రూ.16 కోట్లు ‘బూడిద’ పాలు
జపాన్ కంపెనీ ‘ఎబెల్’కు పంపుల కాంట్రాక్టు
నాణ్యత పరీక్షించకుండానే ఒప్పందాలు
తొలుత తిరస్కరించిన జెన్‌కో
సర్కారు ఒత్తిడితో మనసు మార్చుకున్న వైనం
17న సమావేశంలో ఆమోదముద్ర
హైదరాబాద్: జపాన్‌కు చెందిన ఓ సంస్థ నుంచి ఏపీ జెన్‌కో భారీ సైజు పంపులను కొనేందుకు సిద్ధమైంది. వీటి పనితీరుపై ఆ సంస్థ చెప్పిన మాటలనే విశ్వసించి, కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను పలువురు సీనియర్ ఇంజనీర్లు వ్యతిరేకిస్తున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనివల్ల ఏపీ జెన్‌కోపై దాదాపు రూ.16.5 కోట్ల భారం పడే వీలుంది. ఒకవేళ పంపులు సరిగా పనిచేయకపోతే ఇంత డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని జెన్‌కో వర్గాలు అంటున్నాయి.
థర్మల్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో బొగ్గును మండించినప్పుడు కొంత బూడిద వస్తుంది. ఇది బాయిలర్లలో ఉండకుండా బయటకు పంపేందుకు భారీ సైజు పంపులను వినియోగిస్తారు. ఏపీ జెన్‌కోలో ఇప్పటి వరకూ బీహెచ్‌ఈఎల్ వీటిని సమకూరుస్తోంది. ఏ యూనిట్‌లోనూ పంపుల వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఈక్రమంలో జపాన్‌కు చెందిన ‘ఎబెల్’ అనే సంస్థ పంపుల కాంట్రాక్టు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
ప్రభుత్వం ఈ విషయమై జెన్‌కో అధికారులను వివరణ కోరగా, ఈ పంపులు అవసరం లేదని సర్కారుకు నోట్ పంపారు. అయితే, ఉన్నట్టుండి ఏపీ జెన్‌కో మళ్లీ ఎబెల్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఇప్పుడున్న ఏపీ జెన్‌కో ప్రాజెక్టుల్లో బూడిదను వేగంగా పంపే అవకాశం లేదని, తమ పంపులైతే 80 శాతం నీటిని వినియోగిస్తూ వేగంగా బూడిదను బయటకు పంపుతాయని ఎబెల్ సంస్థ వివరించినట్టు తెలిసింది. దీంతో ఏపీ జెన్‌కో పరిధిలో ఉన్న థర్మల్ యూనిట్లు అన్నింటిలోనూ ఎబెల్ పంపులను వాడాలని అధికారులు భావించినట్టు సమాచారం. మొత్తం 33 పంపులు అవసరమని అధికారులు లెక్కగట్టారు. ఒక్కో పంపు రూ.50 లక్షల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు.
మొత్తం రూ.16.5 కోట్లు వెచ్చించాలన్న నిర్ణయం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ నెల 17న ఈ కాంట్రాక్టుకు సంబంధించి ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఇందులో ఎబెల్‌కు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవానికి వీటిని ట్రయల్ బేస్డ్‌గా వాడాల్సి ఉన్నా, ఆ కంపెనీ ట్రాక్ రికార్డును నమ్మి అనుమతిస్తున్నట్టు ఆయన తెలిపారు. మూడేళ్ల గ్యారెంటీ ఇస్తామని సంస్థ చెప్పిందని, పంపులకు అవసరమైన విడిభాగాలను జపాన్‌లో ఉన్న ధరలకే అందించేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.