Araku Coffee Creating Records Internationally - Sakshi
Sakshi News home page

అరకు కాఫీ కప్పు రూ.637.. మన కాఫీకి జపాన్‌లో అద్భుత డిమాండ్‌ 

Published Mon, Oct 3 2022 4:06 AM | Last Updated on Mon, Oct 3 2022 6:59 PM

Araku coffee creating records internationally - Sakshi

సాక్షి, అమరావతి: అరకు కాఫీ అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తోంది. మన కాఫీ బ్రాండ్‌ ఇమేజ్‌ను విదేశీ మార్కెట్‌లో సుస్థిరం చేస్తోంది. ప్రస్తుతం జపాన్‌లో కప్పు అరకు కాఫీని ఏడు పౌండ్లకు విక్రయిస్తున్నారు. ఏడు పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.637. ఆదివారం జపాన్‌ పౌండ్‌ విలువ రూ.91.0267గా ఉంది. మొదటి నుంచి అంతర్జాతీయంగా అరకు కాఫీకి మంచి డిమాండ్‌ ఉంది.

మరోవైపు అత్యధికంగా కాఫీ తోటలను సాగు చేసే బ్రెజిల్, మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అరకు కాఫీకి మరింత డిమాండ్‌ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు కాఫీ ప్రాజెక్ట్‌ పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో అరబికా, రోబస్టా చెర్రీ కాఫీ రకాలను సాగు చేస్తున్నారు. ఇదే కాఫీ రకాలను సేంద్రీయ పద్ధతి(ఆర్గానిక్‌)లో కూడా సాగు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత డిమాండ్‌ పెరుగుతోంది. 

పెరుగుతున్న కాఫీ గింజల ధర  
గతేడాది అంతర్జాతీయంగా కాఫీ గింజల ఉత్పత్తి తగ్గడంతో అరకు కాఫీకి బయటి మార్కెట్‌లో మంచి ధర లభించింది. ఏడాది క్రితం వరకు అరకు కాఫీ గింజలు సాధారణంగా కిలో రూ.150 నుంచి రూ.180 ధర ఉండేది. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో అరిబిక్‌ పార్చిమెంట్‌(తొక్క తీసిన కాఫీ గింజలు) కిలో రూ.350 నుంచి రూ.380కి పైగా ధర లభించింది.

బెంగళూరులోని అనేక ప్రైవేటు సంస్థలు అరకు కాఫీ గింజలను సేకరిస్తాయి. ఆ గింజలను శుద్ధి చేసి ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడిగా, వివిధ రకాల కాఫీ పొడులుగా మార్చి ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తాయి. అయితే, వ్యాపారులు అరకు కాఫీ పొడి పేరుతోనే బెంగళూరును కేంద్రంగా చేసుకుని బ్రెజిల్, జపాన్‌ తదితర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement