విభాత సంధ్యల ప్రభాత గీతం! | Sakshi Editorial On Chandrababu Govt electricity tariff hike | Sakshi
Sakshi News home page

విభాత సంధ్యల ప్రభాత గీతం!

Published Sun, Dec 29 2024 4:06 AM | Last Updated on Sun, Dec 29 2024 2:42 PM

Sakshi Editorial On Chandrababu Govt electricity tariff hike

జనతంత్రం

‘తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్‌ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. కావచ్చు.  కానీ, వాటికి ఉండే ప్రాధాన్యత వాటికున్నది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దులూ, అర్ధ శతాబ్దుల సందర్భాలూ చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులనూ, పరిణామాలనూ అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. 

నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెబుతాయి. ఇప్పుడు బలంగా ఊడలు దిగి కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారుపోసి నీరు పెట్టిన తొలి కాపుల లక్ష్యాలేమిటో, స్వప్నాలేమిటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి.

కొన్నిసార్లు ఇటువంటి చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి వచ్చిపడతాయి. ఈ డిసెంబర్‌ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్‌ 24వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంలా ఉండే కాంగ్రెస్‌ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. 

ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే బెళగావి (కర్ణా టక)లో నేటి శిథిల కాంగ్రెస్‌ పార్టీ కూడా దాని వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపా యాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు.

స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్‌ 26న వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్‌లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్‌కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 

1920లోనే నాటి సోవియట్‌ యూనియన్‌లోని తాష్కెంట్‌ (నేటి ఉజ్బెకిస్తాన్‌)లో ఎమ్‌.ఎన్‌.రాయ్‌ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్‌ బ్రదర్‌ సీపీఎం తాష్కెంట్‌ తేదీకే కట్టుబడి ఉన్నది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించ వలసినదే!

ఈ డిసెంబర్‌ 25నే ఆరెస్సెస్‌ కూడా తన వందో ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయ తావాదం లక్ష్యాలుగా కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగు తున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. 

కానీ, ఈరోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు పదికోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార  పార్టీగా ఆ పార్టీ అనుస రిస్తున్న, అనుసరించబోయే విధానాలను ఆరెస్సెస్‌ వ్యవస్థాప కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు.

ఈ సంవత్సరమే అటల్‌ బిహారీ వాజ్‌పేయి శతజయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా! ఆరెస్సెస్‌ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్‌ 25వ తేదీనే అటల్‌ జీ జన్మించారు. ఆరెస్సెస్‌ తొలి రాజకీయ వేదిక జనసంఘ్‌లో కూడా ఆయన ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్‌ పార్టీ భార తీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పాతికేళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్‌పేయి ఉన్నారు. 

మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యేవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్‌పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్‌ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్‌ను ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్‌పేయి ఉపయోగపడ్డారు. ఈ కాలానికి కాదు! ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్‌ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్‌ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆరెస్సెస్‌ విజయ రహస్యం ఇమిడి ఉన్నది. అంతే తప్ప వాజ్‌పేయి వేరు, మోదీ వేరూ కాదు! ఈ రెండు రూపాల్లోని సారం ఒక్కటే!!

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా వందేళ్లు కావస్తున్నది. 1927లో సరిగ్గా డిసెంబర్‌ 25వ తేదీనే అంబేడ్కర్‌ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కులవ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచితవేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేడ్కర్‌ చర్య సాంత్వన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేడ్కరిజానికి మద్దతు మరింత పెరుగుతున్నది.

స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునికమైన ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూ నిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాటేమిటి?

భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే కాలాను గుణమైన ఎత్తుగడలను అమలుచేస్తూ ఆరెస్సెస్‌ మూల సిద్ధాంతాలను హిడెన్‌ ఎజెండాగా పెట్టుకొని అవసరాన్ని బట్టి ఒక్కొక్కదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్‌ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసినదే. 

సంఘ్‌ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్‌ రాజ్యాంగాన్ని ‘పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంత’గా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ్‌ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.
 


రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్‌ ఎజెండాలోని అంశాలను
ముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీకి కొత్త వ్యూహమేమీ కాదు. 

ఆధునిక భావనలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అడ్వాణీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్‌పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో రెండు మూడు మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలి ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నిరోధంగా ఇలాగే సాగుతుందా? దీన్ని నిలువరించే శక్తులున్నాయా? అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ.

సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీ హిందూయాత్ర(?)ను ఎదిరించే బలం అంబేడ్కరిజానికి ఉన్నదని కొందరి అభి ప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే ‘లాల్‌–నీల్‌’æఅనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబే డ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ, చిన్నచిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్‌వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. 

ఇక వ్యూహ రాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్‌ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ‘ఇండియా’ కూటమి పక్షాల దన్నుతో 99 లోక్‌సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్‌ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి వందేళ్ల నాటి భావాలూ, సంస్థలూ ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతుండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం.

చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికర పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వాజ్‌పేయి అండతో ‘కార్గిల్‌ గాలి’లో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవకముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొనితెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్‌ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీకాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతర ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను  గట్టెక్కించలేకపోయింది.

ఇప్పుడూ అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికితోడు పరిపాలనా వైఫల్యాలు, కక్షసాధింపు రాజకీయాలు, ప్రజావైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడనా పారుతున్న మద్యం కంపు, అంతకుమించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు, వెరసి ఆరు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. 

విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో పది లక్షలమందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్‌ మాత్రమే! పులివెందుల నియో జకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి జరిపిన పర్యటన జనసముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ పాతిక కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటల సమయం! పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే! దారి పొడవునా ఊళ్లు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. 

ఈ పరిస్థితి చూస్తుంటే కూడా గతమే గుర్తుకొస్తున్నది. మందుపాతర సాను భూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు నాలుగు మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కేంద్రంలోని ఎన్టీయే సర్కార్‌ను కూడా తీసుకెళ్లి వాజ్‌పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో!

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement