ఐదేళ్ల ట్రూ–అప్‌ రూ.19,604 కోట్లు  | Serious objections to public opinion polls | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల ట్రూ–అప్‌ రూ.19,604 కోట్లు 

Published Sun, Aug 2 2020 5:05 AM | Last Updated on Sun, Aug 2 2020 5:05 AM

Serious objections to public opinion polls - Sakshi

సాక్షి, అమరావతి: గత సర్కారు నిర్వాకాల ఫలితంగా ఐదేళ్లకు సంబంధించి రూ.19,604 కోట్ల మేర ట్రూ–అప్‌ విద్యుత్తు చార్జీల భారాన్ని మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని డిస్కమ్‌లు అనుమతి కోరడంపై ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత మొత్తాన్ని, అదికూడా గత సర్కారు పాలన ముగిసిన తరువాత కమిషన్‌ ముందుకు తేవడాన్ని అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రూ–అప్‌ అంత ఎందుకైంది? ఎప్పటికప్పుడు గత కమిషన్‌ ముందుకు ఎందుకు తేలేదు? ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన దానికన్నా ఎక్కువ వ్యయం చేయాల్సిన అవసరం ఏమిటని విద్యుత్‌ రంగ నిపుణులు, వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  

ట్రూ–అప్‌ అంటే? 
► విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏటా వార్షిక ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్‌ఆర్‌) ఏపీఈఆర్‌సీకి సమర్పిస్తాయి. వచ్చే ఏడాదిలో పెరిగే వ్యయం, రెవెన్యూ తేడా, లోటు ఎలా భర్తీ చేసుకోవాలో పేర్కొంటాయి.  
► డిస్కమ్‌ల ఏఆర్‌ఆర్‌లను పరిశీలించాక కమిషన్‌ టారిఫ్‌ ఆర్డర్‌ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. నిర్వహణ వ్యయం దేనికి ఎంత ఉండాలనేది సూచిస్తుంది.  
► 2014–15 నుంచి 2018–19 వరకూ గత సర్కారు కమిషన్‌ సూచించిన దానికన్నా అధికంగా ఖర్చు చేసింది. ఇలా చేసిన వ్యయానికి కారణాలు వివరిస్తూ ప్రతి సంవత్సరం అదనపు ఖర్చుగా చూపించాలి. దీన్నే ట్రూ–అప్‌ అంటారు. 

దిగిపోయే ముందు.... 
► గత ప్రభుత్వం ప్రైవేట్‌ విద్యుత్‌ను ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తూ కమిషన్‌ నిర్దేశించిన పరిమితి దాటిపోయింది. ఫలితంగా ప్రతి సంవత్సరం వాస్తవ ఖర్చులో భారీగా తేడా వచ్చింది.  
► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్‌ కొనుగోలు ధర కమిషన్‌ నిర్ణయించిన దానికన్నా రూ.9,598 కోట్లు ఖర్చు పెట్టారు. రావాల్సిన దానికన్నా రూ.5,259 కోట్లు తక్కువ రెవెన్యూ వచ్చింది. ఏటా వడ్డీలు, కొత్త ట్రూ–అప్‌ రూపంలో రూ.4,747 కోట్లు వెరసి రూ.19,604 కోట్ల ట్రూ–అప్‌ ఇప్పుడు కమిషన్‌ ముందుకొచ్చింది.  
► ట్రూ–అప్‌పై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌లు ఎందుకిలా చేశాయి? అనుమతి లేకుండా అధిక రేట్లకు విద్యుత్‌ ఎందుకు కొన్నాయి? ఇంత మొత్తాన్ని కమిషన్‌ దృష్టికి ఏటా ఎందుకు తేలేదు? అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement