
జేబుకు చిల్లు 5,600 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1 నుంచి కొత్త కరెంటు చార్జీల మోత మోగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం నాలుగేళ్లుగా ఏటా విద్యుత్ చార్జీలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగించనుంది. స్లాబుల మాయూజాలంతో వినియోగదారుల జేబుకు భారీయెత్తున చిల్లు పెట్టనుంది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ఏకంగా సుమారు రూ.5,600 కోట్ల కరెంటు చార్జీల భారం పడనుంది. కేవలం గృహ వినియోగదారులపైనే ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా భారం పడనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ప్రధానంగా గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చార్జీలు పెంచనుంది.
నెలకు 150 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు భారీ బిల్లు షాక్ ఇవ్వనుంది. వీరికి ఆయూ స్లాబుల మేరకు యూనిట్‌కు 50 పైసల నుంచి రూ.1.78 వరకూ చార్జీ పెరగనుంది. నెలకు 150 యూనిట్లకుపైబడి వినియోగించే కేటగిరీ వారికి ఇప్పటికే అధిక చార్జీలు ఉండటం వల్ల ఈసారి వారిపై కాస్త కరుణ చూపినట్లు సమాచారం. ఇక చిన్నతరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలు, ఫెర్రో అల్లాయ్స్ యూనిట్లకు సగటున 50 పైసల నుంచి 75 పైసల మేరకు చార్జీలు పెరగనున్నట్టు తెలిసింది. అదేవిధంగా వాణిజ్య సంస్థలు, మల్టీప్లెక్స్‌లు, హోర్డింగ్‌లకు కూడా ప్రస్తుత చార్జీల కంటే సగటున 50 పైసల మేరకు చార్జీలు పెరగనున్నారుు.
24న కొత్త టారిఫ్ ఆదేశాలు!
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5,600 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను పెంచడంతో పాటు సుమారు రూ.6,500 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించే విషయమై అభిప్రాయాన్ని తెలియజేయూలంటూ ఈఆర్‌సీ గురువారం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనశాఖకు చేరిన ఈ లేఖపై గవర్నర్ సమీక్ష అనంతరం ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ నెల 24న ఈఆర్‌సీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తారుు. అయితే విద్యుత్ చార్జీల పెంపునకు కోడ్ కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందా? లేదా? అనే విషయమై స్పష్టత లేదు. ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతివ్వకుంటే కోడ్ ముగిసేవరకు అంటే మే నెలాఖరు వరకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే అమలయ్యేలా ఈఆర్‌సీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్‌రంగ నిపుణులు మాత్రం ఎన్నికల సంఘం వ్యతిరేకించే అవకాశం లేదనే అంటున్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలోనూ విద్యుత్ చార్జీలను ఈఆర్‌సీ నిర్ణయించిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు.
పేదలు, మధ్యతరగతే సమిధలు!
గృహ వినియోగదారులకు గతంలో 100 యూనిట్లుగా ఉన్న స్లాబును కాస్తా 50 యూనిట్లుగా విభజించి చార్జీలను పెంచిన ప్రభుత్వం.. ఈసారి దాన్నీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఎల్‌టీ-1 కిందకు వచ్చే గృహ వినియోగదారులను ఎల్‌టీ 1(ఏ) నుంచి 1(డీ) వరకూ విభజించింది. ప్రతి కేటగిరీలో చార్జీలను వేర్వేరుగా నిర్ణయించింది. దీనితో ఒక స్లాబు దాటి మరో స్లాబులోకి వెళితే చాలు చార్జీల మోత మోగిపోనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించినట్టైతే దాన్ని ఎల్‌టీ-1(ఏ) కేటగిరీగా నిర్ణయించింది. వీరికి ప్రస్తుతమున్న యూనిట్ చార్జీని రూ.1.45 నుంచి రూ.1.95కు పెంచింది. అంటే 50 పైసలు పెంచిందన్నమాట. ఇక 100 యూనిట్ల వరకు వినియోగిస్తే ఎల్‌టీ1(బీ)గా నిర్ణయించి మొదటి 50 యూనిట్లకు రూ.3.10 చొప్పున 51-100 యూనిట్లకు రూ.3.75 చొప్పున వసూలు చేయనుంది. 150 యూనిట్ల వరకు వాడితే ఎల్‌టీ1(సీ) తొలి 50 యూనిట్లకు రూ.3.10, 51-100 యూనిట్లకు రూ.3.75, 101-150 యూనిట్లకు రూ.5.38 చొప్పున వసూలు చేయనున్నారు. అయితే 150 యూనిట్లకు పైగా వినియోగించే వారిపై (ఎల్‌టీ1(డీ) కేటగిరీ మాత్రం కాస్త కరుణ చూపారు. వీరికి యూనిట్‌కు సగటున 25 నుంచి 35 పైసల మేరకు పెరిగినట్టు సమాచారం. ఎందుకంటే.. ఒక యూనిట్‌ను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సరఫరా చేసేందుకు అయ్యే సగటు వ్యయం కంటే 20 శాతానికి మించి టారిఫ్ ఉండకూడదని జాతీయ టారిఫ్ విధానం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ కేటగిరీ వారికి పెద్దగా విద్యుత్ చార్జీలను పెంచకూడదని ఈఆర్‌సీ భావించినట్టు తెలిసింది. మరోవైపు చిన్న, భారీ, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు కూడా కొత్త చార్జీల షాక్ తగలనుంది.
స్థానిక సంస్థలకు మరిన్ని ఇక్కట్లు
ఇప్పటికే అనేక పంచాయతీలు, మునిసిపాలిటీలు విద్యుత్ చార్జీలు బకాయిపడి ఉన్నాయి. ఫలితంగా విద్యుత్ సంస్థలు వాటికి కనెక్షన్ కట్ చేస్తున్నాయి. తాజాగా పెరగనున్న చార్జీలు స్థానిక సంస్థలపై మోయలేని భారంగా పరిణమించనున్నారుు. దీంతో వీధుల్లో చీకట్లు అలుముకోవడంతో పాటు, తాగునీటి సరఫరాకూ ఇబ్బందులు ఏర్పడనున్నారుు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని వినియోగదారులపైనే నెట్టే అవకాశం ఉంది. దీంతో తాగునీటి చార్జీలూ పెరిగే ప్రమాదం పొంచి ఉంది. వీధి దీపాలకు యూనిట్ విద్యుత్ చార్జీ సగటున 40 పైసల మేర కు, తాగునీటి సరఫరాకు 50 పైసల నుంచి రూపాయి వరకూ పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వివరించాయి.