
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ తన ఇంటికి 2002లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. అప్పుడున్న ఉపకరణాల ప్రకారం ఆయన ఇంటికి ఒక కిలోవాట్ విద్యుత్ లోడు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. కూలర్లు, ఫ్రిజ్, మోటార్.. ఇలా క్రమంగా అనేక ఉపకరణాలు ఇంట్లో చేరాయి. దీంతో కరెంట్ బిల్లు అనేక రెట్లు పెరిగింది. అయితే, ఇప్పుడు విద్యుత్ అధికారులొచ్చి.. నీ వాడకం లోడ్ మూడు కిలో వాట్లు దాటిందంటున్నారు. నెల రోజుల్లో రూ.1800 అపరాధ రుసుం కట్టాలని చెప్పారు. లేకుంటే రూ.10 వేలకు పైగా ఫైన్ తప్పదని హెచ్చరించారు.
తిరుపతి పట్టణం తిరుచానూరులోని సంజయ్ ఇంటికి 2001లో విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అప్పట్లో నెలకు రూ.50 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.700 వరకూ వస్తోంది. లోడ్ నాలుగు రెట్లు పెరిగిందని అధికారులు అంటున్నారు. కిలోవాట్‌కు రూ.600 చొప్పున.. 4 రెట్లు జరిమానా కట్టాలని తెలిపారు. లేదంటే నెల తర్వాత ఫైన్ తప్పదని హెచ్చరించారట.
.. ఈ ఇద్దరే కాదు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల విద్యుత్ వినియోగదారులకు ఇదే షాక్. అదనపు లోడ్ పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ వసూళ్లకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి కూడా లభించింది. దీంతో అదనపు లోడ్‌ను బలవంతంగా వసూలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించబోతున్నారు. నెల రోజుల వ్యవధిలో ప్రస్తుత లోడ్‌ను వినియోగదారులే స్వచ్ఛందంగా ప్రకటించాలని.. లేనిపక్షంలో గడువు ముగిశాక, తనిఖీలు చేసి, భారీగా జరిమానాలు విధించే వీలుందని చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రతీ విద్యుత్ వినియోగదారుడు ఉన్నట్టుండి అదనంగా రూ.1200 నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 48 లక్షల మంది పేదలకు సగటున రూ.600 వరకూ భారంపడే వీలుంది.
ఏంటీ అదనపు లోడ్?
చాలామంది విద్యుత్ వినియోగదారులు రెండు దశాబ్దాల క్రితమే కరెంట్ కనెక్షన్లు తీసుకున్నారు. అప్పట్లో మహా అయితే నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, చిన్నాచితకా విద్యుత్ ఉపకరణాలుండేవి. ఒక బల్బు 100 వాట్లు.. ఫ్యాన్ 70 వాట్లు.. ఇతర ఉపకరణాలన్నీ కలుపుకున్నా మొత్తం వాడకం 500 వాట్ల కన్నా ఎక్కువ ఉండదు. వీటిని పరిగణలోనికి తీసుకుని ఆ ఇంటికి విద్యుత్ లోడ్ ఒక కిలోవాట్ (వెయ్యి వాల్టులు) ఉంటుందని లెక్కగట్టారు. కాలక్రమంలో ఫ్రిజ్, మిక్సీ, కుక్కర్, వాషింగ్ మిషన్, వాటర్ హీటర్, గీజర్, ఏసీ, 1 హెచ్‌పి మోటర్.. ఇలా అనేకం ఇంట్లో చేరాయి. నిజానికి ఇవన్నీ వాడటంవల్ల ప్రతీనెలా కరెంట్ బిల్లూ పెరుగుతోంది.
కరెంట్ వాడకం పెరిగే కొద్దీ శ్లాబుల పేరుతో బిల్లూ పెరుగుతుంది. అంతిమంగా సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా నెలకు రూ. 500పైన కరెంట్ బిల్లు రావడం మామూలైంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. వాడే ప్రతీ ఉపకరణాన్ని పరిగణలోనికి తీసుకుని లోడ్‌ను లెక్కిస్తున్నారు. మీరు కనెక్షన్ తీసుకున్నప్పుడు కిలోవాట్ లోడ్‌కే అనుమతి తీసుకున్నారని, ఇప్పుడు నాలుగు కిలోవాట్ల లోడ్ వాడుతున్నారని అధికారులు అంటున్నారు. ఇది విద్యుత్ చట్టానికి వ్యతిరేకమని.. దీనికి జరిమానా చెల్లించాలనేది విద్యుత్ పంపిణీ సంస్థల వాదన. ఇదే విషయాన్ని ఏపీఈఆర్‌సీ ముందూ విన్పించి అనుమతి తీసుకున్నారు.
బిల్లు కట్టినా.. నేరస్తులేనా?
విద్యుత్ వినియోగదారుడు ప్రతీనెలా వాడుకునే కరెంట్‌కు బిల్లు చెల్లిస్తున్నాడు. అతనికి అది మాత్రమే తెలుసు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు లోడ్ ఎంత? ఇప్పుడెంత పెరిగిందనేది ఎవరికీ తెలియదు. వాడకం పెరిగింది. బిల్లు పెరిగింది. అదే కట్టామని వినియోగదారులు అంటున్నారు. ఇంకా ఈ లోడ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఉన్నట్టుండి అదనపు లోడ్ అంటూ విరుచుకుపడటంతో వినియోగదారులు విస్తుబోతున్నారు.
స్మార్ట్ మీటర్‌తో ఇట్టే పట్టేస్తారు..
ప్రస్తుతం గృహ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తున్నారు. దానిని మీటర్ స్క్రీన్‌కు చూపిస్తే బిల్లు జనరేట్ అవుతోంది. నెల రోజుల్లో ఎక్కువ లోడ్ ఎప్పుడు వినియోగించుకుంటే దాన్నే పరిగణనలోకి తీసుకుని అదనపు లోడ్‌ను నిర్ణయించనున్నారు. నెలలో ఏ ఒక్క రోజైనా తాము తీసుకున్న ఒక కిలోవాట్ లోడ్ కన్నా అదనపు లోడ్‌తో విద్యుత్‌ను వినియోగించుకుంటే అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుందని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 1.25 కోట్ల గృహ వినియోగదారులకు సరాసరి ఒక కిలోవాట్ చొప్పున అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించినా కిలోవాట్‌కు రూ.600 చొప్పున రూ.750కోట్లు విద్యుత్ సంస్థలకు ఆదాయం రానుంది.
Comments
Please login to add a commentAdd a comment