సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ ఆంక్షల నుంచి భారీ ఊరట లభించింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 235 మిలియన్ యూనిట్ల నుండి 161 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్టుగానే పరిశ్రమలకు ఆంక్షల నుంచి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి మాట నిలుపుకుంది.
చదవండి: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే..
దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అభ్యర్థన మేరకు పరిశ్రమలపై ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏపీఈఆర్‌సీ ఆంక్షలు విధించింది. తొలుత వారంలో ఒక రోజు పవర్ హాలిడేతో పాటు, విద్యుత్ వినియోగంలో 50 శాతానికే అనుమతించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆంక్షలను సడలించింది.
తాజా ఆదేశాల ప్రకారం.. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ డిమాండ్‌లో 70 శాతం వినియోగించుకోవచ్చు. మిగతా సమయంలో 60 శాతం వాడుకోవాలి. పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్‌హాలిడేను మూడు రోజుల క్రితమే తొలగించగా, రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత ఎటువంటి షిఫ్టులకు అనుమతిలేదని నిబంధనలు విధించింది. తాజాగా వాటిని కూడా తొలగించి, పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగించుకొనే అవకాశం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment