కరెంటు చార్జీలు పెరగవు | Electricity charges will not increase in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కరెంటు చార్జీలు పెరగవు

Published Tue, Jan 30 2024 4:49 AM | Last Updated on Tue, Jan 30 2024 10:38 AM

Electricity charges will not increase in Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త! 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్‌­లు  ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్‌లనే కొనసా­గిస్తున్నట్లు మూడు డిస్కమ్‌లు తెలిపాయి.

సోమవారం విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీ­ఎల్‌ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్‌ రామ్‌­సింగ్, పీవీఆర్‌ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్‌ విచారణ మొదలైంది. ప్రజాభి­ప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్‌ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలిరోజు 17 మంది అభిప్రాయాలు తెలియచేశారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సెక్రటరీ డి.రమణయ్యశెట్టి, విద్యుత్‌ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మన డిస్కమ్‌లకు ‘ఏ’ గ్రేడ్‌: జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్‌సీ చైర్మన్‌
వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్‌ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి డిస్కమ్‌లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాం. దేశవ్యాప్తంగా 2022–23 వినియోగదారుల సేవల్లో ఏడు డిస్కమ్‌లకు ఏ గ్రేడ్‌ రేటింగ్‌ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కమ్‌లే కావడం గర్వకారణం. రాష్ట్రంలో దాదాపు 1.8 కోట్ల వినియోగదారులకు సంబంధించి కేవలం 220 ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి.

డిస్కమ్‌లకు 50 శాతం పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉండగా అధిక భాగం సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా సమకూరుతోంది. కోవిడ్‌ తర్వాత మార్కెట్‌ ధరలు అసాధారణంగా పెరిగాయి. కొన్నిసార్లు యూనిట్‌ రూ.10 సీలింగ్‌ రేట్‌కు కూడా విద్యుత్‌ లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది యూనిట్‌ రూ.16 సీలింగ్‌ రేటుగా విక్రయించిన సందర్భాలున్నాయి. డిస్కమ్‌లకు చెల్లింపులను హేతుబద్ధం చేస్తూ మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ పాలసీని ఆమోదించాం. ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినియోగదారులకు పూర్తి పారదర్శంగా సేవలందించేందుకు ఈఆర్‌సీ నిరంతరం శ్రమిస్తోంది.

వినియోగదారులపై భారం లేదు: పృథ్వీతేజ్‌ ఇమ్మడి, ఏపీ ఈపీడీసీఎల్‌ సీఎండీ
ఈపీడీసీఎల్‌ పరిధిలో 2017–18లో 18,351 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ అమ్మకాలు జరగగా ప్రస్తుతం 27,864 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. 2017–18లో పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉండగా ప్రస్తుతం 5.31 శాతానికి తగ్గాయి. సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.21,161.86 కోట్లుగా అంచనా వేశాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం మోపకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం.

ఎలక్ట్రిక్‌ వాహనాలు, చార్జింగ్‌ స్టేషన్లకు ప్రస్తుతం ఉన్న స్టేషన్ల నిర్వహణ రాయితీని ఎత్తివేయాలని, రైల్వేకు అందిస్తున్న విద్యుత్‌ చార్జీలపై యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచాలని నిర్ణయించాం. గ్రీన్‌ పవర్‌ టారిఫ్‌ ప్రీమియం అన్ని కేటగిరీల వినియోగదారులకు 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదించాం. దీని ద్వారా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా 2023–24లో ఆమోదించిన టారిఫ్‌ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేస్తాం.

2024–25లో ఏపీఈపీడీసీఎల్‌ ఆదాయ అంతరాల అంచనా
► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం రూ.17,854.16 కోట్లు
► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం  రూ.100.44 కోట్లు
► ప్రతిపాదిత ఫుల్‌ కాస్ట్‌ రికవరీ నుంచి ఆదాయం– రూ.3207.27 కోట్లు
► మొత్తం ఆదాయం – రూ.21,161.86 కోట్లు
► సమగ్ర అంచనా వ్యయం– రూ.21,161.86 కోట్లు
► ప్రస్తుత ధరల వద్ద లోటు సున్నా.

