Power users
-
మంగళం!
పాలకొండ రూరల్ : విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం మరో భారం మోపింది. గతంలో వినియోగదారులు తమ సమస్యలను కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదు చేసుకుంటే అక్కడి సిబ్బంది సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాని పరిష్కారానికి 24 గంటల్లో చర్యల్లో చేపట్టేవారు. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యవస్థ(కాల్‌సెంటర్)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఈ సేవలు దూరం కానున్నాయి. ఇప్పటికే యువత ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి కొరవడి ఇక్కట్లు పడుతున్న క్రమంలో ఒక్కొక్కొటిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భృతి పొందుతున్న వారిపై చర్యలకు దిగడం విమర్శలకు తావిస్తుంది. అయితే కాల్ సెంటర్లలో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని నిలిపి వేయక ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం చూపించారు. నియోజకవర్గానికి ఒకటి... జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి వంతున 10 సెంటర్ల పరిధిలో విద్యుత్ వినియోగదారులకు సేవలందించేవారు. ఈ సేవలను ఏడు భాగాలుగా విభజించారు. వాటిలో కేటగిరి-1లో సాధారణ గృహాల నూతన మీటర్లు, కేటగిరి రెండులో సాధారణ వ్యాపారాలు(దుకాణాలు), కుటీర పరిశ్రమలు వంటివి, మూడులో ఇండస్ట్రీయల్, నాలుగులో చేతివృత్తులు, ఐదులో వ్యవసాయం, ఆరులో గ్రామీణ పంచాయతీలు, ఏడులో దేవాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఏ చిన్న తరహా సమస్యలు తలెత్తిన కాల్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు ఈ తరహా సేవలను మీ-సేవా కేంద్రాలకు బదలారుుంచారు. ఈ నేపథ్యంలో 7 కేటగిరీల్లో ఉన్న వినియోగదారులు ఇక నూతన మీటర్లు, ట్రాన్సఫార్మర్లు, నూతన విద్యుత్ లైన్లు తదితర అవసరాలకు మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిందే! సమస్యలు ఇలా .... ఇకపై వినియోగదారులకు ఎప్పుడు ఏచిన్న సమస్య వచ్చినా అందుబాట్లో ఉన్న మీ-సేవా కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ నిబంధనల మేరకు తమ ఫిర్యాదు తీవ్రతను బట్టి కొంత రుసుము వదిలించుకుని ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు బాగానే ఉన్నా ఈ నూతన విధానంపై మీ-సేవా కేంద్ర నిర్వాహకులకు ఎటువంటి అవగాహనా లేదు. ఇప్పటి వరకు వీరికి ఎటువంటి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం లేదు. దీంతో వినియోగదారు తమ సమస్యలు తెలిపేందుకు మీ-సేవకు వెళ్లినా ఫలితం లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ సేవలు అందించేందుకు మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు ముందుకు రాకపోవటం కొసమెరుపు. -
8న విద్యుత్ వినియోగదారుల సదస్సు
సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యుత్ వినియోగ దారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను ఈనెల 8న తుక్కాపూర్‌లో విద్యుత్ వినియోగ దారుల జిల్లా సదస్సును నిర్వహించానున్నట్లు ట్రాన్స్‌కో ఎస్సీఈ సధానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంలకు తుక్కాపూర్‌లో నిర్వమించే విద్యుత్ వినియోగదారుల సదస్సులో పలు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వినియోగ దారులు అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫారలో అంతరాయము, చార్జీల హెచ్చు తగ్గులు, మిటర్ల సమస్యలు, కోత్త సర్వీసు జారీ చేయడంలో జాప్యం వంటీ సమస్యలను ఈ సదస్సులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. -
రూ.7,209 కోట్ల విద్యుత్ భారం
- ప్రజలపై ట్రూ అప్ చార్జీల పేర బాదుడుకు రంగం సిద్ధం - వచ్చే టారిఫ్ నుంచే మోత! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకివ్వనుంది. ట్రూ అప్ చార్జీల భారాన్ని జనంపైనే మోపేందుకు సిద్ధమైంది. ఫలితంగా రూ.7,209 కోట్లను విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశముంది. అయితే ఇంత మొత్తాన్ని ఒకే ఏడాది చార్జీల రూపంలో మోపవద్దని, ఐదేళ్ల గరిష్ట పరిమితితో ఈ ట్రూ అప్ చార్జీలను రాబట్టుకోవాలని సర్కారు విద్యుత్ అధికారులకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. కేటగిరీలవారీగా ట్రూ అప్ చార్జీలను విధించే అవకాశాన్ని పరిశీలించాలనీ సూచించింది. వాణిజ్య, 200 యూనిట్ల వాడకం పైబడిన గృహ విద్యుత్ వినియోగదారులపై భారం మోపినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న అధికారుల సూచనకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే టారిఫ్ నుంచే ట్రూ అప్ భారంతో కలిపి విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశముంది. భారం భరించేందుకు సర్కారు నో.. 2009 నుంచి పెండింగ్‌లో ఉన్న ట్రూ అప్ చార్జీలను వసూలు చేసేందుకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈఆర్సీ దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూనే.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ వ్యవహారంపై ఇటీవల విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు విజయవాడలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారని సమాచారం. దీంతో ఐదేళ్ల కాలపరిమితితో చార్జీల వసూలును అధికారులు ప్రతిపాదించారు. వచ్చే నెలలో ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఇదేనెలలో ప్రభుత్వం కూడా అధికారికంగా తన అభిప్రాయాన్ని ఈఆర్సీకి అందజేస్తుంది. నవంబర్ నెలాఖరులో విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసర నివేదిక(ఏఆర్ఆర్)లు సమర్పిస్తాయి. ఇందులోనే ట్రూ అప్ భారాన్ని కలుపుకుని కొత్త టారిఫ్‌కు అనుమతి కోరనున్నారు. అయితే 2011 నుంచి విదేశీ, స్వదేశీ బొగ్గు కొనుగోళ్లతోపాటు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు ఏపీఈఆర్సీ ముందస్తు అనుమతినివ్వలేదు. విద్యుత్ చట్టాల ప్రకారం వీటిని తొలగిం చాల్సి ఉంటుందని ఈఆర్సీ భావిస్తోంది. దీనివల్ల కొంతభారాన్ని తగ్గించే వీలుందని అధికారులంటున్నారు. ట్రూ అప్ చార్జీలంటే.. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి ఏటా ఏపీఈఆర్సీకి తమ వార్షిక ఆదాయ, అవసర నివేదికలను సమర్పిస్తాయి. ఆ మేరకు కొత్త టారిఫ్‌కు అనుమతి కోరతాయి. కొత్త టారిఫ్ ప్రకటించిన తర్వాత.. ఆ సంవత్సరంలో అంచనాలకు మించి అయ్యే ఖర్చును(అదనపు విద్యుత్, అదనపు బొగ్గు కొనుగోలు వంటివి) ట్రూ అప్ చార్జీలుగా పేర్కొంటారు. -
24/7 విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
25 ప్రదేశాల్లో ఎనీటైం పేమెంట్ మిషన్ల ఏర్పాటుకు కసరత్తు సబ్సిడీపై 3 వేల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు ఐపీడీఎస్ ప్రోగ్రాం కింద *208 కోట్లతో పనులు పేదలకు *125 కే విద్యుత్ కనెక్షన్ 80 లక్షల మందికి ఎల్ఈడీ బల్బులు లో ఓల్టేజీ నివారణకు ప్రత్యేక చర్యలు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర విద్యుత్ వినియోగదారులు ఎప్పుడైనా, అంటే 24 గంటల పాటు బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఎనీటైం పేమెంట్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర పేర్కొన్నారు. రైతులకు సైతం సబ్సిడీపై 3వేల సోలార్ పంపు సెట్లను అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తిరుపతి: ఐపీడీఎస్ పథకం కింద 3 జిల్లాల్లో రూ.208 కోట్లతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. దీనికి తోడు దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనవథకం కింద పేదలకు రూ.125లకే విద్యుత్ కనెక్షన్, వైరింగ్ చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు డిస్కం పరిధిలో పూర్తిస్థాయిలో ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. లో ఓల్టేజీ నివారణలో భాగంగా ఈఏడాది 208 విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షిప్రతినిధి’తో పలు విషయాలను ముచ్చటించారు. ప్రశ్న: ఎనీటైం పేమెంట్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? జవాబు: ఈ మిషన్లను ఏర్పాటు చేయడం వల్ల 24గంటల పాటు విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చు. ఇంతకు మునుపులా క్యూలో నిలబడి వేచివుండే అవసరం ఉండదు. ఇక్కడే చెక్పేమెంట్లతో పాటు, క్రెడిట్ కార్డు సౌకర్యంతో కూడా బిల్లులు చెల్లించే సౌలభ్యం ఉంటుంది. ఇప్పటికే విజయవాడ, తిరుపతిలో వీటిని ఏర్పాటుచేశాం. వీటితోపాటు మరో 23చోట్ల ఈ మిషన్లు ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో మరిన్ని చోట్ల ఈమిషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రశ్న: సోలార్ పంపుసెట్లపై రైతులకు ఎలాంటి రాయితీ ఉంది? జవాబు: సోలార్ 5హెచ్‌పీ పంపు సెట్ విలువ రూ.5లక్షలు. అయితే ఇందులో రైతు రూ.55వేలు చెల్లిస్తే చాలు.. పంపుసెట్ మొత్తం విలువలో 30 శాతం కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తం రూ.2.8లక్షలు డిస్కమే భరిస్తోంది. ఇందుకోసం ఈఏడాది రూ.150 కోట్లను వెచ్చిస్తున్నాం. ఇప్పటికే రైతుల నుంచి 150 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి వెంటనే రైతులకు పంపు సెట్లను అందించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశించాం. ఈ ఏడాది ఎస్పీడీసీఎల్ పరిధిలో 3వేల మంది రైతులకు సోలార్ పంపుసెట్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రశ్న ః ఐపీడీఎస్ పోగ్రామ్ కింద ఏయే పనులు జరుగుతున్నాయి? జవాబుః ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్) కింద విజయవాడ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో రూ.208 కోట్లతో విద్యుత్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. ఇందుకోసం అయ్యే ఖర్చులో 60 శాతం నిధులను కేంద్రమే భరిస్తోంది. ఈపనులు రెండేళ్ల లోపు పూర్తయితే కేంద్రం అదనంగా 15శాతం బోనస్ కూడా ఇస్తుంది. అదే రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తాయి. ప్రస్తుతం ఈనిధులతో 36 చోట్ల, 33/11 కెవీఎస్ఎస్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం 11 కెవీలకు సంబంధించి భూగర్భ లైన్లు 44.8 కిలోమీటర్ల మేర వేస్తున్నాం. ప్రశ్న: విద్యుత్ ఆదాకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: విద్యుత్ ఆదాకు సంబంధించి డిస్కం పరిధిలోని 80లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయనున్నాం. మొదటి విడతలో గుంటూరు జిల్లాలో 9.5లక్షలు, అనంతపురం జిల్లాలో 14లక్షల మందికి బల్బులు పంపిణీ చేశాం. మిగతా ఆరు జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం రూ.150 కోట్లను వెచ్చిస్తున్నాం. ప్రశ్న: లో ఓల్టేజీ నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జవాబుః లో ఓల్టేజీ నివారణ కోసం ఈ ఏడాది కొత్తగా 208 సబ్ స్టేషన్లను నిర్మించాం. మరో 42 సబ్ స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. విద్యుత్తు లైన్లను పునరుద్ధరిస్తున్నాం. ప్రశ్న: పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఏ స్కీమ్ కింద ఇస్తున్నారు? జవాబు: ప్రస్తుతం దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద రూ.230 కోట్లతో పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాం. ఈ పథకం కింద రూ.125లకే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు విద్యుత్ వైరింగ్ కూడా చేస్తాం. దీని ద్వారా రూ.4లక్షల మంది లబ్ధి చేకూరనుంది. -
గుండె గు‘బిల్లు’!
హన్మకొండ : విద్యుత్ వినియోగదారులపై భారం మోపేందుకు ఎన్పీడీసీఎల్ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ సంస్థ లోటును పూడ్చుకునేందుకు చార్జీలు పెంచే టారిఫ్ రేట్లను రూపొందించి టీఎస్ ఈఆర్సీకి పంపింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత టారిఫ్ రేట్లపై ప్రజాభిప్రాయ సేకరణను గురువారం హన్మకొండలోని జెడ్పీ సమావేశపు హాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సేకరించనుంది. కాగా, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీనివాస్, ఎల్.మోహన్‌రెడ్డి వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. చార్జీల పెంపుపై వ్యతిరేకత.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెలుగు చూసినప్పటి నుంచి వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాగా, ఈ అంశాన్ని వినియోగదారుల సంఘాలు కూడా నిరసిస్తున్నాయి. గతంలోను ఇలాగే ప్రజాభిప్రాయాలు సేకరించినా యధావిధిగా చార్జీలను పెంచారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏటా విద్యుత్ సంస్థల ఆదాయ, వ్యయాలను పరిశీలించిన తర్వాత చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణీత సమయంలో డిస్కంలు ప్రతిపాదనలు పంపించకుంటే రెగ్యులేటరీ కమిటీ తానే స్వయంగా ఎంత మేరకు పెంచాలో నిర్ణయం తీసుకొంటుంది. అయితే రాష్ట్రంలోని డిస్కంలు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు పెంపు అవకాశం ఇవ్వకుండా డిస్కంలే చార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాయి. వీటిపై రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. ఇదిలా ఉండగా, 2014-2015లో విద్యుత్ సరఫరా వ్యయం రూ.6,547.17 కోట్లు కాగా, 2015-2016లో రూ.7,598.95 కోట్లకు పెరగనుందని అంచనా వేశారు. అలాగే ఆదాయం 2014-2015లో రూ. 3,144.67 కోట్లు ఉండగా, 2015, 2016 సంవత్సరానికి రూ. 3,546.83 కోట్లకు పెరుగనుందని అంచనా వేశారు. దీంతో రూ.4052.12 లోటు ఏర్పడనుందని అంచనా వేశారు. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు పెంపు ప్రతిపాదనలను ఎన్పీడీసీఎల్ సిద్ధం చేసింది. కాగా, తాజా పెంపు ప్రతిపాదనలతో ఎన్పీడీసీఎల్ పరిధిలో దాదాపు రూ.300 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఇదిలా ఉండగా, రెగ్యులేటరీ కమిషన్ ఎదుట నిరసన తెలిపేందుకు వినియోగదారులు సిద్ధమయ్యారు. చార్జీల పెంపు.. ప్రస్తుతం చార్జీలను కొంత మేరకు పెంచాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రతిపాదించింది. నెలకు 50 నుంచి 100 యూనిట్లలోపు వాడుకునే వారికి చార్జీలను పెంచలేదు. 100 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగంపై స్వ ల్ఫంగా 4 శాతం, 200 యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించే గృహ వినియోగదారులపై ప్రస్తుత చార్జీల కన్నా 5.75 శాతం మేరకు పెంచేందుకు సంస్థ ప్రతిపాదించింది. ఎల్టీ-2 కేటగిరీలో గృహేతర, వాణిజ్య, ఎల్టీ-3 కేటగిరీలో పరిశ్రమలు, ఎల్-4 కేటగిరీలో కుటీర పరిశ్రమల వినియోగంపై ప్రస్తుతం ఉన్న చార్జీలకన్నా 5.75 శాతం హెచ్చిస్తూ ప్రతిపాదించింది. ఎల్టీ-5 కేటగిరీలో వీధి దీపాలు, రక్షిత మంచినీటి పథకాలకు, పంచాయతీలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, ఎల్టీ-7 కేటగిరీలో సాధారణ విద్యుత్ వాడకం, ప్రార్థనా ప్రాంగణాలు, ఎల్టీ-8 కేటగిరీలో తాత్కాలిక వినియోగం కింద వాడకమయ్యే విద్యుత్ చార్జీలను కూడా 5.75 శాతం పెంచాలని ప్రతిపాదించింది. హెచ్‌టీ-1 కేటగిరీ కింద పరిశ్రమలు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల కాలంలో వినియోగించిన విద్యుత్‌కు అదనంగా యూనిట్‌కు రూ.1 చొప్పున టీఓడీ చార్జిని విధించాలని కూడా ప్రతిపాదించింది. అయితే పెంపులో వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ప్రస్తుతం ఉన్న చార్జీలను యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించింది. పెరుగుదల ఇలా.... గృహ వినియోగంపై... యూనిట్లు {పస్తుతచార్జీ ప్రతిపాదిత చార్జి 0-101 2.60 2.70 101 నుంచి 200 3.60 3.75 200 యూనిట్లు ఆపైన....0-50 2.60 2.75 51-100 3.25 3.44 101-150 4.88 5.16 151-200 5.63 5.95 201-250 6.38 6.75 251-300 6.88 7.28 301-400 7.38 7.80 401-500 7.38 8.33 500 ఆపైన 7.88 8.86 -
విద్యుత్ వినియోగ దారులపై విజిలెన్స్ దాడులు
నల్లగొండ: నల్లగొండ జిల్లా మునగాల మండలంలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వినియోగదారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 810 మందిపై అక్రమ విద్యుత్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. (మునగాల) -
ఆధార్ అనుసంధానం 72 శాతం
ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ఇప్పటి వరకు 72 శాతం ఆధార్‌కార్డులను అనుసంధానం చేశారు. జిల్లాలో మొత్తం 7,25,610 విద్యుత్ సర్వీసులు ఉండగా వీటిలో 5,22,129 విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ఆధార్ కార్డుల అనుసంధానం పూర్తయింది. అలాగే పులివెందుల డివిజన్ 81 శాతం ఆధార్‌కార్డుల అనుసంధానంతో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండగా 76 శాతంతో ప్రొద్దుటూరు డివిజన్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే కడప డివిజన్ 74 శాతం, రాజంపేట 73, మైదుకూరు 66, రాయచోటి 60 శాతం లక్ష్యాన్ని సాధించాయి. ప్రొద్దుటూరు డివిజన్‌కు సంబంధించి 1,69,775 మంది విద్యుత్ వినియోగదారులకు గాను 1,28,914 మందికి సంబంధించిన ఆధార్ కార్డులను అనుసంధానం చేసినట్లు ఏఏఓ వేణుగోపాలరావు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి మాత్రమే కొంత వెనుకంజలో ఉన్నట్లు ఆయన తెలిపారు.