సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు జూన్ 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్‌సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీఈఆర్‌సీని అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది.
ఆ తర్వాత విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఈ భవనం జూన్ నెలకల్లా అందుబాటులోకి వస్తుండటంతో ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలించేందుకు ఫైళ్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించింది. వారి ఫోన్ నంబర్లను కూడా సిబ్బందికి ఇచి్చంది.
మూడు ప్రాంతాల్లోనూ మండలి పని
కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఇప్పటికే ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయం ఉంది. అంతకు ముందు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల, బహిరంగ విచారణ వంటివి నిర్వహించేవారు. ఇటీవల 2024–25 ఏడాదికి టారిఫ్ ఆర్డర్‌ను విజయవాడలో ఏపీఈఆర్‌సీ విడుదల చేసింది. ఈ విధంగా మూడు ప్రాంతాల్లోనూ మండలి విస్తరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment