
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కార్యకలాపాలు ఇకపై కర్నూలు జిల్లా నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 82(3), కేంద్ర చట్టం నెం 36 (2003) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.8లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం కర్నూలులో ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్‌సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు వెలువడ్డా హైదరాబాద్ కేంద్రంగానే పని చేస్తోంది. కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్ ఆర్డర్(విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల లాంటి కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి నిర్వహిస్తోంది.
తాజా ఆదేశాలతో ఏపీఈఆర్‌సీ కర్నూలులో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏపీఈఆర్‌సీకి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, లీగల్ కన్సల్టెంట్, ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు.
‘ఏపీఈఆర్‌సీ’ ఏం చేస్తుందంటే?
విద్యుత్ చట్టం సెక్షన్ 86 ద్వారా కమిషన్‌కు పలు విధులను నిర్దేశించారు. విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం లాంటి కీలక బాధ్యతలను మండలి నిర్వర్తిస్తుంది. విద్యుత్తు అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తేవడం లాంటివి చేపడుతుంది. పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది.
ట్రాన్స్‌మిషన్ లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు జారీ చేస్తుంది. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతం ఉండాలో నిర్ణయిస్తుంది. డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్య వివాదాలపై విచారణ జరిపి పరిష్కరిస్తుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం లాంటివి కమిషన్ ప్రధాన విధులుగా నిర్దేశించారు.
Comments
Please login to add a commentAdd a comment