సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ సిస్టంను మరింతగా విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పలు కొత్త నిబంధనలు రూపొందించింది. వాటితో సమగ్ర గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ రెగ్యులేషన్–2023ను ప్రతిపాదించింది.
సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు ఏపీఈఆర్‌సీ తెలిపింది. రాష్ట్రంలోని డిస్కంల పరిధిలో ఇన్‌స్టాల్ చేసిన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేని అన్ని గ్రిడ్–ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది.
ఇవీ నిబంధనలు
♦ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునేవారికి డిస్కంలు నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కల్పించాలి.
♦ గృహవిద్యుత్ వినియోగదారులు ఏర్పాటుచేసే రూఫ్‌టాప్ సిస్టమ్ ప్రాజెక్టు నుంచి 25 ఏళ్ల పాటు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ తీసుకునేలా డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి.
♦ ఇంటరాక్టివ్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారుకు అర్హత ఉంది.
♦ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసినవారే దాన్ని సురక్షితంగా చూసుకోవాలి. ఆపరేషన్, నిర్వహణ బాధ్యత వహించాలి.
♦ ప్రమాదంగానీ, పంపిణీ వ్యవస్థకు ఏదైనా నష్టంగానీ వాటిల్లినప్పుడు తమ నెట్‌వర్క్ నుంచి సోలార్ నెట్‌వర్క్‌ను డిస్‌కనెక్ట్ చేసే హక్కు డిస్కంలకు ఉంటుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే ఆ ఒప్పందం కాపీని డిస్కంలకు ఇవ్వాలి.
♦ అన్ని లిమిటెడ్ కంపెనీలు, ప్రభుత్వసంస్థలు, వ్యక్తులు, సంఘాలు, వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ఏర్పాటుకు అర్హులే. ఎవరు ఎక్కడైనా పెట్టుకుని విద్యుత్‌ను వాడుకోవచ్చు, విక్రయించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment