సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుదుత్పత్తిని సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ (ఐఈజీసీ) నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు థర్మల్ పవర్ స్టేషన్లు సగటున 73 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 240 నుంచి 255 మిలియన్ యూనిట్లు ఉంది.
ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) రోజుకు సమారు 100 నుంచి 105 మిలియన్ యూనిట్లను గ్రిడ్‌కు సరఫరా చేస్తోంది. అంటే రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 నుంచి 45 శాతం వరకు ఏపీ జెన్‌కో నుంచే సమకూరుతోంది. అలాగని సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించడానికి లేదు. దీంతో పర్యావరణ హితం కోరి పవన, సౌరవిద్యుత్ వినియోగానికి ‘మస్ట్ రన్ స్టేటస్’ కింద అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.
ఇష్టానుసారం ఆపలేం
సాధారణంగా లోడ్ డిస్పాచ్ సెంటర్ ఫ్రీక్వెన్సీని బట్టి గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా, స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. గ్రిడ్‌కు మనం ఎంత విద్యుత్ సరఫరా చేస్తామో అంత తీసుకోవచ్చు. ఎక్కువ (ఓవర్ డ్రా) తీసుకుంటే ఆ మేరకు చెల్లించాలి. అపరాధరుసుం భరించాలి. తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటే దక్షణాది రాష్ట్రాల రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ హెచ్చరికలు జారీచేస్తుంది. తరచూ ఇలా చేస్తే గ్రిడ్ కనెక్షన్ తప్పిస్తుంది. మన అవసరాలకు మించి గ్రిడ్‌కు సరఫరా చేస్తే డిమాండు లేనప్పుడు అదనపు విద్యుత్‌కు పైసా రాదు.
దీంతో విద్యుత్ డిమాండు ఎప్పుడు ఎలా ఉంటుందో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) ద్వారా అధికారులు నిత్యం పరిశీలిస్తుంటారు. డిమాండుకు తగ్గట్టు సరఫరా పెంచాలో, తగ్గించాలో వారు సూచిస్తారు. అయితే డిమాండు లేని సమయాల్లో థర్మల్ ప్లాంట్లను షట్‌డౌన్ చేసి డిమాండు పెరగ్గానే లైటప్ చేయడం వీలుకాదు. అందువల్ల ప్లాంట్లను ఆన్‌లోనే ఉంచాలి. అందుకే 55 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్లాంట్లను సిద్ధంగా ఉంచడానికి ఏయే చర్యలు తీసుకోవాలో సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం ఇచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ జెన్‌కో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించింది.
దుష్ప్రచారాలను నమ్మవద్దు
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 45 శాతానికి, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్‌టీటీపీఎస్)లో 55 శాతానికి విద్యుదుత్పత్తిని తగ్గించి, రాష్ట్ర అవసరాలకు బయట కొనుగోలు చేసే ఎత్తుగడలో ప్రభుత్వం ఉందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మనవసరం లేదు. సౌర, పవన విద్యుత్ అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది పర్యావరణపరంగా మంచిదైనందున పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర విద్యుత్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. – కె.విజయానంద్, చైర్మన్, ఏపీ జెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment