
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్), డిస్కంల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పరిష్కరించింది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్‌సీ ఇరు వర్గాలకు ఇబ్బంది లేని విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సమీపంలోని పాలవలసలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు 1,040 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ఉంది. దీని నుంచి విద్యుత్ కొనుగోలుకు 1992లో ఏపీ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం 1994లో 30 ఏళ్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి.
1996లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల డిస్కంలకు, హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు మధ్య వివాదం తలెత్తింది. తమకు అవసరం లేకపోయినా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్‌ను ఎందుకు తీసుకోవాలని, పీపీఏను పునఃసమీక్షించాలని డిస్కంలు పట్టుబట్టాయి. దీంతో 1998లో మరోసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. మరోవైపు సంస్థ మూలధనం రూ.7,758 కోట్లుగా ఏపీఈఆర్‌సీకి హెచ్‌ఎన్‌పీసీఎల్ చూపించింది. దీనిపై విచారణ చేపట్టిన మండలి హెచ్‌ఎన్‌పీసీఎల్ చెబుతున్న మూలధనంలో రూ.5,810.75 కోట్లకు ఆమోదం తెలిపింది.
పాతికేళ్లకే ఒప్పందం
కొత్త థర్మల్ పవర్ ప్లాంట్‌లను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తాజా అనుమతులను ఇవ్వడం ఆపివేసింది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న పారిస్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలకు మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని 30 సంవత్సరాలకు బదులుగా ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తేదీ నుండి 25 సంవత్సరాలుగా ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది. హిందూజా పవర్ యూనిట్ ధర రూ.3.98 గా తేల్చింది.
అంతేకాకుండా గత ఆరేళ్లలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలు చెల్లించిన అడ్‌హాక్ టారిఫ్‌లను తుది టారిఫ్‌లుగా పరిగణించామని, కంపెనీ ఎలాంటి బకాయిలను వసూలు చేయడానికి వీల్లేదని చెప్పింది. తద్వారా డిస్కంలపై అదనపు భారం పడకుండా కాపాడింది. విద్యుత్ కొనుగోలు చార్జీ(ట్రూ అప్) భారం పడకుండా ప్రజలకు మేలు చేసింది. అయితే డిస్కంలకు విద్యుత్ అవసరం లేనప్పుడు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ విక్రయించుకునేందుకు సంస్థకు అనుమతినిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment