
సాక్షి, అమరావతి: ఏడాదికి ఒకసారి టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఎవరైనా వినియోగదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఏడాదిలో ఎప్పుడైనా అందించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు.
365 రోజులు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి, సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ (ఏఆర్‌ఆర్), టారిఫ్‌లపై ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిపై సమీక్షించేందుకు నిర్వహించిన స్టేట్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ మాట్లాడారు.