రూ.7,209 కోట్ల విద్యుత్ భారం
- ప్రజలపై ట్రూ అప్ చార్జీల పేర బాదుడుకు రంగం సిద్ధం
- వచ్చే టారిఫ్ నుంచే మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకివ్వనుంది. ట్రూ అప్ చార్జీల భారాన్ని జనంపైనే మోపేందుకు సిద్ధమైంది. ఫలితంగా రూ.7,209 కోట్లను విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశముంది. అయితే ఇంత మొత్తాన్ని ఒకే ఏడాది చార్జీల రూపంలో మోపవద్దని, ఐదేళ్ల గరిష్ట పరిమితితో ఈ ట్రూ అప్ చార్జీలను రాబట్టుకోవాలని సర్కారు విద్యుత్ అధికారులకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం.
కేటగిరీలవారీగా ట్రూ అప్ చార్జీలను విధించే అవకాశాన్ని పరిశీలించాలనీ సూచించింది. వాణిజ్య, 200 యూనిట్ల వాడకం పైబడిన గృహ విద్యుత్ వినియోగదారులపై భారం మోపినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న అధికారుల సూచనకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే టారిఫ్ నుంచే ట్రూ అప్ భారంతో కలిపి విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశముంది.
భారం భరించేందుకు సర్కారు నో..
2009 నుంచి పెండింగ్‌లో ఉన్న ట్రూ అప్ చార్జీలను వసూలు చేసేందుకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) అనుమతి కోరాయి. ఈఆర్‌సీ దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూనే.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ వ్యవహారంపై ఇటీవల విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు విజయవాడలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారని సమాచారం. దీంతో ఐదేళ్ల కాలపరిమితితో చార్జీల వసూలును అధికారులు ప్రతిపాదించారు.
వచ్చే నెలలో ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఇదేనెలలో ప్రభుత్వం కూడా అధికారికంగా తన అభిప్రాయాన్ని ఈఆర్‌సీకి అందజేస్తుంది. నవంబర్ నెలాఖరులో విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసర నివేదిక(ఏఆర్‌ఆర్)లు సమర్పిస్తాయి. ఇందులోనే ట్రూ అప్ భారాన్ని కలుపుకుని కొత్త టారిఫ్‌కు అనుమతి కోరనున్నారు. అయితే 2011 నుంచి విదేశీ, స్వదేశీ బొగ్గు కొనుగోళ్లతోపాటు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు ఏపీఈఆర్‌సీ ముందస్తు అనుమతినివ్వలేదు. విద్యుత్ చట్టాల ప్రకారం వీటిని తొలగిం చాల్సి ఉంటుందని ఈఆర్‌సీ భావిస్తోంది. దీనివల్ల కొంతభారాన్ని తగ్గించే వీలుందని అధికారులంటున్నారు.
ట్రూ అప్ చార్జీలంటే..
విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి ఏటా ఏపీఈఆర్సీకి తమ వార్షిక ఆదాయ, అవసర నివేదికలను సమర్పిస్తాయి. ఆ మేరకు కొత్త టారిఫ్‌కు అనుమతి కోరతాయి. కొత్త టారిఫ్ ప్రకటించిన తర్వాత.. ఆ సంవత్సరంలో అంచనాలకు మించి అయ్యే ఖర్చును(అదనపు విద్యుత్, అదనపు బొగ్గు కొనుగోలు వంటివి) ట్రూ అప్ చార్జీలుగా పేర్కొంటారు.