మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం | Mango yields this year are moderate | Sakshi
Sakshi News home page

మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం

Published Sat, Apr 19 2025 4:07 AM | Last Updated on Sat, Apr 19 2025 4:07 AM

Mango yields this year are moderate

ఇథిలీన్‌ వాయువుతో మంచి ఫలితం 

కాల్షియం కార్బైడ్‌తో మాగిస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం 

జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులు

కర్నూలు (అగ్రికల్చర్‌):  ఏటా వేసవిలో అందరినీ ఊరించే పండు మామిడి. జూన్‌ వరకు మార్కెట్‌లో మామిడిదే పైచేయి సంపన్నులైనా.. సామాన్యులైనా.. మామిడి రుచిని ఆస్వాదించాల్సిందే. బంగినపల్లి (బేనీసా) రకం మామిడి అంటే దానికి ఉన్న డిమాండే వేరు. మామిడి ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో పసుపుపచ్చగా కనువిందు చేస్తోంది. రంగు బా­గా ఉంది కదాని తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకోవాల్సిందే.  ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి మాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 

మామిడి ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా ఉద్యానశాఖ అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. ఈ ఏడాది మామిడి దిగుబడులు ఒక మోస్తరుగా ఉన్నాయని వీటిని ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగించుకుంటే మంచి డిమాండ్, ధర లభిస్తుందని తెలిపారు. మార్కెట్‌లో మామిడి పండ్లు కొనుగోలు చేసే ముందు సూక్ష్మంగా పరిశీలించాలన్నారు. పండ్లు కొనేటప్పుడు, తినేటప్పు డు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతులను వివరించారు.  

పండ్లు ఎలా మాగుతాయి...  
సాధారణంగా పండ్లు పక్వానికి వచ్చినప్పుడు ప్రకృతి సిద్ధంగా పండ్ల నందు ఉత్పత్తి అయ్యే ఇథలీన్‌ వల్ల మాగడం జరు­గు­తుంది. ఇథలీన్‌ పండు పక్వానికి వచ్చినప్పుడు దాని ని­ర్మాణ, రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది.  

»  తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టుటకు ఎథిలిన్‌ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్‌ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి.  
»  ఇంటిలో అయితే మాగని కాయల్లో కొన్ని మాగిన పండ్లను గాలి చొరవ డబ్బాలో ఉంచాలి. పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి.  

కొనేటప్పుడు ఇలా చూడాలి.. 
సీజన్‌ రాకముందే అపరిపక్వముగా ఉండి కృత్రిమంగా మాగబెట్టిన రంగు వచ్చేటట్లు చేసిన పండ్లు కొనరాదు. రంగు చూసి మోసపోరాదు. సీజన్‌లో పండ్లు పరిపక్వత చెంది సహజముగా మాగిన పండ్లు కొనడం ఆరోగ్యదాయకం.   

తినేటప్పుడు ఇలా చేయాలి.. 
పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. లేదా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది.    

కార్బైడ్‌తో మాగిస్తే శిక్ష... 
ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్‌ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మే వారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్‌ వాడిన పండ్లను తినడం వల్ల అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.   

సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు..
రంగు.. :  సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండు లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది.  
»  కృత్రిమంగా మాగిన వాటిలో పండు మొత్తం ఒకే విధమైన కాంతివంతమైన లేత పసుపు కలిగి ఉంటాయి. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి పుల్లగా ఉంటాయి.  
వాసన.. :  సహజంగా మాగిన పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. కృత్రిమంగా మాగిన పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది.  
రుచి.. :  సహజంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడుతుంది. కావున తియ్యగా రుచిగా ఉంటుంది. కృత్రిమంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడక తక్కువ తీపిదనం, రుచి లేకకుండా ఉంటాయి.  
నిల్వ.. : సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.  
»  కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement