‘జెట్‌’ విక్రయంలో కదలిక! | Darwin Platform Group, SBI Caps discuss unsolicited bid for Jet Airways | Sakshi

‘జెట్‌’ విక్రయంలో కదలిక!

Published Thu, May 16 2019 5:40 AM | Last Updated on Thu, May 16 2019 5:40 AM

Darwin Platform Group, SBI Caps discuss unsolicited bid for Jet Airways - Sakshi

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్‌ గ్రూపు బుధవారం ఎస్‌బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్‌ గ్రూపు సీఈవో రాహుల్‌ గన్‌పులే తెలిపారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్‌ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్‌బీఐ క్యాప్స్‌ మమ్మల్ని ఆహ్వానించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

జెట్‌ కోసం తాము ఈ నెల 8న బిడ్‌ వేసినట్టు గన్‌పులే ధ్రువీకరించారు. ఫైనాన్షియల్‌ బిడ్‌ సమర్పించే ముందు తగిన విచారణలు చేశామని, అయినప్పటికీ బయటకు వెల్లడి కాని మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు. ఏకీకృత ఒప్పందం కింద గత కాలపు అప్పులన్నీ తీసుకుంటామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఎస్‌బీఐ క్యాప్స్‌ తమను నిధులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరినట్టు చెప్పారు.

ఎతిహాద్‌ను బోర్డులోకి తీసుకునేందుకు ఆ సంస్థతోనూ సంప్రదించినట్టు తెలిపారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.8,000 కోట్లకు పైగా రుణాలివ్వగా, వసూలు చేసుకోలేని స్థితిలో చివరికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటాదారులు అయిన విషయం తెలిసిందే. అనంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌లో 75 శాతం వాటాను బ్యాంకుల తరఫున ఎస్‌బీఐ క్యాప్స్‌ అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌తో పాటు మరో రెండు సంస్థల నుంచి బిడ్లు రాగా, ఎతిహాద్‌ బిడ్‌ షరతులతో కూడి ఉన్నట్టు గుర్తించింది.   

హిందుజాలను ఒప్పించే యత్నం?
జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన సంస్థలు, ఎతిహాద్‌ కలసి హిందుజా గ్రూపును సంప్రదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా వాటా తీసుకోవాలని కోరినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై హిందుజా సోదరులు ఎలాంటి హామీనీ ఇవ్వలేదు. ఎతిహాద్‌ ప్రతినిధులు తొలుత హిందుజా సోదరుల్లో గ్రూపు వ్యవహారాలు చూసే జీపీ హిందుజాను సంప్రదించారు. అయితే, భారత వ్యాపారాలను చూస్తున్న తమ్ముడు అశోక్‌ హిందుజాతో ఎతిహాద్‌ ప్రతినిధులను జీపీ హిందుజా మాట్లాడించారు. జెట్‌లో పెట్టుబడిపై హిందుజా గ్రూపు హామీ ఇవ్వలేదని ఓ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.

ఏవియేషన్‌పై గతంలో హిందుజాల ఆసక్తి
ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, మీడియా, ఐటీ, విద్యుత్, హెల్త్‌కేర్, రియల్‌ ఎస్టేట్‌ ఇలా పది వ్యాపారాల్లో హిందుజాలున్నారు. 2001లో ఎయిర్‌ ఇండియా కోసం హిందుజా గ్రూపు ఆసక్తి కూడా చూపించింది. టాటా సన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా అప్పట్లో పోటీ పడ్డాయి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటా పట్ల కూడా హిందుజా గ్రూపు గతంలో ఆసక్తి చూపించింది.  

మరింత నష్టపోయిన షేరు
కంపెనీ నిర్వహణ విషయంలో అస్పష్టత నేపథ్యంలో వరుసగా మూడో రోజూ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు నష్టపోయింది. కంపెనీ సీఈవో వినయ్‌దూబే, డిప్యూటీ సీఈవో అమిత్‌ అగర్వాల్‌ రాజీనామాలు చేయడం షేరుపై ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈలో బుధవారం షేరు ధర 4 శాతానికి పైగా నష్టపోయి 123.70 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నూతన 52 వారాల కనిష్ట స్థాయి రూ.120.25 నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement