Private electricity
-
ఐదేళ్ల ట్రూ–అప్ రూ.19,604 కోట్లు
సాక్షి, అమరావతి: గత సర్కారు నిర్వాకాల ఫలితంగా ఐదేళ్లకు సంబంధించి రూ.19,604 కోట్ల మేర ట్రూ–అప్ విద్యుత్తు చార్జీల భారాన్ని మోపేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని డిస్కమ్‌లు అనుమతి కోరడంపై ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత మొత్తాన్ని, అదికూడా గత సర్కారు పాలన ముగిసిన తరువాత కమిషన్ ముందుకు తేవడాన్ని అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రూ–అప్ అంత ఎందుకైంది? ఎప్పటికప్పుడు గత కమిషన్ ముందుకు ఎందుకు తేలేదు? ఏపీఈఆర్సీ నిర్ణయించిన దానికన్నా ఎక్కువ వ్యయం చేయాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రూ–అప్ అంటే? ► విద్యుత్ పంపిణీ సంస్థలు ఏటా వార్షిక ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్ఆర్) ఏపీఈఆర్సీకి సమర్పిస్తాయి. వచ్చే ఏడాదిలో పెరిగే వ్యయం, రెవెన్యూ తేడా, లోటు ఎలా భర్తీ చేసుకోవాలో పేర్కొంటాయి. ► డిస్కమ్‌ల ఏఆర్ఆర్లను పరిశీలించాక కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. నిర్వహణ వ్యయం దేనికి ఎంత ఉండాలనేది సూచిస్తుంది. ► 2014–15 నుంచి 2018–19 వరకూ గత సర్కారు కమిషన్ సూచించిన దానికన్నా అధికంగా ఖర్చు చేసింది. ఇలా చేసిన వ్యయానికి కారణాలు వివరిస్తూ ప్రతి సంవత్సరం అదనపు ఖర్చుగా చూపించాలి. దీన్నే ట్రూ–అప్ అంటారు. దిగిపోయే ముందు.... ► గత ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్‌ను ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తూ కమిషన్ నిర్దేశించిన పరిమితి దాటిపోయింది. ఫలితంగా ప్రతి సంవత్సరం వాస్తవ ఖర్చులో భారీగా తేడా వచ్చింది. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ కొనుగోలు ధర కమిషన్ నిర్ణయించిన దానికన్నా రూ.9,598 కోట్లు ఖర్చు పెట్టారు. రావాల్సిన దానికన్నా రూ.5,259 కోట్లు తక్కువ రెవెన్యూ వచ్చింది. ఏటా వడ్డీలు, కొత్త ట్రూ–అప్ రూపంలో రూ.4,747 కోట్లు వెరసి రూ.19,604 కోట్ల ట్రూ–అప్ ఇప్పుడు కమిషన్ ముందుకొచ్చింది. ► ట్రూ–అప్పై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌లు ఎందుకిలా చేశాయి? అనుమతి లేకుండా అధిక రేట్లకు విద్యుత్ ఎందుకు కొన్నాయి? ఇంత మొత్తాన్ని కమిషన్ దృష్టికి ఏటా ఎందుకు తేలేదు? అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. -
అంత డబ్బు మా దగ్గర్లేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్‌ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమై తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది. -
పండుగ తర్వాత ‘పవర్’ షాక్!
-
పండుగ తర్వాత ‘పవర్’ షాక్!
18న ఏపీఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు రూ.7,122 కోట్ల లోటును పూడ్చుకునే ప్రయత్నం సాక్షి, అమరావతి: సంక్రాంతి తర్వాత విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్) కొత్త విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీన విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సమర్పించ నున్నాయి. రెండు డిస్కమ్‌లకు కలిపి రూ.7,122 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు పేర్కొన్నాయి. వినియోగదారులపై టారిఫ్‌ల పిడుగు పరోక్ష రాబడిపై కూడా విద్యుత్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 2016–17కి కొత్త శ్లాబుల వర్గీకరణను తెరపైకి తెచ్చారు. 2015–16లో విద్యుత్ వినియోగం 900 యూనిట్లు దాటిన వారిని తర్వాత శ్లాబులోకి తీసుకెళ్లి దొంగ దెబ్బతీశారు. ఇప్పుడు ఈ శ్లాబ్ పరిధిని 600 యూనిట్లకు కుదించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించే వీలుంది. అంటే వినియోగదారుడు ఏడాదికి 600 యూనిట్లు విద్యుత్ వాడితే... నెలకు (యూనిట్‌కు రూ.1.45 చొప్పున) రూ.72.50ల బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 601 యూనిట్లు వినియోగిస్తే అప్పుడు వినియోగదారుడు తదుపరి శ్లాబులోకి వెళ్తాడు. అంటే ప్రతి యూనిట్‌కు రూ.2.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల నెలకు రూ.122.50 వరకూ (అదనంగా రూ.50) బిల్లు వస్తుంది. యూనిట్ల శ్లాబును 900 నుంచి 600కు తగ్గించడం వల్ల దాదాపు 3.5 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. మిగులు విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ కొనగోళ్లను ప్రోత్సహిస్తోంది. యూనిట్ సగటున రూ.5.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. వీటివల్లే విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ భారీగా ఆర్థిక లోటు ఏర్పడింది. దీన్ని వినియోగదారుల నుంచే రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
ప్రైవేటు పవరెందుకు?
ఏడాదికి రెండు పంటలు పండే భూమి ఉంది. పండించే సామర్థ్యముంది. నీటి వసతి కూడా ఉంది. అయినా పండించకుండా తిండి గింజల్ని కూడా దుకాణంలో కొనుక్కునేవారిని చూసి ఏమంటాం? వీడికి డబ్బులెక్కువయ్యాయిరా... అనేకదా విమర్శిస్తాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇలాగే మందలించాలేమో..? లేకపోతే ఏంటీ.. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా.., 90పైసలకే యూనిట్ చొప్పున సరఫరా అయ్యే విద్యుత్ అందుబాటులో ఉన్నా.. ఇవేవీ ఉపయోగించుకోకుండా ప్రైవేటు సంస్థల నుంచి యూనిట్‌కు రూ. 6 చెల్లించి కొనేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారమెంతో తెలుసా? అక్షరాలా నెలకు రూ. 710 కోట్లు. చివరికి దీన్నంతా చార్జీల రూపంలో ప్రజల నుంచే కదా వసూలు చేసేది! సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ లోటును తగ్గించుకోవాలన్నా, కొత్త రాష్ట్రంలో ప్రజల అవసరాలు తీర్చాలన్నా ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరముంది. అయితే సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా అధిక ధర చెల్లించి విద్యుత్‌ను ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకే ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. జెన్కో ప్లాంట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా పావులు కదుపుతోంది. వేసవి తర్వాత విద్యుత్ డిమాండ్ తగ్గింది. దీంతో డిమాండ్ కంటే ఎక్కువగానే విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర విద్యుత్ స్టేషన్లలో ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ అందుబాటులో ఉంది. యూనిట్ 90 పైసల నుంచి రూ. 1.25కు దొరికే అవకాశం ఉంది. అయినాసరే వచ్చే మార్చి వరకు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎప్పటిలాగే ముందుకు వెళ్లేందుకు జెన్కో సిద్ధమవుతోంది. ప్రైవేటు సంస్థలకు యూనిట్‌కు సగటున రూ. 6 వరకు చెల్లించి కొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో విద్యుత్ సంస్థలపై నెలకు రూ. 710 కోట్ల మేర భారం పడనుంది. ఆగస్టు నుంచి వచ్చే మార్చి వరకు పరిగణనలోకి తీసుకుంటే ఈ ఎనిమిది నెలల కాలంలో రూ.5,680 కోట్లు ప్రైవేటు సంస్థలకు అప్పనంగా చెల్లిస్తారన్నమాట. అంతిమంగా ఈ భారం చార్జీల రూపంలో ప్రజలపైనే పడుతుంది. ఎలా చూసినా మిగులే.. రెండు నెలల క్రితం రాష్ట్రంలో రోజుకు 158 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్ డిమాండ్ ఉంది. ఇప్పుడది 135 ఎంయూలకు తగ్గింది. అంతేకాదు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విద్యుత్ వాడకం తగ్గుతూనే ఉంటుంది. మరోవైపు కృష్ణపట్నం రెండో యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఇంకోవైపు కేంద్ర విద్యుత్ స్టేషన్లలో ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ ఉంది. అయినప్పటికీ ఖరీదైన కొనుగోలు విద్యుత్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపడంపై జోన్కో వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. జెన్కో వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలోని నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం (ఎన్టీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) సామర్థ్యం 2,810 మెగావాట్లు. వీటిని పూర్తిస్థాయిలో పనిచేయిస్తే రోజుకు 67.44 ఎంయూల విద్యుత్ వస్తుంది. కృష్ణపట్నం రెండు యూనిట్లు కలుపుకుంటే మరో 39 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా సుమారు 105 ఎంయూల మేర థర్మల్ విద్యుత్‌కు అవకాశం ఉంది. ఇక రోజుకు మరో 32 ఎంయూల మేరకు కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి అందుతోంది. మరో 5 ఎంయూలు జల విద్యుత్ ద్వారా లభ్యమవుతోంది. స్వతంత్ర విద్యుత్ ప్రాజెక్టుల (ఐపీపీ) నుంచి మరో 4 ఎంయూలు వస్తోంది. అంతా కలిపితే దాదాపు 146 ఎంయూల విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలోనే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న 135 ఎంయూల డిమాండ్ 140కి చేరినా, ఇంకా రాష్ట్రం మిగులు విద్యుత్‌లోనే ఉంటుందన్నమాట. సామర్థ్యం తగ్గించడం వెనుక.. థర్మల్ యూనిట్లను ఉద్దేశపూర్వకంగానే సామర్థ్యం తగ్గించి నడుపుతూ అందుబాటులో ఉన్న విద్యుత్‌ను తక్కువ చేసి చూపిస్తుండటంపై జెన్కో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజుకు 105 ఎంయూల విద్యుత్‌ను అందించాల్సిన ఈ ప్రాజెక్టులు కేవలం 63 ఎంయూలకే పరిమితం అవుతున్నాయి. బొగ్గు నిల్వలున్నప్పటికీ వీటిని కనీసం 80 శాతం పీఎల్‌ఎఫ్‌తో కూడా నడపక పోవడం ప్రైవేటు సంస్థలకు మేలు చేసేందుకేనని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టులో 1,163 ఎంయూల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చారు. సెప్టెంబర్‌లో 1,402 ఎంయూలు, ఇలా వచ్చే మార్చి వరకు ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సర్కారు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఏపీఈఆర్సీ 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 757 ఎంయూల కొనుగోలుకే అనుమతించింది. అయితే ప్రభుత్వం అనేక రెట్లు అధికంగా కొనుగోలు విద్యుత్‌కు ఆర్డర్లు ఇవ్వాలని తీర్మానించింది.