వందేళ్లకు సరిపడా విద్యుత్‌! | 29 Small Hydro Power Plants In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వందేళ్లకు సరిపడా విద్యుత్‌!

Published Sat, Mar 14 2020 5:01 AM | Last Updated on Sat, Mar 14 2020 5:01 AM

29 Small Hydro Power Plants In Andhra Pradesh - Sakshi

విజయవాడలోని విద్యుత్‌ సౌధలో జరిగిన సమీక్షలో పాల్గొన్న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, అధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో  దాదాపు 33 వేల మెగావాట్ల సామర్థ్యం గల 29 చిన్న జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో వందేళ్లకు సరిపడా విద్యుత్‌ లభించే వీలుంది. సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం నియమించిన టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్, వ్యాప్కోస్‌ సంస్థలు క్షేత్ర స్థాయి అధ్యయనం తర్వాత రాష్ట్ర సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన (నెడ్‌క్యాప్‌) సంస్థ ఎమ్‌డీ రమణారెడ్డికి ముసాయిదా నివేదిక అందజేశాయి. దీనిపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబుతోపాటు పలువురు విద్యుత్‌ అధికారులు విజయవాడలోని విద్యుత్‌ సౌధలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. 

కొండ కోనల నుంచి కాంతులు 
- సముద్రం పాలవుతున్న వాగులు, వంకలు, జలపాతాల్లో నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో మినీ హైడల్స్‌ ఏర్పాటు చేస్తారు. ఇలాంటివి రాష్ట్రంలో 30 ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 29 అనుకూలంగా ఉన్నాయని తేల్చారు.  
- మినీ హైడల్‌ విద్యుత్‌ ప్లాంట్లను రెండు కేటగిరీలుగా విభజిస్తారు. ఆన్‌ రివర్‌ విధానంలో.. పారే నదిపై కొత్తగా రిజర్వాయర్‌ నిర్మిస్తారు. కిందకెళ్లే నీటిని రిజర్వాయర్‌లోకి రివర్స్‌ పంపింగ్‌ విధానంలో పంపి నిల్వ చేస్తారు. ఆఫ్‌ రివర్‌ విధానంలో.. డొంకలు, వాగులు, జలపాతాలను ఎంపిక చేస్తారు. ఎగువ, దిగువ భాగంలో రెండు రిజర్వాయర్లు నిర్మించి నీటిని మళ్లిస్తారు.  
విద్యుత్‌ ఉత్పత్తి తర్వాత నీరు కింద ఉన్న రిజర్వాయర్‌లోకి వెళ్తుంది. మళ్లీ దీన్ని ఎగువ రిజర్వాయర్‌కు పంప్‌ చేస్తారు. ఇలా 25 చోట్ల ఏర్పాటు చేసే వీలుంది. 
డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మినీ హైడల్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి. చౌకగా లభించే సౌర విద్యుత్‌ను రివర్స్‌ పంపింగ్‌ కోసం ఉపయోగిస్తారు.  

పెట్టుబడి మాటేంటి 
ఈ ప్రాజెక్టుకు రూ.లక్షా 25 వేల కోట్ల నిధులు అవసరం. వీటిని పలు ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకునే వీలుంది. వాస్తవానికి మినీ హైడల్‌ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు కనీసం రూ.5 కోట్లు అవుతుందని అంచనా. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు వెచ్చించే సొమ్మును మినీ హైడల్‌కు ఖర్చు చేస్తే భారీ ప్రయోజనం ఉంటుంది.

మంచి ఆలోచన  
వచ్చే పదేళ్లలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ మరో 10 వేల మెగావాట్లు పెరుగుతుంది. భవిష్యత్‌ తరాలకు విద్యుత్‌ కోతలు లేకుండా చేసేందుకు మినీ హైడల్స్‌ ఉపయోగపడతాయి. వందేళ్లకు సరిపడా విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. 
– శ్రీకాంత్‌ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి 

ఇది ఆదాయం కూడా.. 
32,740 మెగావాట్ల మినీ హైడల్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ముసాయిదా నివేదికను పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి త్వరలో సమర్పిస్తాం. ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే ప్లాంట్లు నిర్మించుకునే వీలు కల్పిస్తాం. మన వనరులు వాడుకున్నందుకు వాళ్లు చెల్లించే మొత్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.  
– రమణారెడ్డి, నెడ్‌క్యాప్‌ ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement