమాండ్ ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదతో చేసిన కంకర ఈ డిమాండ్‌ను చాలావరకు తీర్చే అవకాశం ఉంది. రాతి కంకర కోసం కొండలు, భూమిని తవ్వడం వల్ల ఏర్పడే పర్యావరణ అసమతౌల్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్చు తగ్గుతుంది జియో పాలిమర్ కంకర ఉపయోగించినప్పుడు సిమెంట్ అవసరం లేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిద ఆధారిత జియోపాలిమర్ కంకరే బైండింగ్ ఏజెంటుగా పని చేస్తుంది. ఈ కంకర కర్బన ఉద్గారాలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన బూడిదను మూడేళ్లలో వంద శాతం వినియోగించాలి. అందువల్ల త్వరలోనే జియో పాలిమర్ కంకర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
పర్యావరణహిత ‘పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి దిశగా రాష్ట్రంలో వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మొట్టమొదటి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎఫ్‌జీడీ) ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా విశాఖ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లో అందుబాటులోకి రానుంది. వ్యవసాయానికి పూర్తిగా సౌర విద్యుత్‌నే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంటు స్థాపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఎన్టీపీసీలో పర్యావరణ అనుకూల ఎఫ్‌జీడీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. బొగ్గును కాల్చే ప్రక్రియలో విడుదలయ్యే హానికర వాయువుల తీవ్రతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాదాపు 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది మార్చి కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.871 కోట్ల వ్యయంతో 2 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎఫ్‌జీడీ దక్షిణ భారతదేశంలోనే తొలి ప్రాజెక్టు కావడం విశేషం. ఎఫ్‌జీడీలతో కాలుష్యానికి అడ్డుకట్ట! ఎన్టీపీసీ దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఎఫ్‌జీడీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 38 ఎన్టీపీసీ ప్లాంట్లలో 60 గిగావాట్ల సామర్థ్యంతో ఎఫ్‌జీడీలను అందుబాటులోకి తీసుకురావాలనేది తమ లక్ష్యమని కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించింది. దేశంలోని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 71 శాతం వాటా కలిగిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు 80 శాతం పారిశ్రామిక ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. దీంతో థర్మల్ కేంద్రంలోనే కాలుష్యాన్ని తగ్గించేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు. విశాఖ ప్రాజెక్టులో 143 మీటర్ల పొడవున్న నాలుగు ఎఫ్‌జీడీ చిమ్నీలను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయనున్నారు. ఇవి నేరుగా కర్బన ఉద్గారాలను గాలిలో కలవనివ్వవు. వాటి తీవ్రతను తగ్గించి విడుదల చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
ర్యాక్‌లు కొనుక్కోండి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఖాళీ అయ్యాయి. బొగ్గు రవాణాలో జాప్యం కారణంగా రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే బొటాబొటిగా అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం సరుకు రవాణా రైళ్లకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బొగ్గు తరలింపు కోసం కనీసం 10 రైల్వే ర్యాక్‌లను సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల సెప్టెంబర్ వరకూ విద్యుదుత్పత్తి సాఫీగా సాగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. అయితే ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 70 ర్యాక్‌లు నిల్వ ఉంచండి.. కొరత దృష్ట్యా కనీసం 70 ర్యాక్‌ల బొగ్గును నిల్వ ఉంచాలని ఎన్టీపీసీ లిమిటెడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకు కేంద్ర విద్యుత్ శాఖ లేఖలు రాసింది. బొగ్గు తరలింపు కోసం పూర్తిగా రైల్వేలపై ఆధారపడొద్దని లేఖలో పేర్కొంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలోని సింగరేణి కాలరీస్, ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. రెండు చోట్లా కలిపి రోజూ దాదాపు 10 నుంచి 12 ర్యాక్‌ల బొగ్గు వస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా అక్కడ ప్రస్తుతం 98,566 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3, 4 రోజులకు సరిపోతాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్(కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా 2,99,947 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 15 రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 21,000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇక్కడ ప్రస్తుతం కేవలం 7,997 మెట్రిక్ టన్నులే ఉంది. వర్షాకాలం కావడంతో డిమాండ్ తగ్గి రోజుకు 196.27 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. హిందూజా పవర్ ప్లాంట్ నుంచి కూడా రాష్ట్రానికి విద్యుత్ అందుతోంది. ఇక్కడ రోజుకి 9,600 మెట్రిక్ టన్నులు బొగ్గు వినియోగిస్తుండగా ప్రస్తుతం 30,917 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ నిల్వతో మూడు రోజులు విద్యుదుత్పత్తి చేయవచ్చు. బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు 20 ర్యాక్‌ల వరకూ కేటాయింపులు పెంచాలని ఏపీ జెన్కో కోరుతోంది. పెరిగిన ఉత్పత్తి, డిమాండ్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి 27 శాతం పెరిగింది. గతేడాది జూన్ నాటికి 12,428.41 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా ఈ ఏడాది జూన్ నాటికి 15,913.37 మిలియన్ యూనిట్లకు పెరిగింది. మరోవైపు దీనికి తగ్గట్లు బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. ఆర్థికంగా భారమే.. ‘ర్యాక్‌లు సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్రం గతంలోనూ చెప్పింది. సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేస్తే రవాణా ఖర్చుల్లో దాదాపు 10 శాతం రాయితీ కూడా అందిస్తామంటోంది. అయితే ఇదేమీ తప్పనిసరి కాదు. ర్యాక్‌లను కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వాటి నిర్వహణ మరింత భారంగా మారుతుంది. ప్రభుత్వ రంగ థర్మల్ కేంద్రాలు సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేంద్రం సూచన మేరకు బొగ్గు దిగుమతి చేసుకునే ప్రైవేట్ సంస్థలు ర్యాక్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంది’ –బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
వరద ప్రాంతాల్లో వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ఫీడర్ల పరిధిలో వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ జరిగినట్టు విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ నాగలక్ష్మి చెప్పారు. ఇంత త్వరగా విద్యుత్ సరఫరా చేయడం రికార్డు అని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రెండు రోజులుగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల 13న 134 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే... 15న 150.9 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే రెండు రోజుల్లోనే 16 ఎంయూలు పెరిగింది. రానురాను ఇంకా డిమాండ్ పెరగొచ్చని డిస్కమ్‌ల సీఎండీలు హరినాథ్‌రావు, నాగలక్ష్మి, పద్మా జనార్దన్‌రెడ్డి నివేదిక పంపారు. జెన్కో అలెర్ట్ డిస్కమ్‌లు ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదికపై లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) రాబోయే పరిస్థితిని అంచనా వేసింది. ఈ నెలాఖరుకు రోజుకు 160 ఎంయూల విద్యుత్ డిమాండ్ ఉండే వీలుందని లెక్కగట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 800 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్ పనిచేస్తోంది. మరో యూనిట్‌ను ఉత్పత్తిలోకి తేవడానికి అవసరమైన బొగ్గు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)తో అధికారులు చర్చించారు. -
పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ ఏడాది దసరా పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేమని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్, ప్రాంతీయ అధ్యక్షుడు తఖీ, ఉపాధ్యక్షుడు వి.దానయ్య శుక్రవారం విద్యుత్ సౌధలో ప్రభాకర్‌రావును కలిసి పండుగ ప్రోత్సాహకాలు అందజేయాలని వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో సంస్థకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది పండుగ ప్రోత్సాహకాలు అందజేయలేమని ప్రభాకర్‌రావు వారికి వివరించారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 7–15 శాతం వరకు ప్రోత్సాహకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థ ఆర్థిక పరిస్థితిరీత్యా గతేడాది నుంచి ప్రోత్సాహకాలను నిలిపివేశారు. -
కాలుష్యకారక థర్మల్ ప్లాంట్ల మూత
న్యూఢిల్లీ: వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, గాలిలో స్వచ్ఛతను కాపాడేందుకు బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ. 4,400 కోట్లను కేంద్రం కేటాయించింది. దీనిలో భాగంగా పాతబడిన, కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండని థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను మూసేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ప్లాంట్ల భూమిని వేరే అవసరాలకు వాడనున్నారు. డీజిల్, కిరోసిన్‌తో పనిలేని వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులు సౌర విద్యుత్‌వైపు మొగ్గుచూపడానికి ‘పీఎం కుసుమ్’ పథకాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో రైతులు 35 లక్షల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. దీనిలో 20 లక్షల మంది రైతులు సొంతంగా సోలార్ పంప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు, మరో 15 లక్షల మందిని గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు సహాయం చేస్తామన్నారు. తమ నిరుపయోగ భూమిలో రైతులు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, గ్రిడ్‌కు అమ్మే పథకాన్ని మంత్రి ప్రతిపాదించారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు ఊతం పవర్, పునరుత్పాదక ఇంధన రంగానికి ఈ బడ్జెట్లో రూ. 22,000 కోట్లు కేటాయించారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు రూపంలో ప్రోత్సాహకాన్ని సమకూర్చుతామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన దేశీయ ఉత్పత్తి సంస్థలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే నిబంధనలను గత సెప్టెంబర్‌లో తెచ్చామని, దీనిని కొత్త విద్యుత్ ప్లాంట్లకు విస్తరిస్తున్నామన్నారు. ‘10 లక్షలు దాటిన జనాభా ఉన్న పెద్ద పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యత కష్టం. పెద్ద పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రణాళికలు రూపొందించే రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రమాణాలను ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది’ అని నిర్మల తెలిపారు. స్మార్ట్ విద్యుత్ మీటర్లు సంప్రదాయ విద్యుత్ మీటర్లను ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లుగా వచ్చే మూడేళ్లలో మార్చాలని రాష్ట్రాలను నిర్మల కోరారు. దీనివల్ల తమకు నచ్చిన సరఫరాదారును, రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ వినియోగదారులకు వస్తుందని ఆమె తెలిపారు. -
రూ.16 కోట్లు ‘బూడిద’ పాలు
జపాన్ కంపెనీ ‘ఎబెల్’కు పంపుల కాంట్రాక్టు నాణ్యత పరీక్షించకుండానే ఒప్పందాలు తొలుత తిరస్కరించిన జెన్కో సర్కారు ఒత్తిడితో మనసు మార్చుకున్న వైనం 17న సమావేశంలో ఆమోదముద్ర హైదరాబాద్: జపాన్‌కు చెందిన ఓ సంస్థ నుంచి ఏపీ జెన్కో భారీ సైజు పంపులను కొనేందుకు సిద్ధమైంది. వీటి పనితీరుపై ఆ సంస్థ చెప్పిన మాటలనే విశ్వసించి, కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను పలువురు సీనియర్ ఇంజనీర్లు వ్యతిరేకిస్తున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనివల్ల ఏపీ జెన్కోపై దాదాపు రూ.16.5 కోట్ల భారం పడే వీలుంది. ఒకవేళ పంపులు సరిగా పనిచేయకపోతే ఇంత డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని జెన్కో వర్గాలు అంటున్నాయి. థర్మల్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో బొగ్గును మండించినప్పుడు కొంత బూడిద వస్తుంది. ఇది బాయిలర్లలో ఉండకుండా బయటకు పంపేందుకు భారీ సైజు పంపులను వినియోగిస్తారు. ఏపీ జెన్కోలో ఇప్పటి వరకూ బీహెచ్ఈఎల్ వీటిని సమకూరుస్తోంది. ఏ యూనిట్‌లోనూ పంపుల వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఈక్రమంలో జపాన్‌కు చెందిన ‘ఎబెల్’ అనే సంస్థ పంపుల కాంట్రాక్టు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వం ఈ విషయమై జెన్కో అధికారులను వివరణ కోరగా, ఈ పంపులు అవసరం లేదని సర్కారుకు నోట్ పంపారు. అయితే, ఉన్నట్టుండి ఏపీ జెన్కో మళ్లీ ఎబెల్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఇప్పుడున్న ఏపీ జెన్కో ప్రాజెక్టుల్లో బూడిదను వేగంగా పంపే అవకాశం లేదని, తమ పంపులైతే 80 శాతం నీటిని వినియోగిస్తూ వేగంగా బూడిదను బయటకు పంపుతాయని ఎబెల్ సంస్థ వివరించినట్టు తెలిసింది. దీంతో ఏపీ జెన్కో పరిధిలో ఉన్న థర్మల్ యూనిట్లు అన్నింటిలోనూ ఎబెల్ పంపులను వాడాలని అధికారులు భావించినట్టు సమాచారం. మొత్తం 33 పంపులు అవసరమని అధికారులు లెక్కగట్టారు. ఒక్కో పంపు రూ.50 లక్షల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. మొత్తం రూ.16.5 కోట్లు వెచ్చించాలన్న నిర్ణయం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ నెల 17న ఈ కాంట్రాక్టుకు సంబంధించి ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఇందులో ఎబెల్కు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవానికి వీటిని ట్రయల్ బేస్డ్గా వాడాల్సి ఉన్నా, ఆ కంపెనీ ట్రాక్ రికార్డును నమ్మి అనుమతిస్తున్నట్టు ఆయన తెలిపారు. మూడేళ్ల గ్యారెంటీ ఇస్తామని సంస్థ చెప్పిందని, పంపులకు అవసరమైన విడిభాగాలను జపాన్‌లో ఉన్న ధరలకే అందించేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.