
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ ఏడాది దసరా పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేమని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్, ప్రాంతీయ అధ్యక్షుడు తఖీ, ఉపాధ్యక్షుడు వి.దానయ్య శుక్రవారం విద్యుత్ సౌధలో ప్రభాకర్‌రావును కలిసి పండుగ ప్రోత్సాహకాలు అందజేయాలని వినతిపత్రం సమర్పించారు.
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో సంస్థకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, ఈ ఏడాది పండుగ ప్రోత్సాహకాలు అందజేయలేమని ప్రభాకర్‌రావు వారికి వివరించారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 7–15 శాతం వరకు ప్రోత్సాహకాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థ ఆర్థిక పరిస్థితిరీత్యా గతేడాది నుంచి ప్రోత్సాహకాలను నిలిపివేశారు.