True-up charges
-
ట్రూఅప్ చార్జీలను అనుమతించొద్దు
వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలు వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను అనుమతించరాదని విద్యుత్‌రంగ నిపుణులు, పారిశ్రామిక, రైతు, వినియోగదారుల సంఘాలు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించలేదని, అందువల్ల వాటికి సంబంధించిన ట్రూఅప్ చార్జీల వసూళ్లకు నిబంధనలు అనుమతించబోవని స్పష్టం చేశాయి. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి రూ. 12,015 కోట్ల పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీలు, 2006–21 కాలానికి రూ. 4,092 కోట్ల డి్రస్టిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు కలిపి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల భారాన్ని మోపాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను అనుమతించరా దని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. డిస్కంల ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలు 2023–24తోపాటు ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ. మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య బహిరంగ విచారణ నిర్వహించగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి పాల్గొని వక్తలు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చారు. ఎవరేమన్నారంటే... అసమర్థ విధానాలతోనే నష్టాలు... అసమర్థ ఆర్థిక నిర్వహణ, తొందరపాటు నిర్ణయాలతోనే డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఆ భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తోంది. ఛత్తీస్‌గఢ్, సెమ్‌కాబ్ విద్యుత్ ఒప్పందాలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ధరల వివాదంతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా బంద్ కాగా, సెమ్‌కాబ్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8.33కి పెరిగింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని పెంచుకొనేందుకు వీలు కల్పిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ‘రెగ్యులేషన్ 1 ఆఫ్ 2019’ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్‌రంగం ప్రైవేటీకరణ కోసమే ప్రీపెయిడ్ మీటర్లను, ఆదానీ కోసమే ఎగుమతి చేసిన బొగ్గు వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. – సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు అందరికీ విద్యుత్ చార్జీలు పెంచాలి ప్రతి ఇంట్లో ఒక్కో వ్యక్తి నెలకు రూ. 300 చొప్పున సెల్‌ఫోన్ బిల్లుకు, లీటర్ పెట్రోల్‌కు రూ.100 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచకూడదు? డిస్కంల నష్టాల నేపథ్యంలో రాష్ట్రంలో అందరికీ విద్యుత్ బిల్లులు పెంచాలి. కార్పొరేట్ బడులు, ఆస్పత్రులకు మరింత ఎక్కువగా పెంచాలి. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవసరం లేదు. విద్యుత్ టవర్ల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించట్లేదు. క్షేత్రస్థాయిలో లైన్మెన్ నుంచి ఏడీఈ వరకు అధికారులు రైతులపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సబ్సిడీ సొమ్ము తీసుకున్నాకే డిస్కంలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కంలు ముందుగా సబ్సిడీ నిధులు తీసుకున్న తర్వాతే వ్యవసాయం, సెలూన్లు, లాండ్రీలు, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించాలి. నేను బతికుండగానే కొడంగల్ డివిజన్లోని మా హస్నాబాద్‌లో సబ్‌స్టేషన్ వస్తే సంతోషంగా చనిపోతా. లో వోల్టేజీ సమస్యతో ఆరేళ్ల నుంచి అడుగుతున్నా స్పందన లేదు. – స్వామి జగన్మాయనంద ప్రైవేటు ఆస్పత్రులను ఎల్టీ–2 కమర్షియల్ కేటగిరీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులుండే ఎల్టీ–7 జనరల్ కేటగిరీకి మార్చాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ సంపత్ రావు విజ్ఞప్తి చేశారు. ఐఐటీ హైదారాబాద్‌కు ప్రతి నెలా రూ.1.1 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, హెచ్‌టీ–2 కేటగిరీ నుంచి కొత్త కేటగిరీకి మార్చాలని సంస్థ తరఫున సూపరింటెండింగ్ ఇంజనీర్ రవీంద్ర బాబు విజ్ఞప్తి చేశారు. అదనంగా యూనిట్‌కు 66 పైసలు చెల్లించి కొనుగోలు చేస్తున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన సర్టిఫికెట్లను ప్రతినెలా జారీ చేయాలని ఇన్ఫోసిస్ విజ్ఞప్తి చేసింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకుండానే ట్రూఅప్ చార్జీల వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరడంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభ్యంతరం తెలిపింది. కరెంట్ ఫెన్సింగ్ పెట్టుకొనే వారిపై హత్యానేరం కేసులు: ఈఆర్సీ చైర్మన్ పంట పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్‌తో ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్‌తో ఫెన్సింగ్ వేసే వారిపై గతంలో అక్రమ కనెక్షన్ ఆరోపణలపై రెండేళ్లలోపు జైలుశిక్ష వర్తించే సెక్షన్ 304ఏ కింద కేసు పెట్టేవారు. కానీ ఇకపై హత్యానేరం కింద (సెక్షన్304) కేసులు నమోదు చేయాలని ఆదేశించాం. – ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు -
‘హిందూజా’, డిస్కంల వివాదం పరిష్కారం
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్), డిస్కంల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పరిష్కరించింది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఇరు వర్గాలకు ఇబ్బంది లేని విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సమీపంలోని పాలవలసలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు 1,040 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ఉంది. దీని నుంచి విద్యుత్ కొనుగోలుకు 1992లో ఏపీ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం 1994లో 30 ఏళ్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. 1996లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల డిస్కంలకు, హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు మధ్య వివాదం తలెత్తింది. తమకు అవసరం లేకపోయినా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్‌ను ఎందుకు తీసుకోవాలని, పీపీఏను పునఃసమీక్షించాలని డిస్కంలు పట్టుబట్టాయి. దీంతో 1998లో మరోసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. మరోవైపు సంస్థ మూలధనం రూ.7,758 కోట్లుగా ఏపీఈఆర్సీకి హెచ్‌ఎన్‌పీసీఎల్ చూపించింది. దీనిపై విచారణ చేపట్టిన మండలి హెచ్‌ఎన్‌పీసీఎల్ చెబుతున్న మూలధనంలో రూ.5,810.75 కోట్లకు ఆమోదం తెలిపింది. పాతికేళ్లకే ఒప్పందం కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తాజా అనుమతులను ఇవ్వడం ఆపివేసింది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న పారిస్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలకు మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని 30 సంవత్సరాలకు బదులుగా ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తేదీ నుండి 25 సంవత్సరాలుగా ఏపీఈఆర్సీ నిర్ణయించింది. హిందూజా పవర్ యూనిట్ ధర రూ.3.98 గా తేల్చింది. అంతేకాకుండా గత ఆరేళ్లలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలు చెల్లించిన అడ్హాక్ టారిఫ్‌లను తుది టారిఫ్‌లుగా పరిగణించామని, కంపెనీ ఎలాంటి బకాయిలను వసూలు చేయడానికి వీల్లేదని చెప్పింది. తద్వారా డిస్కంలపై అదనపు భారం పడకుండా కాపాడింది. విద్యుత్ కొనుగోలు చార్జీ(ట్రూ అప్) భారం పడకుండా ప్రజలకు మేలు చేసింది. అయితే డిస్కంలకు విద్యుత్ అవసరం లేనప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ విక్రయించుకునేందుకు సంస్థకు అనుమతినిచ్చింది. -
రూ.7,209 కోట్ల విద్యుత్ భారం
- ప్రజలపై ట్రూ అప్ చార్జీల పేర బాదుడుకు రంగం సిద్ధం - వచ్చే టారిఫ్ నుంచే మోత! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకివ్వనుంది. ట్రూ అప్ చార్జీల భారాన్ని జనంపైనే మోపేందుకు సిద్ధమైంది. ఫలితంగా రూ.7,209 కోట్లను విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశముంది. అయితే ఇంత మొత్తాన్ని ఒకే ఏడాది చార్జీల రూపంలో మోపవద్దని, ఐదేళ్ల గరిష్ట పరిమితితో ఈ ట్రూ అప్ చార్జీలను రాబట్టుకోవాలని సర్కారు విద్యుత్ అధికారులకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. కేటగిరీలవారీగా ట్రూ అప్ చార్జీలను విధించే అవకాశాన్ని పరిశీలించాలనీ సూచించింది. వాణిజ్య, 200 యూనిట్ల వాడకం పైబడిన గృహ విద్యుత్ వినియోగదారులపై భారం మోపినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న అధికారుల సూచనకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే టారిఫ్ నుంచే ట్రూ అప్ భారంతో కలిపి విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశముంది. భారం భరించేందుకు సర్కారు నో.. 2009 నుంచి పెండింగ్‌లో ఉన్న ట్రూ అప్ చార్జీలను వసూలు చేసేందుకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈఆర్సీ దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూనే.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ వ్యవహారంపై ఇటీవల విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు విజయవాడలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారని సమాచారం. దీంతో ఐదేళ్ల కాలపరిమితితో చార్జీల వసూలును అధికారులు ప్రతిపాదించారు. వచ్చే నెలలో ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఇదేనెలలో ప్రభుత్వం కూడా అధికారికంగా తన అభిప్రాయాన్ని ఈఆర్సీకి అందజేస్తుంది. నవంబర్ నెలాఖరులో విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసర నివేదిక(ఏఆర్ఆర్)లు సమర్పిస్తాయి. ఇందులోనే ట్రూ అప్ భారాన్ని కలుపుకుని కొత్త టారిఫ్‌కు అనుమతి కోరనున్నారు. అయితే 2011 నుంచి విదేశీ, స్వదేశీ బొగ్గు కొనుగోళ్లతోపాటు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు ఏపీఈఆర్సీ ముందస్తు అనుమతినివ్వలేదు. విద్యుత్ చట్టాల ప్రకారం వీటిని తొలగిం చాల్సి ఉంటుందని ఈఆర్సీ భావిస్తోంది. దీనివల్ల కొంతభారాన్ని తగ్గించే వీలుందని అధికారులంటున్నారు. ట్రూ అప్ చార్జీలంటే.. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి ఏటా ఏపీఈఆర్సీకి తమ వార్షిక ఆదాయ, అవసర నివేదికలను సమర్పిస్తాయి. ఆ మేరకు కొత్త టారిఫ్‌కు అనుమతి కోరతాయి. కొత్త టారిఫ్ ప్రకటించిన తర్వాత.. ఆ సంవత్సరంలో అంచనాలకు మించి అయ్యే ఖర్చును(అదనపు విద్యుత్, అదనపు బొగ్గు కొనుగోలు వంటివి) ట్రూ అప్ చార్జీలుగా పేర్కొంటారు.