
డిస్కమ్‌ల కొనుగోళ్ల విషయంలో ఏపీఈఆర్‌సీ కఠిన నిబంధనలు
టెండర్ అంచనాతోపాటు వస్తువుల ధరలను తెలపాలి
విద్యుత్ పంపిణీ, సేకరణ, ప్రసారంపై మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసే కొనుగోళ్ల విషయంలో ఇకపై అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ డిస్కంలు తాము పరికరాలను కొనే ముందు, లేదా ఆ తర్వాత టెండర్ వివరాలను ఏపీఈఆర్‌సీకి పంపిస్తున్నాయి. కానీ ఆ టెండర్‌తో కొంటున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, ఇతర సామాగ్రి వంటి ధరలను విడివిడిగా వెల్లడించడం లేదు. ఇకపై ప్రతి పరికరానికి సంబంధించి ధరల జాబితాను మండలికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు విద్యుత్ పంపిణీ, సేకరణ, ప్రసార ప్రణాళికలపై ఏపీఈఆర్‌సీ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా 2024–25 నుంచి 2028–29 (5వ నియంత్రణ కాలం) వరకూ, 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకూ విద్యుత్ ప్రణాళికలను డిస్కంలు, ఏపీ ట్రాన్స్‌కో ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి. వాటిపై విచారణ జరిపిన మండలి ప్రతిపాదనల్లో చాలావరకు తిరస్కరించింది. కొన్నిటికి మాత్రమే అనుమతినిచ్చింది. మరికొన్నిటిపై మరింత సమాచారం కావాలని అడిగింది. అందులో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల అంశం ఒకటి.
రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. అలాగే వినియోగదారులకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అదీగాక ఇందుకు అయ్యే ఖర్చును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ఏపీఈఆర్‌సీ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే జగనన్న కాలనీల విద్యుద్దీకరణకు ఇప్పటికే ఆమోదం తెలిపింది.
అయితే, తాను ఆమోదించిన విలువల కంటే డిస్కంలు లెక్కల్లో చూపించిన వ్యయం ఎక్కువ అని గుర్తించిన ఏపీఈఆర్‌సీ తాజా ఆర్డర్‌లో గతంలో ఆమోదించిన విలువలకే ఓకే చెప్పింది. అలాగే విద్యుత్ కొనుగోళ్ల అంచనాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున.. దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించింది.