మధ్యతరగతికి కరెంట్‌ షాక్‌ | Chandrababu's government hiked electricity charges third time in row | Sakshi
Sakshi News home page

మధ్యతరగతికి కరెంట్‌ షాక్‌

Published Sat, Apr 1 2017 3:34 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

మధ్యతరగతికి కరెంట్‌ షాక్‌ - Sakshi

మధ్యతరగతికి కరెంట్‌ షాక్‌

రూ.800 కోట్ల విద్యుత్‌ చార్జీల వడ్డన
- 2017–18కి కొత్త టారిఫ్‌ విడుదల
- పరిశ్రమలపై ఫిక్స్‌డ్‌ చార్జీల భారం
- నేటి నుంచే పెరిగిన చార్జీలు అమలు
- చంద్రబాబు హయాంలో మూడోసారి చార్జీల పెంపు
- మూడేళ్లలో రూ.5 వేల కోట్ల బాదుడు


సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచింది. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా చేసుకుంది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పరిశ్రమలకు ఫిక్స్‌డ్‌ చార్జీలు రెట్టింపు చేసింది. చిరు వ్యాపారులు, వాణిజ్య వర్గాలకూ భారీగా వడ్డించింది. మొత్తం మీద రూ.800 కోట్ల అదనపు భారం మోపింది. కొత్తగా పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీలు పెరగడం ఇది మూడోసారి. ఈ మూడేళ్ళలో సుమారు రూ.2 వేల కోట్లు ప్రత్యక్షంగా వడ్డించారు. మరో రూ.3 వేల కోట్ల మేరకు ప్రజలపై దొడ్డిదారిన భారం మోపారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుక్రవారం హైదరాబాద్‌లో  2017–18 సంవత్సరానికి కొత్త టారిఫ్‌ను ప్రకటించింది.

వాస్తవానికి టారిఫ్‌ ఆర్డర్‌ వారం రోజుల క్రితమే తయారైంది. శాసనసభలో విపక్షం చార్జీల పెంపుపై తప్పకుండా నిలదీస్తుందనే ఉద్దేశంతో శుక్రవారం శాసనసభ వాయిదా పడిన వెనువెంటనే చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు. 2017–18లో రూ.8,065 కోట్ల ఆర్థిక లోటును విద్యుత్‌ పంపిణీ సంస్థలు సూచించాయి. ఈ మొత్తంలో రూ.1,111 కోట్లు ప్రజల నుంచి చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని, రూ.6,954 కోట్లు సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించాయి. అయితే ప్రభుత్వం సబ్సిడీగా కేవలం రూ.3,700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. అయితే డిస్కమ్‌లు ప్రతిపాదించిన మొత్తంలో ఏపీఈఆర్‌సీ కొంత కోత విధించింది. ప్రత్యక్షంగా చార్జీల రూపంలో రూ.800 కోట్ల మేర రాబట్టుకునేందుకే అనుమతించింది. అయితే పరిశ్రమలు, వాణిజ్యవర్గాలపై పెరిగే విద్యుత్‌ చార్జీల భారం..పరోక్షంగా సర్వీస్‌ చార్జీల రూపంలో పేద, మధ్యతరగతి వర్గాలపై అదనంగా పడనుంది.

225 యూనిట్లు దాటితే బాదుడే!
గృహ విద్యుత్‌ వినియోగం నెలకు 225 యూనిట్లు దాటితే బిల్లు మోత మోగుతుంది. ఏడాదికి 2,700 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగం ఉన్నవారిని గ్రూప్‌ సీ కేటగిరీ కిందకొచ్చారు. మధ్యతరగతి వర్గం వారు ఏడాదికి 2,700 యూనిట్లకు మించి అంటే నెలకు 225 యూనిట్లకు మించే వినియోగించే అవకాశం ఉంది. వీరికి తొలుత ప్రతి 50 యూనిట్లకు, తర్వాత ప్రతి వంద యూనిట్లకు విద్యుత్‌ చార్జీ మారుతుంది. ఉదాహరణకు నెలకు 500 యూనిట్లు విద్యుత్‌ వినియోగం ఉందనుకుంటే,  0–50 యూనిట్లకు రూ. 2.68 ఉంటుంది. ఇది 401 నుంచి 500 యూనిట్లకు వెళ్తే యూనిట్‌ రూ. 9.06 చొప్పున వసూలు చేస్తారు. మధ్యతరగతి విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వారి నుంచి అధిక ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే సాధారణ వినియోగాన్ని లెక్కిస్తే... ఆరు బల్బులకు నెలకు 60 యూనిట్లు, నాలుగు సీలింగ్‌ ఫ్యాన్లకు 50 యూనిట్లు, వాషింగ్‌ మిషన్‌కు 50 యూనిట్లు, మిక్సీకి 40, వాటర్‌ పంపుకు 132 యూనిట్లు విద్యుత్‌ వినియోగం ఉంటుంది. దీనికే 332 యూనిట్లు  అవుతుంది. వేసవి కాలంలో ఏసీ, కూలర్‌ వినియోగిస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన దాదాపు 50 లక్షల మధ్యతరగతి, కిందిస్థాయి మధ్య తరగతి వర్గాలపై భారీగా విద్యుత్‌ చార్జీలు పడే వీలుంది. దీనికి తోడు ఈ కేటగిరీకి నెలకు రూ.10 కస్టమర్‌ చార్జీ కూడా విధించారు. మొత్తం మీద ఈ వర్గానికి 3 శాతం మేర విద్యుత్‌ చార్జీలు పెంచారు.

పరిశ్రమలపై ఫిక్స్‌డ్‌ భారం
పరిశ్రమలపై పరోక్ష భారం మోపారు. ప్రతి కిలోవాట్‌కు కేవలం రూ.200 ఉన్న ఫిక్స్‌డ్‌ చార్జీని రూ.475కు పెంచారు. దీనివల్ల పరిశ్రమలపై కోట్ల రూపాయల్లో అదనపు భారం పడే వీలుంది. వాస్తవానికి ఇప్పటికే పరిశ్రమలు వాడినా, వాడకున్నా ఏడాదికి 6,750 యూనిట్లకు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మోపిన అదనపు భారం వల్ల విద్యుత్‌ చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. విద్యుత్‌ ప్రధాన వనరుగా నడిచే పరిశ్రమలు ఇప్పటికే చాలావరకు మూత పడ్డాయి. తాజాగా పెంచిన విద్యుత్‌ చార్జీల వల్ల పరిశ్రమలపై ఆర్థిక భారం మరింత పెరిగే వీలుందని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. అక్వా, పౌల్ట్రీ, చెరకు క్రషింగ్, పుట్టగొడుగులు,  ఫ్లోరీ కల్చర్‌కు కూడా 3 శాతం మేర విద్యుత్‌ చార్జీలు పెంచారు.
మూడేళ్ళుగా బాదుడే బాదుడు....
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ళుగా  ప్రతి ఏటా విద్యుత్‌ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. 2015–16లో రూ. 984 కోట్ల మేర ప్రజలపై భారం మోపారు. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో 2016–17లో సర్కారు దొంగదెబ్బ తీసింది. ప్రత్యక్షంగా రూ.242 కోట్ల భారం మోపి, శ్లాబుల వర్గీకరణతో మరో రూ.1,200 కోట్లు దొడ్డిదారిన ప్రజల జేబుకు చిల్లు పెట్టింది. తాజాగా రూ. 800 కోట్ల భారం వేసింది. పరోక్షంగా ఫిక్స్‌డ్‌ చార్జీల రూపంలో రూ.1,800 కోట్ల భారం మోపింది.  

పెంపు అనివార్యం: భవానీ ప్రసాద్‌
విద్యుత్‌ చార్జీల పెంపు అనివార్యమని ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ అన్నారు. అయితే 92 శాతం వినియోగదారులపై పెంపు ప్రభావం ఉండదన్నారు. కమిషన్‌ కార్యాలయంలో టారిఫ్‌ విడుదల సందర్భంగా ఏపీఈఆర్‌సీ సభ్యులు రఘు, రామ్మోహన్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి విద్యుత్‌ సంస్థలు ప్రతిపాదించిన ఖర్చులో కోత పెట్టామని, 510 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు అవసరం లేదని కమిషన్‌ భావించినట్టు తెలిపారు. తద్వారా రూ.2,300 కోట్ల అదనపు ఖర్చును నియంత్రించామన్నారు. కమిషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బి.రామారావు ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. టారిఫ్‌ విడుదల సందర్భంగా కమిషన్‌ సిబ్బంది ఆయనకు నివాళులర్పించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement