విద్యుత్‌ భారం లేనట్లే.. పెరగని గృహ వినియోగ ఛార్జీలు | APERC Chairman Justice CV Nagarjuna Reddy announced the electricity tariff for 2023 2024 | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ భారం లేనట్లే.. పెరగని గృహ వినియోగ ఛార్జీలు

Published Sun, Mar 26 2023 4:02 AM | Last Updated on Sun, Mar 26 2023 10:54 AM

APERC Chairman Justice CV Nagarjuna Reddy announced the electricity tariff for 2023 2024 - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వినియోగదారులపై ఈసారి ఎలాంటి విద్యుత్‌ భారం పడలేదు. ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌ ఛార్జీలు మినహా ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు.

ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన ఆదాయ అంతరం మొత్తంలో రూ.10,135 కోట్లను సబ్సిడీ రూపంలో డిస్కంలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది చాలా సంతోషకరమన్నారు. నగరంలోని ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకుర్‌ రామ్‌సింగ్, ఎ.రాజగోపాల్‌రెడ్డిలతో కలిసి విద్యుత్‌ టారిఫ్‌ చార్జీలను నాగార్జునరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

టారిఫ్‌ క్రమబద్ధీకరణకు సబ్సిడీ..
ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ కొనసాగింపుతో పాటు ఎస్సీ, ఎస్టీ, నాయీ బ్రాహ్మణులకు, ఆక్వా రైతుల వినియోగదారులతో పాటు గృహ వినియోగదారులకు టారిఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌ గృహ వినియోగదారులకు సబ్సిడీని ఇచ్చిందన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు రూ.52,590.70 కోట్ల మొత్తంతో ఆదాయ అవసరాలను ఏపీఈఆర్‌సీకీ సమర్పించాయని.. అందులో రూ.49,267.36 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపిందన్నారు. విద్యుత్‌ అమ్మకాలు, కొనుగోలు అవసరాలు, విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు విద్యుత్‌ పంపిణీ సంస్థల అంచనాల కంటే తక్కువగా వుండడంతో ఏపీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 

చేనేత పరిశ్రమ, పిండిమిల్లులకు ఊరట
ఇక పవర్‌లూమ్‌ వినియోగదారులకు కేవీఏహెచ్‌ (కిలోవో­ల్ట్‌ యాంపియర్‌ అవర్స్‌) బిల్లింగ్‌ మినహాయింపు ఇచ్చి­నట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. చేనేత కార్మిక వర్గాలు, పిండి మిల్లుల విద్యుత్‌ వినియోగదారుల అభ్యర్థనల మేరకు 10 హెచ్‌పీ వరకు కేవీఏహెచ్‌ బిల్లింగ్‌ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

అలాగే, గతేడాదిలో ఒక్కసారే వున్న ఆఫ్‌–సీజన్‌ ఎంపికను ఈ ఏడాది­కి రెండుసార్లుగా మార్చామన్నారు. ఇప్పటివరకు ఎనర్జీ ఇం­టెన్సివ్‌ ఇండస్ట్రీస్‌లో హెచ్‌టీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌ డిమాండ్‌ చార్జీలను వసూలుచేయడం లేదన్నారు. ఈ ఏ­డా­దిలో రూ.475 చొప్పున చెల్లించాల్సి వుంటుందన్నారు. 

సోలార్‌ రైతులకు సమస్యలొస్తే.. ఉచిత విద్యుత్‌
సోలార్‌ పంపుసెట్లను వాడుతున్న రైతులకు సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో సమస్యలు ఎదురైతే ప్రభుత్వ విధానం ప్రకారం విద్యుత్‌ పంపిణీ సంస్థలు వారికి ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేయాలని ఆదేశించినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు.

అంతేకాక..  సోలార్‌ రూఫ్‌టాప్‌ నెట్‌ మీటరింగ్‌ మార్గదర్శకాలను డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యుత్‌ ఆదా అంశానికి సంబంధించి గృహ వినియోగదారులకు ఎల్‌ఈడీ, ట్యూబ్‌లైట్లు, బీఎల్డీసీ (బ్రష్‌లెస్‌ డైరెక్ట్‌ కరెంట్‌ మోటార్‌) సీలింగ్‌ ఫ్యాన్లు, సూపర్‌ ఎఫీషియెంట్‌ ఎయిర్‌ కండిషనర్లు వంటి ఇంధన ఉపకరణాల విక్రయాల పైలట్‌ ప్రాజెక్టును ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు.  

ఉచిత విద్యుత్‌లో అలసత్వం వహిస్తే చర్యలు 
రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడంలో అలసత్వం వహిస్తే డిస్కమ్‌ అధికారులపై చర్యలు తప్పవని నాగార్జునరెడ్డి హెచ్చరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరాకు సంబంధించి విద్యుత్‌ సరఫరా నాణ్య­త, వినియోగదారుల సంతృప్తిని సమీక్షించేందుకు జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్‌ను విద్యుత్‌ పంపిణీ సంస్థలు తమ వెబ్‌సైట్లో పొందుపరచడంతో పాటు వివరాలను ఏపీఈఆరీ్సకి సమర్పించాలని ఆదేశించామన్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని.. అది చట్టపరిధిలోని అంశమని ఆయన స్పష్టంచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement