మంగళం!
Published Mon, Nov 28 2016 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM
పాలకొండ రూరల్ : విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం మరో భారం మోపింది. గతంలో వినియోగదారులు తమ సమస్యలను కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదు చేసుకుంటే అక్కడి సిబ్బంది సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాని పరిష్కారానికి 24 గంటల్లో చర్యల్లో చేపట్టేవారు. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యవస్థ(కాల్‌సెంటర్)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఈ సేవలు దూరం కానున్నాయి. ఇప్పటికే యువత ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి కొరవడి ఇక్కట్లు పడుతున్న క్రమంలో ఒక్కొక్కొటిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భృతి పొందుతున్న వారిపై చర్యలకు దిగడం విమర్శలకు తావిస్తుంది. అయితే కాల్ సెంటర్లలో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని నిలిపి వేయక ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం చూపించారు.
నియోజకవర్గానికి ఒకటి...
జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి వంతున 10 సెంటర్ల పరిధిలో విద్యుత్ వినియోగదారులకు సేవలందించేవారు. ఈ సేవలను ఏడు భాగాలుగా విభజించారు. వాటిలో కేటగిరి-1లో సాధారణ గృహాల నూతన మీటర్లు, కేటగిరి రెండులో సాధారణ వ్యాపారాలు(దుకాణాలు), కుటీర పరిశ్రమలు వంటివి, మూడులో ఇండస్ట్రీయల్, నాలుగులో చేతివృత్తులు, ఐదులో వ్యవసాయం, ఆరులో గ్రామీణ పంచాయతీలు, ఏడులో దేవాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఏ చిన్న తరహా సమస్యలు తలెత్తిన కాల్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు ఈ తరహా సేవలను మీ-సేవా కేంద్రాలకు బదలారుుంచారు. ఈ నేపథ్యంలో 7 కేటగిరీల్లో ఉన్న వినియోగదారులు ఇక నూతన మీటర్లు, ట్రాన్‌సఫార్మర్లు, నూతన విద్యుత్ లైన్‌లు తదితర అవసరాలకు మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిందే!
సమస్యలు ఇలా ....
ఇకపై వినియోగదారులకు ఎప్పుడు ఏచిన్న సమస్య వచ్చినా అందుబాట్లో ఉన్న మీ-సేవా కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ నిబంధనల మేరకు తమ ఫిర్యాదు తీవ్రతను బట్టి కొంత రుసుము వదిలించుకుని ఆన్‌లైన్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు బాగానే ఉన్నా ఈ నూతన విధానంపై మీ-సేవా కేంద్ర నిర్వాహకులకు ఎటువంటి అవగాహనా లేదు. ఇప్పటి వరకు వీరికి ఎటువంటి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం లేదు. దీంతో వినియోగదారు తమ సమస్యలు తెలిపేందుకు మీ-సేవకు వెళ్లినా ఫలితం లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ సేవలు అందించేందుకు మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు ముందుకు రాకపోవటం కొసమెరుపు.
Advertisement
Advertisement