సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల మోత తాత్కాలికంగా వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఆర్‌సీ కార్యదర్శి మనోహర్‌రాజు శనివారం ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ టారిఫ్‌ను ఈఆర్‌సీ నిర్ణయించి ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ చార్జీల మోతను ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
మరోవైపు ప్రభుత్వం కూడా కోడ్ ఉన్నందున ఏ కేటగిరీ వినియోగదారులకు (రైతులు, గృహ తదితర) ఎంతమేరకు సబ్సిడీ ఇస్తామనే విషయాన్ని పేర్కొనలేమని ఈఆర్‌సీకి తెలిపింది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే అమలవుతాయని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. అదేవిధంగా ట్రాన్స్‌కోకు చెందిన విద్యుత్ సరఫరా చార్జీలు, సాంప్రదాయక ఇంధన వనరుల అస్థిర చార్జీల(వేరియబుల్ కాస్ట్)తోపాటు క్రాస్‌సబ్సిడీ సర్‌చార్జీలకు సంబంధించి కూడా తదుపరి ఆదేశాలు వెలువడేవరకూ ప్రస్తుత చార్జీలే అమలవుతాయని ఈఆర్‌సీ తెలిపింది. కాగా ఎన్నికల కోడ్ ముగిశాక.. అంటే మే 20 తర్వాత ఏ క్షణంలోనైనా విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశముంది.