
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని.. ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించాలని చెప్పినట్లు ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో రాష్టంలో విద్యుత్ డిమాండ్‌పై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నివేదికలను శుక్రవారం పరిశీలించారు. అందులో తేలిన అంశాలేమిటంటే..
- ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు 154 మిలియన్ యూనిట్లు. ఇందులో వ్యవసాయ విద్యుత్ వినియోగం 42 మిలియన్ యూనిట్లు ఉంటోంది. అంటే.. సాధారణ రోజుల్లో మాదిరిగానే ఇప్పుడూ వ్యవసాయ విద్యుత్ వినియోగం కొనసాగుతోంది.
- మార్చి చివరి వారం.. ఏప్రిల్ మొదటి వారంలో పంటలకు నీళ్లు ఎక్కువగా అవసరం. ఈ కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకోసం స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు చేయాలని మొదట్లో భావించారు.
- రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సగటున రోజుకు 33 మిలియన్ యూనిట్లు ఉచిత విద్యుత్ వాడకమే ఉంటుంది. మార్చి, ఏప్రిల్‌లో ఇది ఇంకా పెరుగుతుంది. ఈ లెక్కన ఈ రెండు నెలల్లో విద్యుత్ డిమాండ్ రోజుకు 204 మిలియన్ యూనిట్లు ఉండొచ్చని అంచనా వేశారు.
- లాక్‌డౌన్ కారణంగా వాణిజ్య విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గింది. అందరూ ఇళ్లకే పరిమితం కావడంవల్ల గృహ విద్యుత్ వినియోగం కొంచెం పెరిగింది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే కొత్తగా అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని లెక్కతేల్చారు.
- కానీ, వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉదయం 7–11 గంటల మధ్య ఎక్కువగా ఉంటోందని పంపిణీ సంస్థల ఉన్నతాధికారులు తెలిపారు. 10 గంటల వరకూ గృహ వినియోగం సాధారణంగానే ఉంటుంది. 10–11 మధ్య ఏసీల వాడకం పెరగడంతో, అదే సమయంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉండటంతో స్వల్పంగా డిమాండ్ ఏర్పడుతోంది.
- దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉందని ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రోజుకు కనీసం 70 వరకూ ట్రాన్స్‌ఫార్మర్లకు ఏదో ఒక రకంగా ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 500 ట్రాన్స్‌ఫార్మర్లను తక్షణమే మార్చాలని అధికారులు అనుకున్నారు. కానీ, లాక్‌డౌన్ కారణంతో అవి అందుబాటులోకి రాలేదు.
- అయినా.. ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దని విద్యుత్ సౌధ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఫోన్ చేసిన 24 గంటల్లో ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు చేసి ఉపయోగంలోకి తెస్తున్నామని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు.