
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీ విద్యుత్ ప్రాజెక్టులోనూ అవినీతి వరదలై పారిందనే విమర్శలొచ్చాయి. 2015లో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు (టాటాకు), నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు(బీజీఆర్) 800 మెగావాట్ల విస్తరణ కాంట్రాక్టుల్లో రూ.2,600 కోట్ల మేర ఎక్కువ అంచనాలు వేసి దోచుకున్నట్టు తీవ్ర ఆరోపణలొచ్చాయి. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మెగావాట్ రూ.5.8 కోట్లకే ఈపీసీ కాంట్రాక్టులు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇదే తరహా ప్రాజెక్టులకు ఏకంగా మెగావాట్‌కు రూ.6.2 కోట్ల మేర కట్టబెట్టింది. పైగా ఈ రెండు సంస్థలకే కాంట్రాక్టులు ఇచ్చేందుకు వారికి అనుకూలంగా నిబంధనలు పెట్టడం విమర్శలకు దారి తీసింది.
- అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఏర్పాటు చేసిన 500 మెగావాట్ల సోలార్ కాంట్రాక్టు పనుల్లోనూ రూ.500 కోట్ల మేర చేతివాటం బహిర్గతమైంది. ఇక్కడ ఎన్టీపీసీ నిబంధనలకు విరుద్ధంగా మూడు కాంట్రాక్టు సంస్థలకు అధిక రేట్లకు కాంట్రాక్టు ఇవ్వడంపై పలు విమర్శలొచ్చాయి.
- ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల ఏర్పాట్లలో అంతులేని అవినీతి తేటతెల్లమైంది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. నన్నూరు–జమ్మలమడుగు 400 కేవీ లైన్‌కు సంబంధించి రాయి పడినట్టు టాటా సంస్థ తప్పుడు బిల్లులు పెట్టింది. ఇందులో జరిగిన రూ.10 కోట్ల అవినీతిలో పెద్దల భాగస్వామ్యం ఉందని విజిలెన్స్ విభాగం కూడా నిర్థారించింది.
- ప్రైవేటు పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి వరదపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ లేకున్నా 2 వేల మెగావాట్ల పవన, సౌర విద్యుత్‌ను ఏకంగా 25 ఏళ్లకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, దీనివల్ల రూ.35 వేల కోట్ల నష్టం జరుగుతుందని విద్యుత్ వర్గాలు ఏపీఈఆర్‌సీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. మొదట్లో ఈ విద్యుత్ వద్దంటూ అభ్యంతరం చెప్పిన ప్రభుత్వం.. కేవలం మూడు నెలల్లోనే మళ్లీ కావాలని ఏపీఈఆర్‌సీకి తెలపడం విశేషం. ముఖ్యమంత్రితో రాయబారం జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.