నమ్మి ఓటేస్తే కరెంట్ షాకులా? | APERC public hearing on proposals of discoms | Sakshi
Sakshi News home page

నమ్మి ఓటేస్తే కరెంట్ షాకులా?

Published Sat, Oct 19 2024 5:21 AM | Last Updated on Sat, Oct 19 2024 5:21 AM

APERC public hearing on proposals of discoms

ప్రజలపై రూ.8,113.60 కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారం

డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ’ఏపీఈఆర్సీ’ బహిరంగ విచారణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆంధ్రప్ర­దేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు ) ప్రతిపాదించిన రూ.8,113.60 కోట్ల ఇంధన, విద్యుత్‌ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీల భారంపై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 

కర్నూలులో మండలి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 12 మంది సాధారణ ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థల ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు ఓటేసి అధికారంలోకి తెస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు గాలికి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ట్రూ అప్‌ చార్జీలు వద్దంటూ సీపీఎం నేతలు విద్యుత్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నా నిర్వహించారు. అభ్యంతరాలపై డిస్కమ్‌ల నుంచి ఏపీఈఆర్సీ వివరణ కోరనుంది. సమాధా­నాలు రాగానే వారం రోజుల్లోగా చార్జీలపై మండలి నిర్ణయం తీసుకుంటుంది.

బాబు పాలనంటేనే ’షాక్‌’లు..
టీడీపీ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60కి పెరిగింది. అంటే 41.04 శాతం పెరిగింది. 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. గృహ విద్యుత్‌ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం టీడీపీ హయాంలో అమలైంది. నెలంతా విద్యుత్‌ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. 

సగటు యూనిట్‌ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేశారు. విద్యుత్‌ వినియోగాన్ని బట్టి శ్లాబులు మార్చి అధిక భారం మోపే విధానాన్ని గతంలో టీడీపీ సర్కారు అమలు చేసింది. అవసరం లేకపోయినా పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ)లను నాడు చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్నారు. ఫలితంగా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో విద్యుత్‌ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్‌ వినియోగదారులపైనే వేస్తున్నారు.  

అనుమతిస్తే భారం ఇలా..
డిస్కమ్‌ల ప్రతిపాదనలకు ఏపీఈఆర్‌సీ నుంచి ఆమోదం లభిస్తే గృహ విద్యుత్‌ వినియో­గదా­రులపై రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులపై రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్వీసులపై రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసులపై రూ.669 కోట్లు, ఇన్‌స్టిట్యూషన్స్‌పై రూ.547 కోట్లకుపైగా విద్యుత్‌ బిల్లుల భారం పడనుంది. 

ప్రతి నెల ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున అదనంగా చార్జీలు వేస్తారు. ఒక వేళ ప్రజలపై భారం మోపేందుకు ఏపీఈఆర్‌సీ అనుమతించకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.8,113.60 కోట్లలో 75 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, ప్రజలపైనే ఆ భారాన్ని మోపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రూ అప్‌ చార్జీల వడ్డనపై ఏపీఈఆర్‌సీలో విచారణ 
సర్దుబాటు పేరుతో రూ.8,114 కోట్ల బాదుడుపై నివేదిక సిద్ధం చేసిన డిస్కమ్‌లు 
కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్‌ చార్జీల వడ్డనపై ఏపీ డిస్కంలు సిద్ధం చేసిన నివేదికపై వచి్చన అభ్యంతరాలపై ఏపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగులేటరీ కమిషన్‌)లో విచారణ జరిగింది. శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో మొదటిసారి ఇంధన సర్దుబాటు చార్జీలపై చైర్మన్‌ నాగార్జునరెడ్డి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ అభ్యంతరాలు/సలహాలు స్వీకరించారు. 

ఇటీవల డిస్కమ్‌లు రూ.8,114 కోట్ల ఇంధన సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్‌సీకి నివేదించాయి. ఈ క్రమంలో వచి్చన అభ్యంతరాలు, సలహాలపై విచారణ జరిగింది. దాదాపు 14 సంస్థలు / మంది అభ్యంతరాలు, సలహాలు ఇచ్చారు. త్వరలోనే ఇంధన సర్దుబాటు చార్జీలపై ఈఆర్‌సీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement