ఆ ఊరంతా సోలార్ వెలుగులే!
భువనేశ్వర్: ఎవరో వస్తారని, ఊరికి కరెంట్ ఇస్తారని ఇన్నాళ్లు మోసపోయారు బారిపత గ్రామస్థులు. చివరకు చైతన్యవంతులై ఒక దండుగా కదిలి సోలార్ విద్యుత్‌ను స్వయంగా తెచ్చుకున్నారు. 61 ఇళ్లు, 350 మంది జనాభా కలిగిన బారిపత గ్రామాన్ని విద్యుత్ శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. భువనేశ్వర్‌కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ కుగ్రామానికి కరెంటా? అంటూ అధికారులు కూని రాగాలు తీస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి జాయ్ దీప్ నాయక్ రగిల్చిన చైతన్యంతో గ్రామస్థులంతా ఒకటిగా కదిలారు. నాల్కో, ఎకో సోలార్, జాన్సన్ సోలార్ తదితర అందుబాటులోవున్న అన్ని సోలార్ కంపెనీల వద్దకు తిరిగారు. చివరకు పలు కంపెనీల సహకారంతో ఊరి మొత్తానికి సోలార్ వెలుగులను తెచ్చుకున్నారు. అక్టోబర్ రెండు, గాంధీ జయంతి రోజున విద్యుత్ ప్లాంట్‌ను ఆవిష్కరించుకున్నారు. మొత్తం సోలార్ ప్లాంట్‌కు ఏడు లక్షల రూపాయలు ఖర్చుకాగా, అందులో సగం సొమ్మును గ్రామస్థులు భరించగా మిగతా సొమ్మును సోలార్ కంపెనీలే భరించాయి. ఊరి కూడలిలో పెద్ద సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, దాని నుంచి 61 ఇళ్లకు కరెంట్ ఇచ్చారు.
ప్రతి ఇంటికి రెండు లైట్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి ఇంట్లో మొబైల్ చార్జర్లకు వీలుగా ప్లగ్‌లు ఏర్పాటు చేశారు. ఊరిలో ఎనిమిది వీధి లైట్లను, కమ్యూనిటీ హాలులో ఎల్‌సీడీ టీవీని ఏర్పాటు చేసుకున్నారు. ఊరందరికి నీటిని సరఫరాచేసే బోరింగ్‌కు కూడా సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ప్యానెల్ వ్యవస్థ పూర్తిగా గ్రామం ఆధీనంలోనే కొనసాగుతుంది. సోలార్ ప్యానెళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచేందుకు, బ్యాటరీల్లో నీటి లెవళ్లను పర్యవేక్షించే బాధ్యతలను గ్రామానకి చెందిన ఐటీఐ డిప్లొమా హోల్డర్ ఎపిల్ కుమార్‌కు అప్పగించారు.