వచ్చేస్తోంది ‘సమస్త్‌’ | Power Department is ready to bring the latest technology to the market | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోంది ‘సమస్త్‌’

Published Wed, Feb 26 2020 5:08 AM | Last Updated on Wed, Feb 26 2020 5:08 AM

Power Department is ready to bring the latest technology to the market - Sakshi

సాక్షి, అమరావతి: కరెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టడం, కోతలను నివారించడం లక్ష్యంగా సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు విద్యుత్‌ శాఖ సిద్ధమైంది. షెడ్యూలింగ్, అక్కౌంటింగ్, మీటరింగ్‌ అండ్‌ సెటిల్మెంట్‌ అఫ్‌ ట్రాన్సాక్షన్‌ ఇన్‌ ఎలక్ట్రిసిటీ (సమస్త్‌) టెక్నాలజీని మరో రెండు నెలల్లో ఆచరణలోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. మరోవారం రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ), రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) ఆధ్వర్యంలో సమస్త్‌ పనిచేస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనల మార్పు కోసం విద్యుత్‌ సంస్థలు ఏపీఈఆర్‌సీ ఎదుట పిటిషన్‌ దాఖలు చేయనున్నాయి. 

‘సమస్త్‌’ ప్రయోజనాలేంటి?
- టూల్స్‌ డేటా టెలీమీటర్స్, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో పాటు అత్యాధునిక పరిజ్ఞానం అనుసంధానమై ఉంటుంది. 
- దీనివల్ల ప్రతి సెకనుకూ ఎంత విద్యుత్‌ లభ్యత ఉంది? 24 గంటల్లో లభ్యత ఎలా ఉంటుంది? తేడా ఎంత? ఎంత జరిమానా విధించాలి? ఎంత బిల్లు వస్తుంది? అనే విషయాలు ఆన్‌లైన్‌ ద్వారానే రికార్డవుతాయి. 
- ఇదంతా ఉత్పత్తిదారుడికి, విద్యుత్‌ సంస్థలకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. 
- విద్యుత్‌ కొరత ఉంటే తక్షణమే కొనుగోలు చేసేందుకు విద్యుత్‌ సంస్థలు సిద్ధమవుతాయి. 
- ఆన్‌లైన్‌ విధానం తప్పించుకునేందుకు వీల్లేదు. కోర్టులను ఆశ్రయించినా శాస్త్రీయ సమాచారం ఆధారంగా వాస్తవాన్ని తేలికగా గుర్తించే వీలుంది. 

ఎప్పటికప్పుడు లభ్యత వివరాలు 
కచ్చితమైన విద్యుత్‌ లభ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ‘సమస్త్‌’తో సాధ్యమవుతుంది. ముందే అంచనాలు రూపొందించుకోవడం, అవసరమైన విద్యుత్‌ను ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు డిస్కమ్‌లకు వీలు కలుగుతుంది. పంపిణీ సంస్థలను ముప్పుతిప్పలు పెడుతున్న సౌర, పవన విద్యుత్‌ సమస్యలకు ఈ టెక్నాలజీ ద్వారా చెక్‌ పెట్టవచ్చని ట్రాన్స్‌కో వర్గాలు భావిస్తున్నాయి. ఉత్పత్తితో పాటు విద్యుత్‌ డిమాండ్‌నూ ఆన్‌లైన్‌ ద్వారా ముందే రికార్డు చేస్తారు కాబట్టి విద్యుదుత్పత్తిదారుడు ముందు పేర్కొన్నట్టు విద్యుత్‌ ఇవ్వకపోయినా, అనుకున్నదానికన్నా ఎక్కువగా అందించి గ్రిడ్‌కు ఇబ్బంది కలిగించినా విద్యుత్‌ సంస్థలు పక్కాగా లెక్కలు చూపించి అపరాధ రుసుము విధించే వీలుంది. 

నాణ్యత పెరుగుతుంది..
– చక్రధర్‌బాబు, ట్రాన్స్‌కో జేఎండీ 
‘సమస్త్‌ అమలులోకి వస్తే విద్యుత్‌ సంస్థల నాణ్యత రెట్టింపు అవుతుంది.  పవన, సౌర విద్యుదుత్పత్తిలో తేడాలను కచ్చితంగా గుర్తించవచ్చు. గ్రిడ్‌ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఆకస్మిక విద్యుత్తు కోతలకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. పీక్‌ అవర్స్‌లోనూ చౌకగా విద్యుత్తు తీసుకునే వీలుంటుంది. ఉత్తరప్రదేశ్‌ ఇప్పటికే ఈ తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చి మంచి ఫలితాలు సాధిస్తోంది’ 
ఇప్పుడు ఏం జరుగుతోంది?
రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు 430 మంది ఉత్పత్తిదారులు విద్యుత్‌ అందిస్తున్నారు. వీరి ద్వారా వచ్చే విద్యుత్‌ ఎంత అనేది ముందే తెలియచేయాలి. రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేసి లభ్యత, డిమాండ్‌ల మధ్య తేడాను తెలియజేస్తుంది. లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య విభాగం వెంటనే మార్కెట్లో  విద్యుత్‌ కొనుగోలు చేస్తుంది. ఒకవేళ డిమాండ్‌ తక్కువగా, ఉత్పత్తి ఎక్కువ ఉంటే ఖరీదు ఎక్కువగా ఉన్న విద్యుత్‌ ఉత్పత్తికి కోత పెడతారు. ఉత్పత్తిదారులు ఎస్‌ఎల్‌డీసీకి ఎంత విద్యుత్‌ ఇస్తామనేది ఒక రోజు ముందే వెల్లడించాలి.

ప్రస్తుతం పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిదారులు ముందు రోజు చెప్పినదానికి, మర్నాడు వాస్తవంగా అందించే విద్యుత్‌కు మధ్య భారీ తేడాలుంటున్నాయి. అప్పటికప్పుడు విద్యుత్‌ కొనుగోలుకు వెళ్లడం వల్ల ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్పత్తిదారుడి అంచనా, వాస్తవంగా ఇచ్చిన విద్యుత్‌ మధ్య తేడా ఇప్పటిదాకా మాన్యువల్‌ విధానంలో నమోదవుతోంది. తేడా ఉన్నప్పుడు ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు జరిమానా విధిస్తాయి. అయితే అంతా మాన్యువల్‌గా జరగడం వల్ల జరిమానాలను వ్యతిరేకిస్తూ ఉత్పత్తిదారులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా జరిమానాలను డిస్కమ్‌లు రాబట్టేందుకు వీలు లేకుండా ఉంది. 

సమస్త్‌ బృందం ఇదీ..
- అనుభవజ్ఞులైన ఇద్దరు చార్టర్డ్‌ అక్కౌంటెంట్లు 
- గణాంక నిపుణుడు
- ప్రాజెక్ట్‌ మేనేజర్‌ 
- మరో ఆరుగురు సభ్యులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement