సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి గతేడాది అక్టోబర్‌లో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సమర్పించిన 2022–23 అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ (ఏఆర్‌ఆర్) ప్రతిపాదనలపై బుధవారం నిర్ణయం వెలువడనుంది. డిస్కంలు చేసిన ప్రతిపాదనల్లో పేద, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారంలేదు. పైగా గతంలో కంటే తక్కువ రేట్లు వసూలుచేస్తామని తెలిపాయి. దానికి తగ్గట్లుగానే ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తిరుపతి వేదికగా బుధవారం కొత్త టారిఫ్‌ను ప్రకటించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన డిస్కంలను గట్టెక్కించడంతో పాటు సామాన్యులపై అధిక భారంలేకుండా చార్జీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
పేద, మధ్య తరగతికి ఊరట డిస్కంల ప్రతిపాదనల ప్రకారం..
► నెలవారీ వినియోగం 30 యూనిట్ల వరకు ఉన్న గృహ విద్యుత్ వినియోగదారులకు ఏ విధమైన పెంపులేదు.
► 31–75 యూనిట్లు ఉన్న వినియోగదారులకు చాలా స్వల్పంగా అంటే కేవలం యూనిట్‌కు 20 పైసలు పెంచాలని మాత్రమే డిస్కంలు ప్రతిపాదించాయి.
► నెలవారీ వినియోగం 201–300 మధ్య చార్జీలు యూనిట్‌కు రూ.0.10 పైసలు, 301–400 మధ్య రూ.0.45 పైసలు, 401–500 మధ్య ఒక రూపాయి తగ్గించగా, 500 యూనిట్లు మించిన వినియోగానికి రూ.2.45 చొప్పున తగ్గిస్తూ ప్రతిపాదించాయి.
► వీటిపై విశాఖపట్నంలో ఏపీఈఆర్‌సీ ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టింది.
ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం
గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు పెరగడం, విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోవడం, రుణాలు కూడా తీసుకోలేనంతగా వాటి రుణ పరిమితులు దాటిపోవడం, వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా అధిక రేట్లతో పీపీఏల ద్వారా విద్యుత్ కొనుగోలు వంటివన్నీ కలిసి డిస్కంలను 2019 నాటికే నడిరోడ్డున నిలబెట్టేశాయి. 2014–19 మధ్య రాష్ట్రంలో 30,742 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్‌ను బ్యాక్‌డౌన్ చేసిన గత టీడీపీ ప్రభుత్వం.. తనకు నచ్చిన కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఆదాయ, వ్యయాల మధ్య తేడా (రెవెన్యూ గ్యాప్) 24.18 శాతం పెరిగింది. వినియోగదారులకు సరఫరా చేసిన విద్యుత్ సరాసరి వ్యయం యూనిట్‌కు రూ.6.92 ఉండగా, దానిపై విద్యుత్ సంస్థలకు వచ్చేది యూనిట్‌కు రూ.5.25 మాత్రమే. అంటే యూనిట్‌కు రూ.1.67
లోటు ఉంది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నాయి.
మనుగడ కోసం
రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ విద్యుత్ సంస్థలు తేరుకోలేకపోతున్నాయి. రుణాలిచ్చిన సంస్థల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ లోటును కొంతైనా పూడ్చకపోతే విద్యుత్ సంస్థల మనుగడ కష్టం.
– జె. పద్మజనార్ధనరెడ్డి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ
మన రాష్ట్రంలోనే తక్కువ
పేదలను మినహాయించి మిగిలిన వినియోగదారులకు సంబంధించిన విద్యుత్ చార్జీలపై ప్రతిపాదనలనే ఏపీఈఆర్‌సీకి సమర్పించాం. జాతీయ స్థాయిలో విద్యుత్ చార్జీలను పోల్చిచూస్తే ఏపీలోనే తక్కువ ధరలతో గృహ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం.
– కె. సంతోషరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ
ఖర్చులు పెరిగిపోయాయి
గృహ విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, విద్యుత్ కొనుగోలు, నిర్వహణ వ్యయం ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. దానిని టారిఫ్‌తో భర్తీచేయాలి.
– హెచ్.హరనాథరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment