hindhuja
-
‘హిందూజా’, డిస్కంల వివాదం పరిష్కారం
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్), డిస్కంల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పరిష్కరించింది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఇరు వర్గాలకు ఇబ్బంది లేని విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సమీపంలోని పాలవలసలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు 1,040 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ఉంది. దీని నుంచి విద్యుత్ కొనుగోలుకు 1992లో ఏపీ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం 1994లో 30 ఏళ్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. 1996లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల డిస్కంలకు, హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు మధ్య వివాదం తలెత్తింది. తమకు అవసరం లేకపోయినా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్‌ను ఎందుకు తీసుకోవాలని, పీపీఏను పునఃసమీక్షించాలని డిస్కంలు పట్టుబట్టాయి. దీంతో 1998లో మరోసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. మరోవైపు సంస్థ మూలధనం రూ.7,758 కోట్లుగా ఏపీఈఆర్సీకి హెచ్‌ఎన్‌పీసీఎల్ చూపించింది. దీనిపై విచారణ చేపట్టిన మండలి హెచ్‌ఎన్‌పీసీఎల్ చెబుతున్న మూలధనంలో రూ.5,810.75 కోట్లకు ఆమోదం తెలిపింది. పాతికేళ్లకే ఒప్పందం కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తాజా అనుమతులను ఇవ్వడం ఆపివేసింది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న పారిస్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలకు మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని 30 సంవత్సరాలకు బదులుగా ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తేదీ నుండి 25 సంవత్సరాలుగా ఏపీఈఆర్సీ నిర్ణయించింది. హిందూజా పవర్ యూనిట్ ధర రూ.3.98 గా తేల్చింది. అంతేకాకుండా గత ఆరేళ్లలో హెచ్‌ఎన్‌పీసీఎల్‌కు డిస్కంలు చెల్లించిన అడ్హాక్ టారిఫ్‌లను తుది టారిఫ్‌లుగా పరిగణించామని, కంపెనీ ఎలాంటి బకాయిలను వసూలు చేయడానికి వీల్లేదని చెప్పింది. తద్వారా డిస్కంలపై అదనపు భారం పడకుండా కాపాడింది. విద్యుత్ కొనుగోలు చార్జీ(ట్రూ అప్) భారం పడకుండా ప్రజలకు మేలు చేసింది. అయితే డిస్కంలకు విద్యుత్ అవసరం లేనప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ విక్రయించుకునేందుకు సంస్థకు అనుమతినిచ్చింది. -
మళ్లీ ము‘క్యాష్’ కింగ్..!
ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,700 కోట్లు. తాజా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే... ► రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే. ► అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. ► రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం. ► సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2% పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది. ► మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26%) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి. ► సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్ఆర్ఐలకు ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ► స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి∙అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు. ► జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు. వృద్ధిలో వీరి పాత్ర కీలకం... ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం. –అనాన్ రెహ్మాన్ జునైడ్, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ, చీఫ్ రెసెర్చర్ వేగం పుంజుకుంటున్న భారత్ భారత్ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది. – యతిన్ షా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కో–ఫౌండర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు హురున్ భారతీయ కుబేరుల జాబితా (బిలియనీర్లు)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 మంది కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) చైర్మన్ పి.పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్చంద్ర కిరణ్ 83వ స్థానం, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు. పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి కాగా, దేశంలోని టాప్–10 మహిళా కుబేరుల జాబితాలో దివీస్ ల్యాబ్స్‌కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. ఇక స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదిగిన అత్యంత పిన్న వయస్కుల్లో(40 ఏళ్ల లోపు) విజయవాడకు చెందిన 33 ఏళ్ల శ్రీహర్ష మాజేటి చోటు సంపాదించారు. స్విగ్గీ సహ ప్రమోటర్ శ్రీహర్ష సంపద విలువను హురున్ రూ.1,400 కోట్లుగా లెక్కగట్టింది. మొత్తం సంపన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 68 మంది,(గతేడాది 49), ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది(గతేడాది 6) ఉన్నట్లు హురున్ వెల్లడించింది. గోపిచంద్ హిందూజా, శ్రీచంద్ హిందూజా, అజీం ప్రేమ్‌జీ రాంప్రసాద్‌రెడ్డి, దివి సత్చంద్ర కిరణ్, నీలిమ, శ్రీహర్ష మాజేటి -
‘జెట్’ విక్రయంలో కదలిక!
ముంబై: జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్ గ్రూపు బుధవారం ఎస్బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్ గ్రూపు సీఈవో రాహుల్ గన్‌పులే తెలిపారు. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్బీఐ క్యాప్స్ మమ్మల్ని ఆహ్వానించింది. జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జెట్ కోసం తాము ఈ నెల 8న బిడ్ వేసినట్టు గన్‌పులే ధ్రువీకరించారు. ఫైనాన్షియల్ బిడ్ సమర్పించే ముందు తగిన విచారణలు చేశామని, అయినప్పటికీ బయటకు వెల్లడి కాని మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు. ఏకీకృత ఒప్పందం కింద గత కాలపు అప్పులన్నీ తీసుకుంటామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఎస్బీఐ క్యాప్స్ తమను నిధులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరినట్టు చెప్పారు. ఎతిహాద్‌ను బోర్డులోకి తీసుకునేందుకు ఆ సంస్థతోనూ సంప్రదించినట్టు తెలిపారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు జెట్ ఎయిర్వేస్కు రూ.8,000 కోట్లకు పైగా రుణాలివ్వగా, వసూలు చేసుకోలేని స్థితిలో చివరికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటాదారులు అయిన విషయం తెలిసిందే. అనంతరం జెట్ ఎయిర్వేస్లో 75 శాతం వాటాను బ్యాంకుల తరఫున ఎస్బీఐ క్యాప్స్ అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌తో పాటు మరో రెండు సంస్థల నుంచి బిడ్లు రాగా, ఎతిహాద్ బిడ్ షరతులతో కూడి ఉన్నట్టు గుర్తించింది. హిందుజాలను ఒప్పించే యత్నం? జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలు, ఎతిహాద్ కలసి హిందుజా గ్రూపును సంప్రదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జెట్ ఎయిర్వేస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటా తీసుకోవాలని కోరినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై హిందుజా సోదరులు ఎలాంటి హామీనీ ఇవ్వలేదు. ఎతిహాద్ ప్రతినిధులు తొలుత హిందుజా సోదరుల్లో గ్రూపు వ్యవహారాలు చూసే జీపీ హిందుజాను సంప్రదించారు. అయితే, భారత వ్యాపారాలను చూస్తున్న తమ్ముడు అశోక్ హిందుజాతో ఎతిహాద్ ప్రతినిధులను జీపీ హిందుజా మాట్లాడించారు. జెట్‌లో పెట్టుబడిపై హిందుజా గ్రూపు హామీ ఇవ్వలేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఏవియేషన్‌పై గతంలో హిందుజాల ఆసక్తి ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, మీడియా, ఐటీ, విద్యుత్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ ఇలా పది వ్యాపారాల్లో హిందుజాలున్నారు. 2001లో ఎయిర్ ఇండియా కోసం హిందుజా గ్రూపు ఆసక్తి కూడా చూపించింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా అప్పట్లో పోటీ పడ్డాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటా పట్ల కూడా హిందుజా గ్రూపు గతంలో ఆసక్తి చూపించింది. మరింత నష్టపోయిన షేరు కంపెనీ నిర్వహణ విషయంలో అస్పష్టత నేపథ్యంలో వరుసగా మూడో రోజూ జెట్ ఎయిర్వేస్ షేరు నష్టపోయింది. కంపెనీ సీఈవో వినయ్‌దూబే, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాల్ రాజీనామాలు చేయడం షేరుపై ప్రభావం చూపించాయి. బీఎస్ఈలో బుధవారం షేరు ధర 4 శాతానికి పైగా నష్టపోయి 123.70 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నూతన 52 వారాల కనిష్ట స్థాయి రూ.120.25 నమోదు చేసింది. -
బ్రిటిష్ ఆసియన్స్‌లో ధనిక కుటుంబం.. హిందూజా
లండన్: హిందూజా కుటుంబం బ్రిటన్‌లోని బ్రిటిష్ ఆసియన్లలో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. 2017లో ఈ కుటుంబ సంపద విలువ 22 బిలియన్ పౌండ్లు. హిందూజా కుటుంబానికి ఈ తరహా గుర్తింపు లభించడం ఇది వరుసగా ఐదవ ఏడాది. నలుగురు సోదరులు– శ్రీచంద్ పీ హిందూజా, గోపీచంద్ పీ హిందూజా, ప్రకాశ్ పీ హిందూజా, అశోక్ పీ హిందూజా నేతృత్వంలో లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్– 2017లో వీరి కుటుంబ సంపద విలువను అంతక్రితం ఏడాదితో పోల్చితే 3 బిలియన్ పౌండ్లు పెంచింది. బ్రిటన్‌కు చెందిన ఆసియన్ మీడియా గ్రూప్ (ఏఎంజీ) ప్రచురించిన వార్షిక ‘ఆసియన్ రిచ్ లిస్ట్’ తాజా వివరాలను తెలిపింది. రెండవ స్థానంలో లక్ష్మీ మిట్టల్ జాబితాలో రెండవ స్థానం– ఇండియన్ స్టీల్ దిగ్గజం– లక్ష్మీ నివాస్ మిట్టల్‌కు దక్కింది. ఆయన సంపద 14 బిలియన్ పౌండ్లు. 2016లో ఈ విలువ 12.6 బిలియన్ పౌండ్లు. ఐదవ స్థానంలో అనిల్ అగర్వాల్ ►పెట్రోకెమికల్, టెక్స్టైల్స్ కంపెనీ– ఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియా 5.1 బిలియన్ పౌండ్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. ►నాల్గవ స్థానంలో 2.35 బిలియన్ పౌండ్లతో పాకిస్తానీ అన్వర్ పర్వేజ్ (బెస్ట్‌వే వ్యవస్థాపకులు) ఉన్నారు. ►రిటైల్ దిగ్గజాలు సిమన్, బాబీ అండ్ రాబిన్ అరోరా, మెటల్ కింగ్ అనిల్ అగర్వాల్‌లు 2.3 బిలియన్ పౌండ్ల సంపదతో సంయుక్తంగా ఐదవ స్థానంలో నిలిచారు. సంపద మొత్తం 80.2 బిలియన్ డాలర్లు... ►దక్షిణాసియాలో మూలాలు ఉన్న 101 మంది బ్రిటన్ మిలియనీర్ల సంపద మొత్తంగా చూస్తే, 2017లో 80.2 బిలియన్ పౌండ్లు. 2016తో పోల్చితే ఈ సంపద 11 బిలియన్ పౌండ్లు పెరిగింది. వీరిలో మొదటి 10 మంది ప్రముఖ బ్రిటిష్ ఆసియన్ల సంపద 54.25 బిలియన్ పౌండ్లు. మొత్తం సంపదలో ఇది 68 శాతం. ►తాజా జాబితాను లండన్‌లో జరుగుతున్న 21వ వార్షిక ఆసియన్ బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో లాంఛనంగా ఆవిష్కరిస్తారు. ఆర్థికంగా సవాళ్లు ఉన్నా... బ్రిటన్ ఆసియన్లు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంకుకూ... ఈ అవార్డుల కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ (ఆసియన్ బిజినెస్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్), హోటల్స్ వ్యాపారవేత్త జోగీందర్ సింగ్ (బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్), బ్రిటన్‌లో డిష్యూమ్ ఇండియన్ రెస్టారెంట్ల చైన్ చీఫ్ షామిల్ తక్రార్ (రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్)లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతుండటం గమనార్హం. -
'అన్ని చెప్పాకే ఆ పని చేయండి'
విశాఖపట్నం: ప్రభుత్వ భూములు కేటాయించి రెండున్నర దశాబ్ధాలు అయినాఇప్పటి వరకు హిందూజ పవర్ ప్లాంట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ అన్నారు. నలుగురు కలెక్టర్లు మాట్టాడినా నేటికి ఆర్ ఆర్ ప్యాకేజీ విషయంలో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్పారు. ఏప్రిల్ 13,2013న విడుద లచే సిన జీవో ప్రకారం ఆరు శాఖలతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. నివేదిక అంది ఉంటే ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయకుండా ఈ నెల 30, మే 1న మరోసారి హిందూజ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకోబోతుందని తెలిసిందని చెప్పారు. వీటన్నింటిపై ప్రజలకు అన్ని వివరాలు తెలియజేశాకే హిందూజాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.