పేదోడి కరెంట్‌ బిల్లు పైసా పెరగదు | Sakshi Special interview With APERC Chairman Justice CV Nagarjuna Reddy | Sakshi
Sakshi News home page

పేదోడి కరెంట్‌ బిల్లు పైసా పెరగదు

Published Thu, Feb 13 2020 4:35 AM | Last Updated on Thu, Feb 13 2020 4:35 AM

 Sakshi Special interview With APERC Chairman Justice CV Nagarjuna Reddy

సాక్షి, అమరావతి: పేదలు, అల్పాదాయ వర్గాల కరెంట్‌ బిల్లులు ఈ ఏడాది పైసా కూడా పెరిగే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలపై పడే రూ.10,060.63 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ.1,707.07 కోట్లను గృహ విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందన్నారు. ఇంతకాలం రకరకాల పద్ధతుల్లో ఉన్న పరోక్ష విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ప్రజల కోరిక మేరకు ఎత్తేశామని చెప్పారు. కొత్త టారిఫ్‌ రూపకల్పనలో కమిషన్‌ పాత్రపై జస్టిస్‌ నాగార్జునరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..

పెంచలేదు.. తగ్గేలా చేశాం
రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల విద్యుత్‌ వాడకం ఉన్నవారు 50.90 లక్షల మంది. వీరికి గతంలోనూ, ఇప్పుడూ వచ్చే కరెంట్‌ బిల్లు (యూనిట్‌ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50. ఇక నెలకు 51–75 యూనిట్ల విద్యుత్‌ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు. వీరికి గతంలో రూ. 137.50 బిల్లు వచ్చేది.. ఇప్పుడూ అంతే. (50 యూనిట్ల వరకూ యూనిట్‌ రూ.1.45.. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్‌ రూ.2.60 చొప్పున). అంటే.. దాదాపు 74 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్‌ బిల్లు పెరిగే ప్రసక్తే లేదు.

నెలకు 75 యూనిట్లు దాటిన వారి విషయంలో బిల్లు స్వల్పంగా పెరిగినట్టే ఉన్నా.. గతంలోని పరోక్ష విధానాన్ని విశ్లేషించి చూస్తే వారిలో సగం మందికి కరెంట్‌ బిల్లులు తగ్గే వీలుంది. ఏ విధంగా అంటే.. 100 యూనిట్ల వరకూ పాత బిల్లు ప్రకారం.. (0–50 వరకూ యూనిట్‌ రూ.1.45... 51–100 వరకూ యూనిట్‌కు రూ.2.60 చొప్పున) నెలకు రూ.202.50 వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. (0–100 వరకూ యూనిట్‌ రూ.2.60 చొప్పున) రూ.260 బిల్లు వస్తుంది. అంటే.. రూ. 57.50 పెరిగినట్టు కనిపించినా వాస్తవంలో ఇది తగ్గుతుంది. మారిన శ్లాబ్‌ ప్రకారం ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే కాబట్టి కరెంట్‌ బిల్లులు తగ్గుతాయి. నెలకు 101–200 యూనిట్లు వాడే వాళ్లు రాష్ట్రంలో 37.28 లక్షల మంది ఉన్నారు. 201–225 యూనిట్లు వాడేవారు 6.28 లక్షల మంది. వీరి వినియోగం తగ్గితే తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. కాబట్టి పేద వర్గాలపై ఎంతమాత్రం భారం పడలేదు. 500 యూనిట్లపైన వాడేవారు 1.35 లక్షల మంది ఉన్నారు. అధిక సంపన్నులైన వీరికి పెరిగింది కేవలం యూనిట్‌కు రూ.90 పైసలే. 

గత ఐదేళ్లలో
వివిధ వర్గాలకు ఇచ్చే ఉచిత కరెంటు, తదితరాలకు డిస్కమ్‌లు భరించే భారాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వాటికి ఇవ్వాలి. అయితే.. 2015–16లో రూ.3,600 కోట్ల సబ్సిడీకి రూ.3,186 కోట్లు, 2016–17లో రూ.3,951 కోట్లకు రూ.2,923 కోట్లు, 2017–18లో రూ.3,700 కోట్లకు.. రూ.2750 కోట్లు, 2018–19లో రూ.6,030 కోట్లకు రూ.1,250 కోట్లు, 2019–20లో రూ.8,255 కోట్లకు రూ.4,667 కోట్లు మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇతరత్రా పేరుకు పోయి.. అప్పులు చేసిన డిస్కమ్‌లు వడ్డీలకే నెలకు రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి వస్తోంది. 

పరిశ్రమలకు చేయూత..
పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వ పథకాల కోసం నాణ్యమైన బియ్యం ఆడించే రైసు మిల్లులకు వినియోగం లోడ్‌ పరిమితిని వంద నుంచి 150 హెచ్‌పీకి పెంచాం. అనేక పరిశ్రమలకు లోడ్‌ఫ్యాక్టర్‌ ఇన్సెంటివ్స్‌ (ఎక్కువ వినియోగానికి రాయితీలు) కొనసాగిస్తున్నాం. ఫెర్రో అల్లాయిస్‌ను బతికించేందుకు 85 శాతం లోడ్‌ ఫ్యాక్టర్‌ నిబంధనల ప్రతిపాదనను పక్కనపెట్టాం. కుటీర పరిశ్రమలపై కెపాసిటర్లు లేవని విద్యుత్‌ సిబ్బంది వేసే జరిమానాలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాం. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు నూతన టారిఫ్‌ వల్ల భారీ ప్రయోజనం కలుగుతుంది. ఏ లాభాపేక్ష లేని ఈ సంస్థలను వాణిజ్య కేటగిరీలోంచి తీసేశాం. విద్యుత్‌ సంస్థలను ప్రజలకు చేరువ చేయాలన్న కమిషన్‌ ఆలోచనలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ, గతంలో లేని విధంగా గృహ విద్యుత్‌ వినియోగ సబ్సిడీ రూ.1,707.07 కోట్లు ఇచ్చింది. దీనికి వ్యవసాయ సబ్సిడీ (రూ.8,353.58 కోట్లు) కలిపితే మొత్తం ఇచ్చింది రూ.10,060.63 కోట్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement