ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్‌సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు.
పీఆర్‌సీ వచ్చే వరకూ ఇవే జీతాలు..
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్‌ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్‌సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు.
కేసులను ఎత్తివేస్తామన్నారు..
ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment