
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. రబీ నాటికి వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్‌ను వందశాతం ఫీడర్ల ద్వారా ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
► రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలో నిర్వహణ లోటుపాట్లకు సంబంధించి చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కీలకమైన పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ పరికరాలలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలి.
► రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయానికి 9 గంటల పగటి పూటే విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఖరీఫ్‌లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలకు అనుగుణంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు çచేసుకోవాలి.
► వర్షాకాలంలో మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలి. బ్రేక్ డౌన్ సమయంలో తక్షణ విద్యుత్తు పునరుద్ధరణకు వీలుగా విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచాలి.
► సబ్ స్టేషన్లు, జిల్లా వారీగా పనితీరు స్కోర్ నమోదు చేసి ర్యాంకులివ్వాలి. సమీక్ష సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, విజిలెన్స్ జేఎండీ కే వెంకటేశ్వరరావు, పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్దన రెడ్డి పాల్గొన్నారు.