సాక్షి, హైదరాబాద్: విభజన అనంతరం రాష్ట్ర విద్యుత్తు రంగంపై రెండు రాష్ట్రాలకూ అధికారాలు లేకుండాపోబోతున్నాయి. విచిత్రంగా అనిపించినా కేంద్ర విద్యుత్తు చట్టం ఇలాగే చెబుతోంది. విభజన తర్వాత అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతంలోని ఏ విద్యుత్ ప్లాంటు ధరను నిర్ణయించాలన్నా... ఏవైనా వివాదాలు తలెత్తినా పరిష్కరించుకునేందుకు ఢిల్లీకి పరుగెత్తాల్సిందే. రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాల్లో ఏర్పడే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఈఆర్‌సీ), ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)లు కేవలం పేరుకే పరిమితం కానున్నాయి. కేవలం ఏడాదికి ఒకసారి విద్యుత్ చార్జీల నిర్ణయానికి మాత్రమే పరిమితం కావాల్సి రానుంది. అదెలాగంటే...
రాష్ట్ర విభజన అనంతరం కూడా జెన్‌కోతో పాటు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కొనసాగుతాయని బిల్లులో కేంద్రం పేర్కొంది. పీపీఏ మేరకే ఇరు ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపింది. దీంతో తెలంగాణలో ఉన్న విద్యుత్ ప్లాంటు నుంచి తెలంగాణతో పాటు సీమాంధ్రకు కూడా యథావిధిగా కేటాయింపుల మేరకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నమాట. అంటే ఒకే విద్యుత్ ప్లాంటు నుంచి విభజన తర్వాత 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతుంది.
్హ ఒక విద్యుత్ ప్లాంటు నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరిగితే... సదరు ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే యూనిట్ విద్యుత్ ధరతో పాటు అన్ని అంశాలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) పరిశీలిస్తుంది.
్హ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్‌టీపీసీ ప్లాంట్ల నుంచి అనేక రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అందుకే ఎన్‌టీపీసీ యూనిట్ల విద్యుత్ ధరను సీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఈ ప్లాంట్లపై ఆయా రాష్ట్రాల్లోని ఈఆర్‌సీలకు ఎటువంటి అధికారం ఉండదు. తద్వారా ఇటు తెలంగాణ కానీ అటు సీమాంధ్రలోని ఏ విద్యుత్ ప్లాంటు యూనిట్ ధరతో పాటు ఏ ఇతర వివాదం తలెత్తినా పరిష్కరించే అధికారం సీఈఆర్‌సీకే ఉంటుంది. ఫలితంగా టీఈఆర్‌సీ, ఏపీఈఆర్‌సీలు కేవలం పేరుకే మనుగడలో ఉండనున్నాయి. పీపీఏలు ముగిసేవరకూ పరిస్థితి ఇంతే. అంటే రాబోయే 25-30 ఏళ్ల వరకూ వీటి అధికార పరిధి నామమాత్రమే.
ఏడాదికి ఒకసారి విద్యుత్ చార్జీలను మాత్రమే ఇవి నిర్ణయించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లోపు 2రాష్ట్రాలకు వేర్వేరు ఈఆర్‌సీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు మాత్రమే ప్రస్తుతం ఉన్న ఏపీఈఆర్‌సీ మనుగడలో ఉండనుంది. అయితే ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లపై ఆ రాష్ట్రంలోని ఈఆర్‌సీలకే అధికారాలు ఉండాలంటే... కేంద్ర విద్యుత్ చట్టంలో సవరణలు చేయాలి. పార్లమెంటుకు మాత్రమే ఈ అధికారం ఉంది.