పాత టారిఫ్‌లే: కె.సంతోషరావు, ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ
ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో పంపిణీ నష్టాలను 26.84 శాతం నుంచి గతేడాది నవంబర్‌ నాటికి 8.21 శాతం తగ్గించాం. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్‌ సబ్సిడీ 2004–05లో రూ.334 కోట్లు నుంచి 2023–24లో రూ.5195.98 కోట్లకు పెరిగింది. నవరత్నాల పథకంలో భాగంగా వ్యవసాయ, ఆక్వా రైతులు, బడుగు బలహీనవర్గాలకు చెందిన 19,26,467 మంది వినియోగదారులకు రూ.4,605.31 కోట్లను రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం ఉన్న రిటైల్‌ టారిఫ్‌ షెడ్యూల్‌ని 2024–25లోనూ కొనసాగిస్తాం. రెండు మూడు స్వల్ప మార్పులున్నా అవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. 

2024–25 ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఆదాయ అంతరాల అంచనా
► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం  – రూ.15,175.75 కోట్లు
► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం– రూ.7521.03 కోట్లు
► క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జ్‌ నుంచి రాబడి – రూ.142.46 కోట్లు
► ఆర్‌ఈసీ నుంచి ఆదాయం– రూ.20 కోట్లు
► మొత్తం ఆదాయం – రూ.22,859.24 కోట్లు
► సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.22859.24 కోట్లు
► ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా

భారం లేకుండా ప్రతిపాదనలు: కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ
నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం డిస్కమ్‌ పరిధిలో కొత్తగా రూ.172 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 54 వరకూ నిర్మాణ పనులు చేపట్టగా 43 సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌వీడీఎస్‌ పథకం ద్వారా డిస్కమ్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1696.59 కోట్లతో విద్యుత్‌ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం లేకుండా ప్రతిపాదనలు రూపొందించాం.

2024–25 ఏపీసీపీడీసీఎల్‌ ఆదాయ అంతరాల అంచనా
ప్రస్తుత ధరల నుంచి ఆదాయం    – రూ.9090.61 కోట్లు
టారిఫ్‌ కాని ఆదాయం – రూన.392.52 కోట్లు
క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జ్‌ నుంచి రాబడి – రూ.21.53 కోట్లు
ప్రతిపాదిత టారిఫ్‌ ద్వారా ఆదాయం అంచనా– రూ.50.73 కోట్లు
ఫుల్‌కాస్ట్‌ రికవరీ టారిఫ్‌ నుంచి ఆదాయం– రూ.2996.53 కోట్లు
ప్రస్తుత టారిఫ్‌ వద్ద రెవిన్యూ లోటు–  రూ. –3047.26 కోట్లు
సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.12,551.92 కోట్లు
ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా

► రూ.15,729 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు: కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఏపీ జెన్‌కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ మూడు డిస్కమ్‌ల పరిధిలో ఏపీ ట్రాన్స్‌కో నాలుగో నియంత్రణ కాలంలో మంచి విజయాలను నమోదు చేసింది. 2018–19లో 3.10 శాతం సరఫరా నష్టాలుండగా 2023–24 నాటికి 2.75 శాతానికి తగ్గింది. వచ్చే ఐదేళ్లలో ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ లభ్యత 99.70 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ ఐదేళ్ల కాలంలో ఉత్తమ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ అవార్డు, ఫాల్కన్‌ మీడియా, ఎనర్జియా ఫౌండేషన్‌ నేషనల్‌ అవార్డు 2023 ద్వారా టాప్‌ స్టేట్‌ యుటిలిటీ అవార్డు సొంతం చేసుకున్నాం. రాబోయే ఐదేళ్లలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 400 కేవీ సబ్‌స్టేషన్లు 7, 220 కేవీ సబ్‌స్టేషన్లు 23, 132 కేవీ సబ్‌స్టేషన్లు 41 నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా ట్రాన్స్‌మిషన్‌ నష్టాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రానున్న ఐదేళ్లకు గాను రూ.15,729.4 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు తయారు చేశాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement